- పెరిగిన ప్రభుత్వ ప్రతిష్ట
- రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి ఉచిత బస్సు ప్రయాణం
- మహిళల్లో పట్టరాని ఆనందం
- ఉద్యోగినులకు ఊరట
- రోజువారీ పనులకు వెళ్లేవారికి వెసులుబాటు
- చిరువ్యాపారాలు చేసుకునే మహిళలకు చేదోడు
- జగన్, వైసీపీ ముఠాకు కడుపుమంట
అమరావతి (చైతన్యరథం): స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం గ్రాండ్ సక్సెస్ అయింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం శనివారం నుండి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ పథకంతో సర్కారు ప్రతిష్ట ఒక్కసారిగా పెరిగిపోయింది. కూటమి ప్రభుత్వంపై మహిళలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగమైన ఉచిత బస్సు పథకానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఈ పథకం ప్రారంభమైన తరువాత 30 గంటల్లో 12 లక్షల మందికి పైగా మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. పథకం తొలిరోజు ఉచిత బస్సు ప్రయాణాలతో రూ.5 కోట్ల మేర మహిళలు ఆదా చేసుకున్నారు. ఈ నెల 18 తేదీ సోమవారం నుంచి పనిదినాలు కావడంతో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రయాణించే అవకాశం ఉండటంతో బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది.
మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రంతోపాటు..వారి గౌరవాన్ని పెంచే సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 2.62 కోట్లమంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. పథకం అమలుకు నెలకు రూ.162 కోట్లు, ఏడాదికిరూ.1,942 కోట్లు ఖర్చవుతుంది. ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు పలువురు మాట్లాడుతూ తాము ఈ సౌకర్యాన్ని అస్సలు ఊహించలేదని చెప్పారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అమలు చేయటం కష్టమనుకున్నామని, అయినప్పటికీ ప్రభుత్వం తమకు ఉచిత బస్సును అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని పలువురు ఉద్యోగినులు తెలిపారు. మరికొందరు మహిళలు మాట్లాడుతూ తమకు కనీసంలో కనీసం రూ.2 వేల చొప్పున నెలకు ఆదా అవుతుందని పేర్కొన్నారు. తాము పనులపై రోజూ 20 నుంచి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తామని దీనికి రోజుకు 70 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేదని ఇప్పుడు ఆ సొమ్ము మిగులుతుందని తెలిపారు. దీంతో నెల మొత్తం మీద 2000 వరకు ఆదా అవుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలుగా కూటమి ప్రభుత్వం 8 వేల పైచిలుకు బస్సులను ఏర్పాటు చేసింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు సహా ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటికి గ్రామ స్థాయి నుంచి నగర, పట్టణ స్థాయి వరకు మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పొద్దుపొద్దున్నే పనులకు వెళ్లేవారు, కార్యాలయాలకు వెళ్లేవారు కూడా ఉచిత బస్సును వినియోగించుకుంటున్నారు.
కదులుతున్న పునాదులు.. గంగవెర్రులు
సూపర్‌సిక్స్ పథకాలు సూపర్‌హిట్ అవుతుంటే జగన్ రెడ్డికి, వైసీపీ ముఠాకు కంటిమీద కునుకు రావటం లేదు. నిజానికి ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించినప్పుడు వాటిని అమలు చేయటం కష్టమని జగన్ రెడ్డి అనుకున్నాడు. రాష్ట్ర ఆర్థికవ్యవస్థను ఐదేళ్ల తన పాలనలో కోలుకోలేని విధంగా కుళ్లబొడిచి వెళ్లినందున.. తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయటం అసాధ్యమని జగన్ రెడ్డి గుడ్డి నమ్మకంతో ఉన్నాడు. అయితే సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక తన అపార అనుభవంతో ఆర్థిక చిక్కుముళ్లు విప్పుకుంటూ ఒకటొకటిగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నాంది పలికిందే టీడీపీ ప్రభుత్వాలు అనే విషయాన్ని మరిచి..సంక్షేమ పధకాలపై సర్వ హక్కులు తనకు మాత్రమే ఉన్నాయనే పిచ్చి భ్రమలో ఉన్న జగన్‌కు ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలవుతుండటంతో తన కాళ్లకింద నేల కదిలిపోతున్న దశలో గంగవెర్రులెత్తుతున్నారు.
ఫేక్ ప్రచారమే అజెండా
అందుకే ప్రభుత్వం ఏ కార్యక్రమం ప్రారంభించినా అందులో మంచి గురించి ఆలోచించకుండా అడ్డగోలుగా ఫేక్ ప్రచారం చేయటమే వైసీపీ నేతలు, పేటీఎం బ్యాచ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకం ప్రారంభిస్తే.. మూడు సిలిండర్లూ ఒకేసారి ఇవ్వటం లేదని యాగీ చేశారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎందరు పిల్లలు ఉన్నా అందరికీ రూ.13 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తే.. ఏవేవో లెక్కలు తీసుకొచ్చి అందరికీ ఇవ్వటం లేదంటూ నీలి, కూలి మీడియాలో కథనాలు వండివార్చారు. ఇప్పుడు స్త్రీ శక్తి పేరుతో ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై దుష్ప్రచారం ప్రారంభించారు. ఎక్కడెక్కడి వీడియోలో తెచ్చి చూడండి.. ఉచిత బస్సు అని పెట్టారు కానీ ఎక్కించుకోవడం లేదని రచ్చ చేశారు. ఏసీ బస్సుల్లో ఎందుకు ఫ్రీ లేదు.. పేదలు ఏసీ బస్సుల్లో వెళ్లకూడదా అన్న అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. ఏసీ, వోల్వో, గరుడ, నాన్-స్టాప్ బస్సుల్లో ఈ పథకం అమలుచేయడం లేదంటూ, ఏ బస్సులోనైనా ఫ్రీ అని చెప్పి కొన్ని బస్సులకే పరిమితం చేశారని, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ ప్రయాణం అని చెప్పి ఈ ఆంక్షలతో పలు బస్సులు మారితే తప్ప ప్రయాణించలేని పరిస్థితి కల్పించిందని వైసీపీ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. స్త్రీశక్తికి అనుమతించిన బస్సుల్లో శ్రీకాకుళం నుంచి తిరుపతికి వెళ్లగళరా అని తప్పుడు విమర్శలు చేస్తోంది.
ఆర్థిక చేయూత కోసమే..
స్త్రీశక్తి పథకం ఉద్దేశం మహిళలపై ఆర్థిక భారం తగ్గించేందుకే తప్ప విలాసయాత్రలు చేయడానికి కాదు. ఈ విషయం మహిళలకు అర్థమయింది. కానీ వైసీపీ పేటీఎం బ్యాచ్‌కే ఇంకా అర్థం కావటం లేదు. రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పెద్ద పట్టణాల్లో, వాటి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న మహిళలు, విద్యార్థినులు… చదువులు, ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు, రోజువారీ కూలిపనులు చేసుకునేందుకు రోజూ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. వారందరికీ స్త్రీశక్తి పధకంతో ఎంతో ఉపశమనం లభిస్తుంది. వారందరూ ఈ పథకంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా స్త్రీశక్తి పధకం ఉపయోగించుకొని మహిళలు తీర్థయాత్రలకు కూడా వెళ్ళవచ్చు. ఉదాహరణకు శ్రీకాకుళంలో నివసిస్తున్న మహిళలు విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకోవడానికి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఒక వేళ డైరెక్ట్ బస్సులు దొరక్కపోతే టికెట్ కొనవలసిన అవసరం లేదు కనుక రెండు బస్సులు మారవచ్చు. వాస్తవానికి రైలుతో పోలిస్తే బస్సు ప్రయాణం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకు సిద్దపడి బస్సు ఎక్కుతున్నప్పుడు రెండు బస్సులు మారడం పెద్ద కష్టమేమీ కాదు. స్త్రీశక్తి పధకంపై వైసీపీ ఇంకా విమర్శలు కొనసాగిస్తే దీని వలన లబ్ధి పొందుతున్న మహిళలే ఛీ కొడతారు.
ఎంతో ఆలోచించి పకడ్బందీగా..
ఉచితబస్సు పథకాన్ని ప్రారంభించి ఒక్క రోజు మాత్రమే అయింది. అందులో లోటుపాట్లు ఏమైనా ఉంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు సవరించుకుని పూర్తి స్థాయిలో మహిళలకు మెరుగైన సేవలు అందిస్తుంది. అన్న క్యాంటీన్లు అద్భుతంగా నడుస్తూండటమే దీనికి ఉదాహరణ. వాస్తవానికి ఈ పథకం అమలుపై ప్రభుత్వం అనేక సార్లు యోచించింది. ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి..ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయినా.. ఇంకా ఉచిత బస్సును ప్రారంభించలేదని.. మహిళలను మోసం చేస్తున్నారని.. జగన్ స్వయంగా అనేక సందర్భాల్లో ఆరోపించారు. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుకు వెరవకుండా స్త్రీ శక్తి పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పరిణామాలపై మహిళా లోకం.. ఆనందం వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు పట్ల కృతజ్ఞత చాటుతోంది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ కొట్టేస్తున్నారు. వీటితో వైసీపీ ఓటు బ్యాంకు తారుమారు అవుతోందనే భయంతో కోడిగుడ్డుకి ఈకలు పీకుతున్నారు. స్త్రీశక్తితో జగన్ ఇలాగే ఆటలాడుకుంటే ఏదో రోజు వాళ్ళే బుద్ధి చెపుతారు. వైసీపీ ఎంత ఆయాసపడినా ఉపయోగం ఉండదు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజలే తరిమి కొడతారు.