- 29 హైవే ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు మన అదృష్టం
- కూటమి ఐక్యతను దెబ్బతీసే కుట్రలను ఛేదిద్దాం
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు
మంగళగిరి (చైతన్య రథం): ఒక దేశ ప్రగతికి చిహ్నాలు రోడ్లు, రవాణా మార్గాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆనాడు వాజపేయి ముందుచూపుతో స్వర్ణచతుర్భుజి తెచ్చారని.. ఆయన వేసిన రోడ్లవల్లే దేశం ఎంతో అభివృద్ధి సాధ్యమైందన్నారు. రూ.5 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ఇవాళ ఏపీలో రూ.5వేల కోట్లతో 29 హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకున్నాం. ఎన్డీయే వచ్చాక దేశంలో కీలకమైన ప్రాజెక్టులు చేపట్టింది. ఇవాళ హైవేల నిర్మాణ వేగం మూడురెట్లు పెరిగింది. అడవితల్లి బాట పేరుతో గిరిజన ప్రాంతాల్లోనూ రోడ్లును నిర్మిస్తున్నారు. 78 ఏళ్లుగా రోడ్లులేని గిరిజన ప్రాంతాలకు ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. డోలీ మోతలు లేకుండా చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయి. మెరుగైన రోడ్లపైనే రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుంది. కూల్చివేతల ప్రభుత్వం, రోడ్లువేయని ప్రభుత్వాన్ని చూశాం. మరో 15 ఏళ్లపాటు కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలి’’ అని అన్నారు.
‘‘కూల్చివేతలతో గత ప్రభుత్వం మొదలైతే.. ప్రతీ గ్రామంలో కూటమి ప్రభుత్వం గుంతలు పూడ్చి కొత్త రహదారులు నిర్మిస్తోంది. కూటమి ఐక్యతను దెబ్బతీసే కుట్రలన్నింటినీ ఐక్యతతో ఛేదిద్దాం. కూటమి నాయకుల మధ్య చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చినా.. పరిష్కరించుకుని కలసికట్టుగా ముందుకు సాగుదాం. అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలి. ఇవాళ దేశ ప్రగతికి, పురోగతికి సంబంధించిన కార్యక్రమానికి ఏపీ వేదికైంది. సుస్థిర ఆర్థికాభివృద్ధితో దేశం ముందుకెళ్తాంది. వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు ప్రధాన ఆయుధం మౌలిక వసతుల కల్పన. హైవే మాన్ ఆఫ్ ఇండియాగా గడ్కరీ జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి గడ్కరీ.. ఈ ముగ్గురి విజన్‌తో దేశం, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయి’’ అని పవన్ అన్నారు.
ప్రతి హామీని నిలబెట్టుకున్న సీఎం గ్రేట్: సత్యకుమార్
వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ప్రతీ హామీనీ అమలు చేస్తున్నారన్నారని సంతోషం వ్యక్తం చేశారు. నాగరికతకు చిహ్నాలైన రహదారుల అభివృద్ధిపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధివల్ల రాష్ట్ర ముఖచిత్రం మారుతోందన్నారు. అభివృద్ధికి పెద్ద పీట వేసే నాయకుడు ఓవైపు ఉంటే…, రఫారఫా భాషతో విధ్వేషాలు రెచ్చగొట్టే నాయకుడు మరోవైపు ఉన్నాడని ఎద్దేవా చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే నాయకత్వం ఓవైపుఉంటే, యువతను చెడగొట్టి మంత్రుల్ని హత్య చేయిస్తాం అనే నాయకత్వం మరోవైపు ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించాలని సత్యకుమార్ పేర్కొన్నారు.