రాష్ట్రంలో షార్ప్ షూటర్లు దిగారని.. వారివల్ల జగన్ భద్రతకు ముప్పు వస్తుందేమోనని నీలి మీడియా ప్రచారం చేస్తున్నది. ఇది బహుశ మరో కోడికత్తి, గులకరాయిలాంటి సానుభూతి డ్రామా కావచ్చు. లేదా వేలాదిమంది ప్రాణాలు తీసిన మద్యం కుంభకోణంపై ప్రజాదృష్టి మళ్లించే డైవర్షన్ ఎత్తుగడ కావొచ్చు!
హింసా రాజకీయాలకు తెలుగుదేశం వ్యతిరేకం. కూటమికి క్రిమినల్ రాజకీయ చరిత్ర లేదు. పైగా క్రిమినల్ రాజకీయ బాధిత పార్టీ టీడీపీ.
శాంతి భద్రతలు కాపాడటం ద్వారా పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది చంద్రబాబు ప్రభుత్వ విధానం. అందుకే గతంలో హైదరాబాద్‌లో మతకల్లోలాలు అరికట్టి.. పెట్టుబడులు ఆకర్షించి.. సైబరాబాద్‌ను సృష్టించారు. తీవ్రవాదాన్ని అదుపుచేశారు. ఫ్యాక్షనిజాన్ని కట్టడి చేశారు.
స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్ 2047తో తెలుగువారిని అగ్రస్థానంలో నిలపడం చంద్రబాబు సంకల్పం. అభివృద్ధి.. సంక్షేమం.. సామాజిక న్యాయం పెంపొందించి ప్రజాభిమానం చూరగొనడం ద్వారానే స్వర్ణాంధ్ర సంకల్పం సాధ్యమని కూటమి విశ్వాసం. అలాగే `మాఫియాలపై చట్టపరమైన చర్యలు తీసుకుని శాంతి భద్రతలు కాపాడటం ద్వారానే స్వర్ణాంధ్ర సాకారమౌతుంది.
అభివృద్ధి.. సంక్షేమం.. సామాజిక న్యాయం చేయడంలో చంద్రబాబుతో పోటీపడలేక గతంలో ఆయనపై అలిపిరిలో ల్యాండ్‌మైన్ బ్లాస్ట్ చేయించారు. బషీర్‌బాగ్ కాల్పులు జరిగే విధంగా వైఎస్ పంపిన మూకలు విధ్వంసం సృష్టించారు. పరిటాల రవిని షార్ప్ షూటర్లద్వారా హత్య చేయించారు. వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపించారు. ఈ ఘాతుకాలన్నింటినీ టీడీపీ చట్ట ప్రకారం ఎదుర్కొన్నదిగానీ ప్రతి హింసకు పాల్పడలేదు.
నారా కుటుంబానికి ఫ్యాక్షన్ చరిత్ర లేదు. హత్యా రాజకీయ నేపథ్యం లేదు. మాఫియాలను చంద్రబాబు అరికట్టారేగానీ, ప్రోత్సహించలేదు.
షార్ప్ షూటర్ల ప్రచారం వెనుక కోడికత్తిలాంటి కుట్రకోణం ఏమైనా ఉందా? ప్రభుత్వం తగు దృష్టి పెట్టాలి. మాఫియా రాజకీయ నేతలు ఎంతటి ఘోరకృత్యాలకైనా పాల్పడతారు. అధికారం లేకుంటే వారు మనలేరు. రోజూ బాక్స్‌లకు బాక్స్‌లు నోట్లకట్టలు దోచుకుని ఫాంహౌస్ డెన్‌లలో దాచుకోవాలంటే వారికి అధికారం కావాలి. అందుకు అగత్యాలకు పాల్పడతారు. అబద్ధపు ప్రచారాలతో పేట్రేగిపోతారు. కూటమి నేతలపై కుట్రలు కూడా చేస్తారు. కనుక `ఏపీ పోలీసు డిపార్ట్‌మెంట్‌కు ఇది ప్రత్యేక పరీక్ష.
వైకాపాలాంటి క్రిమినల్ రికార్డుగాని, దోపిడీ రికార్డుగానీ వున్న పార్టీ దేశంలో మరొకటి లేదు. ప్రత్యేకించి జగన్‌లాంటి మానసిక స్థితివున్న నేత దేశంలో మరొకరు లేరు. అతనికి ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థులే ఉంటారుగానీ శత్రువులు ఉండరు. కానీ `జగన్ ఎదుటి పార్టీని శత్రు పార్టీగా చూస్తారుగానీ ప్రత్యర్థి పార్టీగా చూడరు. ఇది `ఫ్యాక్షన్ తత్వానికి ప్రతీక.
ఫ్యాక్షన్ రాజకీయాలలో అతిగా మునిగినవారు ఒకవైపు క్రూరంగాను, రెండోవైపు అభద్రతా భావంలోనూ మునిగి తేలుతూవుంటారు. పైన పోతూ కింద చెట్లు నరికించడం ఈకోవలోనిదే!
అసాధారణ విపక్షంతో కూటమి ప్రభుత్వం పాలన చేయాల్సి వస్తున్నది. కనుక ప్రభుత్వం.. కూటమి పార్టీలు విపక్ష కుట్ర కోణాలపై ఒక కన్ను వేసి ఉండాలి.
కూటమి ప్రభుత్వం తొలి అడుగు ద్వారా ఇంటింటికి వెళ్తుంటే.. ప్రజలనుంచి విశేష స్పందన వస్తున్నది. ఆగస్టు 15వ తేదీనాటికి సూపర్ సిక్స్‌లో 5 ముఖ్యమైన పథకాలు అమలులోకి వస్తాయి. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణతో 6 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు సృష్టించబడ్డాయి. పోలవరం.. నదుల అనుసంధానం ఒకవైపు, అమరావతి పనులు మరోవైపు వేగంగా జరుగుతున్నాయి. అలాగే మాఫియాల దోపిడీలపై ప్రభుత్వ యంత్రాంగం సరైన చర్య తీసుకుంటున్నది. ఇందువల్ల `జగన్ భవిష్యత్‌కు దారులు అన్నీ మూసుకుపోతున్నవి.
వైకాపా ఇంటింటి కార్యక్రమానికి ప్రజలనుంచి స్పందన లేదు. అందువల్ల `ఆ పార్టీ నేతలు పడకేశారు. ఇందువల్ల జగన్ పర్యటనల పేరుతో మాఫియా డబ్బు కోటాను కోట్లు వెదజల్లి కూలికి జనాన్ని తోలి అరాచకం చేస్తూ లేనిది ఉన్నట్టుగా చూపే బిల్డప్ ఇస్తున్నారు. వైకాపాది వాపేగానీ బలుపు కాదు!
2029లోనేకాదు, 2034లోనూ కూటమినే ప్రజలు ఆదరిస్తారు. 2019లో జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చి ఏరీతిగా తమ ధన, మాన, ప్రాణాలు, ఆస్తులకు ముప్పు తెచ్చుకున్నారో ప్రజలు మరువరుగాక మరువరు. 2029లో అధికారానికి వచ్చి రఫా రఫా చేస్తామనే జగన్ మాఫియాది గుడ్డి బెదిరింపే. రఫా రఫా నరికే వారికి ప్రజలు అధికారం ఇవ్వరుగాక ఇవ్వరు.
గురజాల మాల్యాద్రి,
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్