- పొరుగు రాష్ట్రంలో ఏపీ లిక్కర్ స్కాం నగదు డంపు
- సులోచన ఫార్మ్ గెస్ట్‌హౌస్‌లో స్వాధీనం చేసుకున్న సిట్
- వరుణ్ సమాచారంతో పక్కాగా దాడులు చేసిన సిట్
- 12 కార్టన్ బాక్సుల్లో రూ.11 కోట్ల నగదు సీజ్
- ఏపీ మద్యం కుంభకోణంలో వెలుగుచూసిన సంచలనం
- ఆ డంపుతో సంబంధం లేదంటూ రాజ్ కెసిరెడ్డి బుకాయింపు
- త్వరలోనే పెద్ద తలల పాత్ర బహిర్గతమయ్యే అవకాశం
- ఢిల్లీ, చత్తీస్‌గఢ్‌లను తలదన్నే మద్యం స్కాంగా గుర్తింపు
హైదరాబాద్, విజయవాడ (చైతన్య రథం): ఏపీ మద్యం కేసులో బుధవారం మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కెసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన రూ.11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్‌లో అక్రమ మద్యం నగదు డంపును గుర్తించారు. లిక్కర్ స్కామ్‌లో ఏ-40 వరుణ్ పురుషోత్తం నోట సంచలన నిజాలు వెల్లడయ్యాయి. అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడిరది. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైనా సిట్ బృందం విచారణ చేపట్టింది.
రాజ్ కెసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ రూ.11 కోట్ల నగదువున్న 12 అట్ట పెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరిట దాచినట్టు సిట్ అధికారులు గుర్తించారు. నిన్న దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ పురుషోత్తంను శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మద్యం కుంభకోణంలో రాజ్ కెసిరెడ్డి వసూళ్ల బృందంలో వరుణ్ కీలక వ్యక్తి. అతడినుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. వరుణ్‌పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయట పెట్టడంతో.. లిక్కర్ స్కామ్‌కు చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది. మరికొన్నిచోట్ల సిట్ సోదాలు నిర్వహించే అవకాశముంది. వైకాపా ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపైనా సిట్‌కు కీలక సమాచారం లభ్యమైనట్టు సమాచారం. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్రను సిట్ బహిర్గతం చేసే అవకాశముందన్న సమాచారం ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఫామ్ హౌస్ యజమాని విజయేందర్రెడ్డి?
వర్ధమాన్ కళాశాల వద్దనున్న సులోచన ఫార్మ్ గెస్ట్‌హౌస్ యజమానిని విజయేందర్రెడ్డిగా గుర్తించారు. ఆయన తల్లి సులోచన పేరిట ఫామ్‌హౌస్ ఉంది. అక్కడే వర్ధమాన్ కళాశాల క్రీడా ప్రాంగణం, వసతిగదులున్నాయి. స్టోర్ రూంలో బియ్యం బస్తాల మధ్య అట్టపెట్టెల్లో నగదు దాచి ఉంచారు. పక్కా సమాచారంతో వెళ్లిన ఏపీ సిట్ అధికారులు రూ.11 కోట్ల నగదు డంపును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదుపై ఈడీ, ఐటీ దృష్టి సారించే అవకాశముంది. ఏపీ సిట్ తొలి ఛార్జిషీట్‌లోనే యూపీ డిస్టిలరీ పేరు ప్రస్తావించింది. 16 డిస్టిలరీల ముడుపులే రూ.1,677.68 కోట్లుగా సిట్ గుర్తించింది. రాజ్ కెసిరెడ్డి బినామీ సంస్థనే యూపీ డిస్టిలరీస్. హైదరాబాద్‌లోని అరేట్ ఆసుపత్రి డైరెక్టర్లుగా తీగల ఉపేందర్రెడ్డి, విజయేందర్రెడ్డి ఉన్నారు.
ఢిల్లీ, చత్తీస్‌గడ్‌లను తలదన్నే కుంభకోణం
ఢల్లీి మద్యం కుంభకోణం గురించి విన్నాం. ఛత్తీస్‌గడ్ మద్యం స్కాం గురించి చదివాం. రాష్ట్రంలో జగన్ జమానాలో సాగిన మద్యం కుంభకోణం వీటన్నిటినీ తలదన్నే స్థాయిలో కనిపిస్తోంది. దేశచరిత్రలోనే అతి భారీ లిక్కర్ స్కాంగా ఇప్పటికే అంచనాలు వెలువడ్డాయి. అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి నాటి ప్రభుత్వ పెద్దలు రూ.3,500 కోట్ల ముడుపులు కొల్లగొట్టారని సిట్ ప్రాథమికంగా తేల్చింది. ఈ కుంభకోణంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.18,860 కోట్లమేర నష్టం వాటిల్లిందని కూటమి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రకటించింది. దీన్నిబట్టి ఇది ఎంత పెద్ద కుంభకోణమో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వరంగ కార్పొరేషన్ల చేతుల్లోని మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగించడం ద్వారా ఢల్లీిలో కుంభకోణానికి పాల్పడితే.. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వమే మద్యం వ్యాపారం నిర్వహించి భారీ దోపిడీకి పాల్పడిరది.
వరుణ్‌ను మరింత లోతుగా విచారణ
మద్యం కుంభకోణం కేసులో ఏ40గా ఉన్న వరుణ్ పురుషోత్తంను విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. నిన్న దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ పురుషోత్తంను శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీ మద్యం కుంభకోణంలో రాజ్ కెసిరెడ్డి వసూళ్ల బృందంలో వరుణ్ కీలక వ్యక్తి. అతడినుంచి సిట్ కీలక సమాచారం రాబట్టింది. వరుణ్‌పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయట పెట్టడంతో లిక్కర్ కుంభకోణానికి చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకొచ్చింది. వరుణ్ వాంగూల్మం ఆధారంగా హైదరాబాద్ శివారులోని ఫాంహౌస్‌లో పట్టుబడిన రూ.11 కోట్లు విజయవాడకు తరలించారు. మరింత సమాచారం సేకరణకు వరుణ్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. బుధవారం ఐదు గంటలకు పైగా వరుణ్‌ను సిట్ విచారించింది. మద్యం ముడుపుల కేసులో వివిధ కోణాల్లో సిట్ ప్రశ్నిస్తోంది. రాజ్ కెసిరెడ్డి ముఠాలో పరారీలో ఉన్న కిరణ్‌కుమార్ రెడ్డి, అవినాష్‌రెడ్డి, సైమన్, శివకుమార్, రాజీవ్ ప్రతాప్, బెహ్రాన్ పాత్రలపై సిట్ లోతుగా ఆరాతీస్తోంది. ఎవరి ఆదేశాలతో మద్యం కుంభకోణం డబ్బు ఫాంహౌస్‌లో డంప్ చేశారు? ఎక్కడెక్కడ ఎంత మొత్తం డంప్ చేశారు? అనే కోణంలో విచారణ సాగుతోంది.
ఇదిలావుంటే, వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కెసిరెడ్డి ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లోని కాచారంలో సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఫాంహౌస్ యజమాని విజయేందర్రెడ్డికి పలు వ్యాపారాలున్నాయన్నారు. ఆయనకు ఇంజినీరింగ్ కాలేజీ, ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నాయని.. ఆయా కంపెనీలకు రూ.వందల కోట్ల టర్నోవర్ ఉందని రాజ్ కెసిరెడ్డి తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.