పాడేరులో నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం
హాజరవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే గిరిజన ప్రాంతాల్లో నూతనాధ్యాయం ఆరంభమైంది. ఏజెన్సీ జిల్లాల్లోని ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుక్షణం కృషి చేస్తోంది. గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు పాడేరులో జరుగనున్న కార్యక్రమానికి హాజరవుతున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ- కృత్రిమ మేధస్సు, ఆదివాసీల భవిష్యత్తు అనే థీమ్‌తో ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ గిరిజన దినోత్సవ నిర్వహణకు పిలుపునిచ్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జిల్లా పాడేరులో అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. పాడేరు మండలం వంజంగి గ్రామంలో నిర్వహించే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. తొలుత మోదకొండమ్మ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం స్థానిక గిరిజన సంప్రదాయ వేడుకలకు హాజరవుతారు. ఆదివాసీల ఇళ్లకు వెళ్లి వారి కష్టసుఖాలను ముఖ్యమంత్రి స్వయంగా తెలుసుకోనున్నారు. అనంతరం కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో సీఎం మాట్లాడనున్నారు. తర్వాత లగిసపల్లె వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం అక్కడినుంచే శంకుస్థాపన చేయనున్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై సీఎం సమక్షంలో ఎంఓయూలను కుదుర్చుకోనున్నారు. అనంతరం కొద్దిసేపు పార్టీ శ్రేణులతోనూ ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు.
గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టులు
మారుమూల గిరిజన ప్రాంతాలు, ఆవాసాలను ఏజెన్సీలోని ప్రధాన కేంద్రాలు, ఇతర మైదాన ప్రాంతాలతో అనుసంధానించేలా ప్రభుత్వం రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల్లో వేగం పెంచింది. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు నిర్మాణంతోపాటు ఆదివాసీల ప్రాంతాలు, నివాసాలకు కనెక్టివిటీ కోసం రూ.2404 కోట్లు ఖర్చు చేయనుంది. వచ్చే ఐదేళ్లలో 2075కు పైగా గిరిజన గ్రామాలకు, నివాసాలను రోడ్లు, వంతెనలతో అనుసంధానించాలని నిర్ణయించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రోడ్ల కారిడార్లను రూ.41 కోట్లతో చేపట్టనుంది. ఐటీడీఏ చింతూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 50నుంచి 100 పడకల ఆస్పత్రికిగా మార్చడంతోపాటు సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, కేఆర్ పురం, శ్రీశైలం ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు రూ.50 కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. త్వరలోనే నిర్మాణాలు పూర్తై ఆస్పత్రులు అందుబాటులోకి రానున్నాయి. పాడేరులో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే జల్ జీవన్ మిషన్ కింద గిరిజన ప్రాంతాల్లోని 13,816 ఆవాసాలకు మంచినీటి సరఫరా కోసం రూ.2,373 కోట్లతో ప్రభుత్వం పనులు చేపట్టింది. 2026నాటికి ఈ పనులు పూర్తి చేసి ఆదివాసీలు అందరికీ తాగునీరు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. డీఎస్సీ సహా వివిధ పోటీ పరీక్షలకు గిరిజన యువతీ యువకులు సన్నద్ధం చేసేందుకు విశాఖ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో స్టడీ సర్కిళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే గిరిజన ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను వసతి గృహాలుగా మార్చేందుకు రూ.150 కోట్లను కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. 520కి పైగా రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను వసతి గృహాలుగా మార్చటం కోసం రూ.150 కోట్లను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. 520కి పైగా పాఠశాల భవనాల నిర్మాణం కోసం రూ.64 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. పార్వతీపురం మన్యంలో పూర్ణపాడు-కొమరాడ మధ్య నాగావళి నదిపై రూ.10 కోట్లతో హై లెవల్ వంతెనను కూడా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు ప్రపంచ బ్రాండ్‌గా మారిన అరకు కాఫీని మరింత విస్తరించేందుకు వీలుగా మన్యంలో ప్లాంటేషన్‌ను పెంచేందుకూ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. కాఫీ పల్పింగ్, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయటంతోపాటు ప్లాంటేషన్ విస్తరణకు రూ.202 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా పర్యాటక ప్రాజెక్టులను చేపట్టనున్నారు.
ఆదివాసీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత
గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అధికారంలోకి వచ్చిన అనంతరం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి రూ.7557 కోట్ల రూపాయల్ని షెడ్యూల్డ్ ట్రైబ్ కాంపోనెంట్ కింద కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది. అధికారంలోకి వస్తూనే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఏజెన్సీ ప్రాంతాల్లోవున్న 4.82 లక్షలమంది గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తోంది. అలాగే త్వరలోనే సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఇంటిపై సౌరఫలకలను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,77,051 మంది గిరిజనులకు ప్రతి నెలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ప్రభుత్వం రూ.1,595 కోట్లు ఖర్చు చేస్తోంది. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా 4,86,803 మంది గిరిజన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.642 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలనకు ‘మిషన్-2047’ ను ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పటికే 1,487 మంది రోగులను గుర్తించి నెలకు రూ.10,000 చొప్పున ఫించన్ అందిస్తోంది. మరోవైపు ప్రకృతి వ్యవసాయం ద్వారా గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది. అలాగే ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు ప్రోత్సహించేలా కూటమి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.