- వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
- రేపు తీరందాటే అవకాశం
- కోస్తాకు భారీ వర్షసూచన
అమరావతి (చైతన్యరథం): దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడిరచింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కాగా సోమవారం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు, ఈనెల 24న వాయవ్య బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు తెలిపారు.