కడప (చైతన్యరథం): పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని కడప జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్ సవిత అన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి ఆదివారం చివరి రోజు కావడంతో కూటమి అగ్రనేతలు, మంత్రులు శనివారం జోరుగా ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఎస్ సవిత, పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రమంతా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక వైపే చూస్తోందని మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో పులివెందుల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ఏపీలో ఇప్పుడున్న పింఛన్ విధానం ప్రపంచంలోనే లేదని సవిత పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలపై గత జగన్ రెడ్డి అణిచివేతకు పాల్పడిరదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాత్రం వారికి అండగా ఉంటూ అభివృద్ధి చేస్తోందన్నారు. పులివెందులకు ఇప్పటివరకూ నీళ్లిచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదే అని స్పష్టం చేశారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి కోసం.. సొంత నియోజకవర్గంలోని పులివెందుల ఎర్రచెరువుకు జగన్ రెడ్డి నీళ్లు ఇవ్వలేదని పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి మండిపడ్డారు. ఎర్రచెరువుకు త్వరలో నీళ్లు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎర్రచెరువుకు నీళ్లించ్చేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోలేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో దందాలు, అక్రమాలు తప్ప అభివృద్ధి జరగలేదని బీటెక్ రవి విమర్శలు గుప్పించారు. ఇలాఉంటే పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి పెద్దఎత్తున టీడీపీలో చేరికలు జరుగుతున్నాయి. రోజూ చేరికలతో టీడీపీలో జోష్ పెరుగుతోంది.