` విశాఖ కేంద్ర కారాగారంలో అధికారులు, ఖైదీలకు రాఖీలు కట్టిన మంత్రి
విశాఖపట్నం (చైతన్యరథం): యువత మంచీ,చెడులు తెలుసుకుని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హితవు పలికారు. రాఖీ పండుగ సందర్భంగా శనివారం విశాఖ కేంద్ర కారాగారానికి వెళ్లిన మంత్రి అనిత.. జైలు అధికారులకు, 30 మంది యువ ఖైదీలకు రాఖీలు కట్టారు. గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు వారు చేసిన నేరం, భవిష్యత్‌లో ఎదురయ్యే పర్యవసానాలపై అవగాహన కల్పించారు. యువత మంచి, చెడులను తెలుసుకోవాలన్నారు. తెలిసీ తెలియని వయస్సులో ఈజీమనీ కోసం ఆలోచిస్తే, జీవితాలు నాశనం అయిపోతాయని హెచ్చరించారు. బంగారు భవిష్యత్తులను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. బతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఖైదీలందరూ విడుదలై వచ్చే సంవత్సరం ఇంటి దగ్గరే రాఖీపౌర్ణమి జరుపుకోవాలని ఆకాంక్షించారు.