- ఏం మాట్లాడతాడో ఆయనే తెలీదు
- కేజీకి, టన్నుకీ తేడా తెలీని వ్యక్తి జగన్
- ఏపీ హోం మంత్రి అనిత ఎద్దేవా
గజపతినగరం (చైతన్య రథం): పొగాకు రైతుల దగ్గరికి వెళ్లిన జగన్‌రెడ్డి కేజీకి, టన్నుకు తేడా తెలియకుండా మాట్లాడారని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. మామిడి రైతుల దగ్గరికి వెళ్లి.. మామిడి కాయలు తొక్కించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. శనివారం గజపతినగరం వ్యవసాయ మార్కెట్ యార్డులో ‘అన్నదాతా సుఖీభవ- పీఎం కిసాన్’ తొలి విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల విషయంలో రాజకీయం చేయరాదని హితవు పలికారు. రాజకీయం చేసేందుకు వైకాపా నాయకులు వ్యవసాయాన్ని అడ్డుపెట్టుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రైతు కుటుంబాలకు మేలుచేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తే.. ఉద్దేశపూర్వకంగానే అడ్డు తగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం అంటే సీఎం చంద్రబాబుకు చాలా ఇష్టమని, రీ సర్వేలో రైతుల ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అనిత వెల్లడిరచారు. రైతన్నలు సాంకేతికతను వినియోగించుకోవాలని, ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు.
నాట్లు వేసిన హోంమంత్రి
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పొలంలో దిగి వరి నాట్లు వేశారు. శనివారం ఆమె విజయనగరం జిల్లాలో పర్యటించారు. గజపతినగరం మార్కెట్ యార్డులో నిర్వహించిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పంపిణీ కార్యక్రమాలకు అనిత హాజరయ్యారు. మార్గమధ్యంలో పురిటిపెంట, మధుపాడ సరిహద్దుల్లోని పొలంలో దిగి వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా రైతులు, వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.