` మీ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని నెం.1గా తీర్చిదిద్దుతా
` మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటన
` మంత్రికి రాఖీలు కట్టిన మంగళగిరి మహిళలు
ఉండవల్లి (చైతన్యరథం): నాకు సొంతంగా అక్కలు, చెల్లెళ్లు లేరు.. మంగళగిరి మహిళలే నా అక్కాచెల్లెళ్లు.. ఈరోజు మీరంతా రాఖీకట్టి నాకు అందించిన ఆశీస్సులు కొండంత బలాన్నిచ్చాయి.. మీ ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెం.1గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాఖీపౌర్ణమిని పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు శనివారం ఉండవల్లి నివాసానికి వచ్చి మంత్రి లోకేష్‌కు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… మంగళగిరి ఆడబిడ్డలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాననన్నారు. 2019 ఎన్నికల్లో నేను తొలిసారిగా పోటీచేసినపుడు 5,300 ఓట్లతో ఓటమిచెందాను. అప్పుడు నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను విమర్శించడమేగాక కొడుకును గెలిపించుకోలేక పోయారంటూ చంద్రబాబుని కూడా అవమానించారు.
అయితే ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో పనిచేశాను. సొంత నిధులతో 26 అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేసి మీ అందరి అభిమానాన్ని చూరగొన్నాను. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మంగళగిరిలో నన్ను రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద మెజారిటీతో గెలిపించి విమర్శించిన వారి నోళ్లు మూయించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాను. ఆనాడు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది ప్రభుత్వభూముల్లో నివసించే వారికి శాశ్వత ఇళ్లపట్టాలు. తొలి ఏడాదిలోనే దాదాపు 3వేలమందికి పైగా పేదలకు వెయ్యికోట్ల విలువైన ఆస్తిని పంపిణీచేసి మాట నిలబెట్టుకున్నా. త్వరలోనే మరోవిడత ఇళ్లపట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గంలో 200 అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాను.
ఇందులో ప్రధానమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజి, విద్యుత్, గ్యాస్ పైప్ లైన్ల ఏర్పాటు, 100 పడకల ఆసుపత్రి, స్వర్ణకారుల కోసం జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు వంటివి పురోగతిలో ఉన్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నాం. మహా ప్రస్థానం పేరుతో శ్మశాన వాటికల నిర్మాణం, పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఇలా ఇచ్చిన ప్రతిహామీని నిలబెట్టుకోవడానికి నిరంతరం కృషిచేస్తున్నాను. మీరు ఇచ్చిన భారీ మెజారిటీ నా బాధ్యతను మరింత పెంచింది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రెట్టింపు కష్టపడుతున్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా. మీ అందరి సహకారంతో మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.