- సీఎం చంద్రబాబు పాలనా సమర్థతకు మచ్చుతునక
- జిఏస్టీ ఆదాయంలో 14 శాతం వృద్ధి
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయాల్లో 46శాతం వృద్ధి
- తప్పుదారి పట్టించడానికే వైసీపీ దుష్ప్రచారం
- ఆర్థిక గణాంకాలే అసత్యాలకు సరైన సమాధానం
- ఏపీ బయో డైవర్సిటీ బోర్డ్ చైర్మన్ నీలాయపాలెం వెల్లడి
అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని ఏపీ బయో డైవర్సిటీ బోర్డ్ చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఆర్థికంగా రాష్ట్రం మళ్లీ అభివృద్ధి మార్గంలోకి వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన సంకల్పబలంతో, విపత్కర పరిస్థితులనుంచి బయటపడుతున్నాం. దీనికి నిదర్శనం తాజాగా విడుదలైన జీఎస్టీ గణాంకాలు’’ అని పేర్కొన్నారు.
జీఎస్టీ ఆదాయాల్లో 14 శాతం వృద్ధి..
‘‘ఆగస్టు 1న కేంద్రం విడుదల చేసిన జీఎస్టీ గణాంకాల ప్రకారం, 2025 జులైలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.3803 కోట్లకు చేరింది. ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన రూ.3346 కోట్లతో పోలిస్తే 14 శాతం అధికం. గత నెల (2025 జూన్)తో పోలిస్తే కూడా రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 6 శాతం పెరిగింది. ఈ పెరుగుదల సరళంగా కనబడుతున్నా, దీని వెనుక ప్రజల విశ్వాసం, ప్రభుత్వ విధానాల ప్రభావం దాగి ఉంది. ఇది మామూలు సంఖ్యల వృద్ధి కాదు. ఇది పాలన మీద ప్రజలకు తిరిగి వచ్చిన నమ్మకాన్ని సూచిస్తుంది. బహుళ పారదర్శక విధానాల అమలు, అవినీతిముక్త పాలన `ఇవన్నీ కలిసి ఈ ఆదాయ వృద్ధికి కారణం’’ అని విజయ్ కుమార్ వివరించారు.
వైసీపీ తప్పుదారి పట్టించే ప్రచారం..
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఇటీవల జూన్ నెలకు సంబంధించిన కాగ్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని చేసిన ఆరోపణలను తెలుగుదేశం పార్టీ ఖండిరచింది. ‘‘సాక్షిలో పేజీ నిండా వార్తలు పెట్టి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని తప్పుడు ప్రచారం చేశారు. కానీ, జీఎస్టీ గణాంకాలు వాస్తవమేమిటో అందరికీ స్పష్టంగా చూపిస్తున్నాయి’’ అని అన్నారు. జగన్ టీం గణాంకాల్ని అకృత్యంగా వక్రీకరించేందుకు ఎస్‌జీఎస్‌టీ, ఐజీఎస్టీలను విడదీసి చూపుతూ ప్రజల్ని తప్పుదారిపట్టించే ప్రయత్నం చేసిందని నీలాయపాలెం మండిపడ్డారు. ‘‘2024`25 మొదటి త్రైమాసికంతో పోలిస్తే, 2025`26 మొదటి త్రైమాసికంలో జిపస్టీ ఆదాయం రూ.8286 కోట్లనుంచి రూ.7914 కోట్లకు తగ్గిందని చెప్పడం పూర్తిగా తప్పుడు భాష్యం. ఏడాదిపాటు మొత్తం గణాంకాలపై సమగ్ర దృష్టిలేకుండా, తాత్కాలిక తగ్గుదలల్ని చూపించి అపోహ కలిగించడమే వారి లక్ష్యం’’ అని విమర్శించారు.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయాల్లో 46శాతం వృద్ధి
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మరో కీలక సూచికగా నిలిచే స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయాల్లో 2024 తొలి త్రైమాసికంలో రూ. 1819 కోట్లు ఉండగా, 2025లో అదే మూడు నెలల్లో రూ. 2661 కోట్లకు పెరిగింది. ఇది ఏకంగా 46 శాతం వృద్ధి. ‘‘ఇది ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం పెరుగుతోందని, ఆర్ధిక ఆత్మవిశ్వాసం మళ్లీ నెలకొంటోందని చూపిస్తోంది’’ అని అన్నారు. ‘‘ఒకవేళ జగన్ చెప్పినట్టు ఎన్నికల సంవత్సరం అయినందున 2024లో ఆదాయం తక్కువని ఒప్పుకుంటే, అదే జీఎస్టీకి ఎందుకు వర్తించకూడదు? ప్రజలపై ఖర్చు పెరిగితే అది మళ్లీ ప్రభుత్వ ఆదాయంగా మారుతుంది కదా? అది మౌలిక ఆర్థిక సిద్ధాంతం’’ అని వివరించారు.
అప్పుల విషయంలోనూ జాగ్రత్తగా..
తాజా గణాంకాల ప్రకారం, 2025 ఏప్రిల్-జులైలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు రూ.42,693 కోట్లు మాత్రమే. అదే కాలంలో 2024లో వైసీపీ ప్రభుత్వం రూ.43,052 కోట్లు అప్పులు చేసింది. అంటే, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోలిస్తే రూ.400 కోట్లు తక్కువ అప్పులు చేసిందని, అంతేకాకుండా గత ప్రభుత్వ పాలనలో ఏర్పడ్డ రూ.25,000 కోట్ల బకాయిలను సర్దుబాటు చేస్తోందని తెలిపారు.
మద్యం ఆదాయం.. వైసీపీ పాలనలో వెలగబెట్టిన స్కాంల స్పష్టత
2025లో స్టేట్ ఎక్సైజ్ ఆదాయం రూ.4055 కోట్లకు చేరింది. ఇది గత ఏడాది ఇదే సమయంలో రూ.3672 కోట్లు. ‘‘మేము మద్యం ధరలు తగ్గించాం. అయినా ఆదాయం పెరిగింది. మీరు మాత్రం ధరలు పెంచారు. అయినా ఆదాయం తక్కువే వచ్చింది. దీంతో మీ హయాంలో మద్యం ఆదాయం ప్రభుత్వ ఖజానాకే రాకుండా బయటకు వెళ్లిందన్న అనుమానానికి బలం లభిస్తుంది. ఇదే అసలు లిక్కర్ స్కాం!’’ అని మండిపడ్డారు.
పెట్టుబడుల్లో మూడు రెట్లు అధిక వ్యయం.. అభివృద్ధికి బలమైన సంకేతం
2025 త్రైమాసికంలో రూ.6053 కోట్లు కాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఖర్చు చేసింది కూటమి ప్రభుత్వం. ఇది గత ఏడాది రూ.1647 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. ‘‘మేము అప్పులు చేసి బటన్లు నొక్కలేదు. రోడ్లు, ప్రాజెక్టులు, సాగునీటి పనులు మొదలైన అభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టాం’’ అని స్పష్టం చేశారు.
రెవెన్యూ ఖర్చు తగ్గింపుతో నిర్వాహక సామర్థ్యం
2025లో రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ రూ.27,184 కోట్లకు పరిమితమవగా, ఇది 2024లో రూ.29,269 కోట్లు ఉంది. అంటే ప్రభుత్వ నిర్వహణలో వ్యవస్థీకృత నిబంధనల అమలు, వ్యయ నియంత్రణ స్పష్టంగా కనిపిస్తుందని నీలాయపాలెం వివరించారు.
వడ్డీ భారం.. జగన్ హయాంలో చేసిన అప్పుల ఫలితం
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నెలకు సగటున రూ.2900 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తోంది. మొత్తం వడ్డీ భారం మూడు నెలల్లో రూ.8717 కోట్లకు చేరింది. ఇది గత ఏడాది రూ.7596 కోట్లతో పోలిస్తే రూ.1200 కోట్లు అధికం. ‘‘ఇది జగన్ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన తీరునకు నిదర్శన’’మని దుయ్యబట్టారు.
ప్రజలకు సత్యం చెప్పాలనే ఈ ప్రయత్నం
‘‘ఆర్థిక గణాంకాలు క్లిష్టంగా ఉండవచ్చు. కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు సహించం. గణాంకాలే వాస్తవాలను చెబుతున్నాయి. చంద్రబాబు మార్గదర్శకతలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి పథంలోకి వస్తోంది. ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది. వైసీపీ పెట్టిన రూ.26 వేల కోట్ల బకాయిలు తీర్చాం. రూ.3400 కోట్ల ఫీజు బకాయిలు కొద్దికొద్దిగా తీరుస్తున్నాం. ధాన్యం బకాయిలు తీర్చాం. పెన్షన్ రూ.1000లు పెంచాం. అది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి జూన్ నెలలో అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి అమలు చేసి జూన్ వరకు కలిపి పింఛన్ అందజేశాం. తల్లికి వందనం రూ.11 వేల కోట్లు ఇచ్చాం. 55 లక్షలమంది రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపజేసి తొలి విడత రాష్ట్రవాటాగా రూ.5 వేలు అందజేశాం. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు అమలులోకి తీసుకువస్తున్నాం. సంపద సృష్టిస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. పెట్టుబడులు తీసుకువస్తున్నాం. ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఇంతకింతకు ముందుకు తీసుకువెళ్తాం. మేము ఈ మార్గాన్ని కొనసాగిస్తాం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం’’ అని నీలాయపాలెం స్పష్టం చేశారు.