- సూపర్ సిక్స్ అమలును సహించలేకపోతున్నారు
- లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు ఆగ్రహం
మంగళగిరి (చైతన్య రథం): కూటమి ప్రభుత్వం అమలు చేస్తోన్న సూపర్ సిక్స్ పథకాల అమలు చూసి వైసీపీ నేతలు ఓర్వలేక ఆత్మహుతి చేసుకునే స్థాయికి దిగజారుతున్నారని ఏపీ లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు ఎద్దేవా చేశారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోందని, ఈ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అయితే, వైసీపీ నాయకులు మాత్రం అసూయతో మీడియా ముందుకొచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు, రాష్ట్ర ఆర్థిక స్థితి ఎలా ఉన్నప్పటికీ చంద్రబాబు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని దర్శిలో చంద్రబాబు ప్రారంభించారని మాణిక్యరావు అన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు 16,347 మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా సృష్టించలేదని విమర్శించారు. మూడు వేల పెన్షన్ ఇస్తానని జగన్ మోసం చేశాడని, కానీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా పెంచిన పెన్షన్‌ను మూడు నెలలకు కలిపి అందించిందని గుర్తు చేశారు. జగన్ పాలన విధ్వంసంతో మొదలైందని, కానీ కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్‌లను పునఃప్రారంభించి పేదవారికి అన్నం అందించడంతో పాలన ప్రారంభించిందని గుర్తు చేశారు. దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు అందిస్తున్నామని, తల్లికి వందనం పథకంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, చంద్రబాబు ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఈ పథకం అందించారని పేర్కొన్నారు. కూటమి పాలన చూసి వైసీపీ నాయకులు సమాధానం చెప్పలేక తప్పుడు ఆరోపణలకు దిగజారారని మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చంద్రబాబు, లోకేష్ నిరంతరం కృషి చేస్తుంటే.. ఒక్క పరిశ్రమనూ తీసుకురాలేని వైసీపీ నాయకులు అబద్ధాల ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు లోకేష్ 163 ప్రాజెక్టులను తీసుకొచ్చి, సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించారని, 20 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనను వ్యక్తిగత ప్రయోజనాలకు వెళ్లినట్లు వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, ఐదేళ్లలో ఒక్క పరిశ్రమనూ తీసుకురాలేని వారు ఇలాంటి కువిమర్శలు చేయడం అవివేకమని పిల్లి మాణిక్యరావు దుయ్యబట్టారు. అమరావతిని భ్రమరావతిగా మార్చి అక్కడి సామగ్రిని అమ్ముకున్న చరిత్ర వైసీపీదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతుంటే, వైసీపీ ఓర్చుకోలేకపోతోందని, అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం వైసీపీ సాధించలేనిది సాధిస్తోందని మాణిక్యరావు స్పష్టం చేశారు.