- అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): సీఎం చంద్రబాబు స్ఫూర్తితో బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఇద్దరు ప్రజా ప్రతినిధులు ముందుకొచ్చారు. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వినుకొండలోని ఎస్టీ వర్గాలకు చెందిన 100 కుటుంబాలను దత్తత తీసుకుంటానని సీఎంకు స్పష్టం చేశారు. తాను నిర్వహిస్తున్న శివశక్తి ఫౌండేషన్ తరపున వారి అభిృద్ధికి కృషి చేస్తానని చీఫ్ విప్ చెప్పారు. అలాగే తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సైతం తన నియోజకవర్గంలో వంద పేద కుటుంబాలను దత్తత తీసుకుంటామని సీఎంకు వివరించారు. పీ-4పై ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న వీరిద్దరూ ఈ ప్రకటన చేశారు. పీ-4 కార్యక్రమం స్పూర్తితో పాఠశాలలు, ట్రిబుల్ ఐటీవంటి వాటిలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేలా కార్యక్రమాలు చేపడుతోన్నట్టు మంత్రి కొలుసు పార్ధసారథి సీఎంకు చెప్పారు. బడుగు వర్గాల్లోని పేదలకు ప్రభతి కనబరిచే వారికి ఆర్థిక సాయం అందిస్తానని మంత్రి తెలిపారు. పీ-4 కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి ముందుకొచ్చిన వీరికి సీఎం అభినందనలు తెలిపారు. మరింత ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.