చేనేతలకు చేయూతనిచ్చే నిర్ణయం ప్రకటించిన సీఎం
కొత్తగా 1.09 లక్షల స్పౌజ్ పింఛన్లకు రూ.520 కోట్లు
త్వరలో కడప స్టీల్‌ప్లాంట్ పనులు చేపడతాం…
2029నాటికి ఉత్పత్తి ప్రారంభించడం ఖాయం
ఘరానా మోసగాడు జగన్
మహిళలను కించపర్చేవాళ్లను ప్రోత్సహిస్తున్నాడు
చెడగొట్టడానికి, పడగొట్టడానికే వైసీపీ ఉంది
సొంత టీవీ, పత్రికలో తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారు
జమ్మలమడుగు ప్రజావేదికలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
‘పేదల సేవలో’ భాగంగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ
ప్రజావేదికకు ఆటోలో వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు
జమ్మలమడుగు (చైతన్య రథం): చేనేతలకు చేయూతనిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మగ్గాలున్న చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు నిర్ణయాన్ని వెల్లడిరచారు. శుక్రవారం కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం ఈ ప్రకటన చేశారు. పవర్ లూమ్స్ ఉన్నవారికి 500 యూనిట్లు, హ్యాండ్‌లూమ్ ఉన్నవారికి 200 యూనిట్లమేర విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈనెల 7న అంతర్జాతీయ చేనేత దినోత్సవం రోజునుంచి ఈ పథకం అమల్లోకి రానున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతోపాటు పెట్టుబడుల కోసం ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను, సింగపూర్ పర్యటన విశేషాలను వెల్లడిరచారు. ఇదే సమయంలో వైసీపీ విధానాలను ఎండగట్టారు. చంద్రబాబు మాట్లాడుతూ… ‘‘రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు, రాష్ట్ర బ్రాండ్ పెంచేందుకు సింగపూర్ వెళ్లొచ్చాను. నేను ఎక్కడున్నా 1న పేదల సేవలో పాల్గొనేలా చూసుకుంటున్నాను. అవసరమైతే నా కార్యక్రమాలు వాయిదా వేసుకుంటాను. ప్రతినెలా 1న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏదో మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా నిర్వర్తిస్తున్నాం. రాష్ట్రంలో 64 లక్షలమందికి రూ.33 వేలకోట్లు వెచ్చిస్తున్నాం. దేశవ్యాప్తంగా పెన్షన్ల కోసం ఇంతపెద్ద మొత్తంలో ఖర్చు చేసేది ఏపీనే. మన రాష్ట్రం తర్వాత తెలంగాణ రూ.8,170 కోట్లు, కేరళ రూ.7,295 కోట్లు, హర్యానా రూ.7,194 కోట్లు, వెస్ట్ బెంగాల్ రూ.5,460 కోట్లు, రాజస్థాన్, రూ.5,160 కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నారు. 1,08,499 మందికి కొత్తగా వితంతు పింఛన్లు ఇచ్చేందుకు రూ.43.40 కోట్లు విడుదల చేశాం. రెండు నెలలపాటు పింఛన్లు తీసుకోకపోయినా మూడు నెలలు కలిపి ఒకేసారి ఇస్తున్నాం. ఆస్పత్రుల్లోవున్న 14,703 మందికి, వృద్ధాశ్రమాల్లోవున్న 20,587 మందికి, ఒక సచివాలయ పరిధినుంచి మరో సచివాలయ పరిధికి వెళ్లిన 31,496 మందికి, హాస్టళ్లలో ఉంటున్న దివ్యాంగ విద్యార్థులకు 3,683 మందికి ఇస్తున్నాం. ఇవికాకుండా ఈనెల నుంచి కొత్తగా 1.09 లక్షల మందికి వితంతు ఫించన్లు అందిస్తున్నాం. దీనికోసం రూ.520 కోట్లు ఖర్చు పెడుతున్నాం’ అని సీఎం వివరించారు.
చెడగొట్టడం తేలిక..నిలబెట్టడమే కష్టం
‘దేన్నైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా తేలిక. నిలబెట్టడమే చాలా కష్టం. విధ్వంసం చేయడం నిమిషం పని. గత ఐదేళ్లు అదే జరిగింది. కేంద్రం ప్రాయోజిత పథకాలు నిలిపేశారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారు. మే నెలలో జరిగిన మహానాడు వేదికగా కడప స్టీల్ ప్లాంట్ పనులు మొదలు పెడతామని చెప్పాం. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జిందాల్ సంస్థ ముందుకొచ్చింది. రూ.4,500 కోట్లతో తొలిదశ, రూ.11,850 కోట్లతో రెండోదశ పనులు చేపడుతుంది. 2029కల్లా ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఈ ప్రాజెక్టు వస్తే జమ్మలమడుగుతోపాటు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాం. సాస్కి పథకం కింద రూ.80 కోట్లతో కేంద్ర పర్యాటకశాఖ పనులు చేపడుతోంది. అందమైన లోయలున్న గండికోటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం. 100 అడుగుల ఎత్తులో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఓవైపు గండికోట, మరోవైపు ఒంటిమిట్ట మధ్యలో కడప దుర్గా… ఈ మూడిరటిని అనుసంధానం చేస్తే పర్యాటకంగా సీమ అభివృద్ధి చెందుతుంది’ అని సీఎం వివరించారు.
నాలుగు ఉమ్మడి జిల్లాలకు సాగునీరు
‘రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నాం. నాడు హంద్రినీవా, గాలేరి నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. తెలుగుగంగ ద్వారా సీమకు నీళ్లిచ్చాకే చెన్నైకి వెళతాయని చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్. హంద్రీనీవా పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నాం. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షలమందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చాం. హంద్రీనీవా ప్రాజెక్టుకు ఒక్క ఏడాదినే రూ.3,890 కోట్లు ఖర్చు చేశాం. జూలైలోనే మల్యాల ఎత్తిపోతలనుంచి సీమ జిల్లాలకు నీరు విడుదల చేశాం. ఫేజ్`2 పనులు త్వరలో పూర్తిచేసి కడప జిల్లాలో 37,500 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. గండికోట ప్రాజెక్టు ఎన్టీఆర్ ప్రారంభిస్తే నేను పూర్తి చేశాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
జగన్ ఘరానా మోసగాడు..
‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘరానా మోసగాడు. సొంత పత్రిక, టీవీని అడ్డంపెట్టుకుని తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సాక్షి మీడియాను అనుసరిస్తే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టే. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన వ్యక్తిని మందలించాల్సిందిపోయి… ఇంకా నోటికొచ్చినట్టు మాట్లాడాలని ప్రోత్సహించడాన్ని ఏమనాలి? పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తి తన పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను క్రమశిక్షణలో ఉంచాలి. వైసీపీ వాళ్లు దుష్ప్రచారం చేస్తుంటారు. ఆనాడు వివేకానందరెడ్డికి గుండెపోటు అని సాక్షిలో వేశారు. తర్వాత గొడ్డలిపోటు అని తేలింది. నా చేతిలో కత్తిపెట్టి నేను చంపించానని రాశారు. బంగారుపాళ్యం పర్యటన దృశ్యాలను నెల్లూరు పర్యటన దృశ్యాలతో కలిపి భారీగా జనం వచ్చినట్టు చూపించారు. జిమ్మిక్కులతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసి అసౌర్యం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోం’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
సీమ పారిశ్రామికాభివృద్ధికి రోడ్ మ్యాప్
‘పారిశ్రామికంగా సీమ అభివృద్ధి కోసం పూర్తిస్థాయి రోడ్ మ్యాప్ తయారు చేశాం. సాగుకు ప్రాధాన్యమిస్తూనే పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. ఆటోమొబైల్, స్పేస్, డిఫెన్స్, ఏరోస్పేస్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ఈ ప్రాంతంలో నెలకొల్పేలా అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాం. ఓర్వకల్లు- లేపాక్షి మధ్య ఎలక్ట్రానిక్, డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలను తెస్తాం. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్‌ల కోసం రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. కర్నూలు, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ వస్తే దేశానికి కావాల్సిన డ్రోన్స్ అన్నీ ఇక్కడే తయారవుతాయి. ఆర్ అండ్ బీ రోడ్లన్నీ బాగుచేస్తాం. కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ మాత్రమే కాకుండా రూ.43,604 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీలో రూ.44 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం రూ.12,441 కోట్లకు పైగా ఖర్చు చేసింది. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే వెచ్చించింది. అవుకు, జీడిపల్లి, మారాల, చెర్లోపల్లి, గండికోట, బ్రహ్మంసాగర్, మైలవరం ప్రాజెక్టులు పూర్తిచేసింది టీడీపీనే. సముద్రంలోకి పోయే నీటిని మనం వాడుకుంటే ఏపీ, తెలంగాణలో కరవుండదు. అదృష్టవశాత్తు రాష్ట్రంలో రిజర్వాయర్లున్నాయి. వాటిలో నీరు నిల్వ పెట్టుకుంటే సాగుకు ఇబ్బంది ఉండదు. సీమను హార్టికల్చర్ హబ్‌గా తయారుచేసే కార్యక్రమానికి టీడీపీనే శ్రీకారం చుట్టింది. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతోంది’ అని సీఎం స్పష్టం చేశారు.
నేడే అన్నదాత సుఖీభవ
‘2024 ఎన్నికల్లో ప్రజలు అద్భుత విజయం అందించారు. సుపరిపాలనలో తొలిఅడుగు వేశాం. కేంద్ర సాయంతో కలిపి ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టే శనివారం అన్నదాత సుఖీభవ కింద రైతులందరికీ డబ్బు జమ చేస్తాం. కేంద్రమిచ్చే రూ.2 వేలతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కో రైతుకు రూ.5వేలు చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. గత ప్రభుత్వం రూ.12,500 ఇస్తామని రూ.7,500 ఇచ్చింది. మన ప్రభుత్వం దాన్ని రూ.14,000 వేలకు పెంచింది. ఏది రైతు ప్రభుత్వమో, ఏది రైతు వ్యతిరేక ప్రభుత్వమో ప్రజలే నిర్ణయించుకోవాలి. అలాగే 90శాతం సబ్సీడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే గత ఐదేళ్లలో దాన్ని నిలిపేశారు. ఈనెల 15నుంచి ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం’ అని సీఎం ప్రకటించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో 12 చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ.30 కోట్లు విడుదల చేస్తాం. జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేస్తాం. గండికోట రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకుంటాం’ అని భరోసా ఇచ్చారు.
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన సీఎం
జమ్మలమడుగు మండలం, గూడెంచెరువు గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం ప్రజావేదిక కార్యక్రమానికి హాజరయ్యే ముందు పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. ఉల్సాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికెళ్లి వితంతు పెన్షన్ అందించారు. కాసేపు వారితో ముచ్చటించారు. అలివేలమ్మ ఇంట్లో ఉన్న చేనేత మగ్గాన్ని పరిశీలించారు. ఆమెకు పింఛను అందజేసి ఇంటినుంచి బయటకు వస్తున్న సమయంలో పక్షవాతంతో బాధపడుతున్న వెలిగండ్ల మునీంద్ర తనకు పింఛను మంజూరు చేయాలని అభ్యర్థించారు. అతని పరిస్థితిని చూసిన సీఎం చంద్రబాబు తక్షణమే మునీంద్రకు పింఛను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం అక్కడి నుంచి ఆటోడ్రైవర్ జగదీష్ ఆటోలో ప్రజావేదికకు చేరుకున్నారు.