- కూటమి ప్రభుత్వం ప్రతీ హామీనీ అమలు చేస్తుంది
- అన్నదాత సుఖీభవ’ను ప్రారంభించనున్న సీఎం
- సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వం ధ్యేయం
- ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
దర్శి (చైతన్య రథం): ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. శుక్రవారం ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. శనివారం జరగనున్న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను సహచర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, అశోక్‌రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మీ, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. హెలిపాడ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ… అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను పెంచినట్లు గుర్తు చేశారు.
దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం నిధులను జమ చేశామని వివరించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అంతే కాకుండా నేడు రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా లక్ష వితంతు పింఛన్లను పంపిణీ చేశామన్నారు. అదే విధంగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతుల ఖాతాల్లో మొదటి విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మొత్తం రూ.7,000 చొప్పున జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.