రాజముద్రతో వారికి కొత్త పాస్ పుస్తకాలు
మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
కొండపి(చైతన్యరథం): రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పాటుపడుతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో అన్నదాత సుఖీభవ కృతజ్ఞతలో భాగంగా భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రితో పాటు మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పాటుపడుతోంది. విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి దశలో నూ రైతులకు అండగా ఉంటున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతులకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తు న్నాం. రైతులకు సబ్సిడీకి యంత్రాలు, యంత్ర పరికరాలు ఇస్తున్నాం.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ వ్యవసాయ రంగాన్ని నిర్వీ ర్యం చేశారు. కనీసం రైతులకు సరైన గోనె సంచులు ఇవ్వలేక చిల్లులు పడ్డ గోనె సంచులు ఇచ్చారు. గత ఐదేళ్లలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనికి కారణం జగన్. జగన్ పబ్లిసిటీ పిచ్చితో పట్టాదారు పాసుపుస్తకాల పైనా తన బొమ్మ వేసుకున్నారు..మేం రాజముద్రతో రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.