జగన్రెడ్డి మద్యం, గనులువంటి వాటిని తన సొంత ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. ప్రతి నెలా ఆదాయం తెచ్చిపెట్టే రంగాలలో ఏవరినీ వేలు పెట్టనివ్వలేదు. జగన్‌రెడ్డి ఎంపిక చేసుకున్న ఇసుక, మద్యం, గనులువంటివి మినహాయించి మిగతా వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు ఎంత దోచుకున్నా, ఎంత విచ్చలవిడిగా వ్యవహరించినా జగన్‌రెడ్డి పట్టించుకోలేదు. నేను దోచుకుంటాను, మీరూ దోచుకోండి. ప్రభుత్వ సంపదంతా మనదేనన్న ఫార్ములాను అమలు చేశారు. తన వ్యూహాలను అమలు చేసేందుకు ఎంపిక చేసుకున్న అధికారులను కీలక స్థానాల్లో నియమించుకున్నారు. దీంతో జగన్ మాటే శిలా శాసనంగా పాలన సాగింది. కంటిచూపుతో చేయాల్సిన పనులన్నీ చేసుకున్నారు, చేయించుకున్నారు. జగన్‌రెడ్డికి వ్యక్తిగత ఆదాయం సమకూర్చడానికి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని, ఎక్సైజ్ శాఖలో వాసుదేవరెడ్డిని, రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం పీఎస్‌ఆర్ ఆంజనేయులు, సునీల్‌కుమార్, సంజయ్‌వంటి ఐపీఎస్‌లను నియమించుకున్నారు. రాష్ట్ర ప్రజలు చాలామంది సీఎంలను చూసుండొచ్చు, రాజకీయాలను భ్రష్టుపట్టించిన జగన్‌రెడ్డిలాంటి సీపంను చూడలేదు, చూడబోము కూడా.
మద్యం కుంభకోణం మొత్తం వ్యవహారంలో ఏంజరిగింది? ఎవరెవరికి ఏ రూపంలో సొమ్ములు చేర్చింది సిట్ పూసగుచ్చినట్టు వివరించినందున.. అతి భారీ మద్య కుంభకోణం నుంచి జగన్ బయటపడటం అసాధ్యం. గతంలో తనపై సీబీఐ, ఈడీ సంస్థలు అవినీతి కేసులు నమోదుచేసి చార్జిషీటు దాఖలు చేసినా.. అవి విచారణకు నోచుకోకుండా టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలతో అడ్డుకుంటూ వస్తున్న జగన్ అండ్ కో `ఇప్పుడు తప్పించుకోనే అవకాశం లేదు. ఇన్ని పాపాలకు ఒడిగట్టిన జగన్‌రెడ్డి విచారణను ఎదుర్కోక తప్పదు. జగన్‌రెడ్డిపై చర్య తీసుకోకుండా అందివచ్చిన ఈ మహదావకాశాన్ని కూటమి ప్రభుత్వం వదులుకుంటే ఘోర తప్పిదం చేసినట్టే. సీబీఐ కేసులలో తప్పించుకు తిరుగుతున్న జగన్‌రెడ్డిని.. భారీ మద్యం కేసుతోనైనా నేరుస్తుడిని దండిరచే కూటమి ప్రభుత్వానికి అందివచ్చింది. ఇంత పెద్ద కుంభకోణం నుంచి తప్పించుకోవడానికి జగన్‌రెడ్డికి దారులు మూసుకుపోయాయి. వేయి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్టు.. ఇప్పుడు జగన్‌రెడ్డి కూటమి ప్రభుత్వానికి చిక్కింది.
మద్యం ద్వారా దోపిడీ చెయ్యాలన్న ఆలోచన ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడికి వచ్చే ఆలోచన కాదు. ప్రజల ద్వారా ఎన్నుకోబడి, ఆ ప్రజలనే దోపిడీ చెయ్యాలన్నది దోపిడీదారులకు వచ్చే ఆలోచన. అధికారంలోకి రాకముందే మద్యం ద్వారా ఎలా డబ్బు సంపాదించాలో మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుని.. అధికారంలోకి రాగానే అమలు చేశారు. ప్రయివేటు దుకాణాలన్నింటినీ తొలగించి, ప్రభుత్వ దుకాణాల ముసుగులో మొత్తం చేతుల్లోకి తీసుకున్నారు. దుకాణాలన్నీ వైసీపీ నేతల బిల్డింగ్‌లలో పెట్టారు. అందులో పనిచేసిన ఉద్యోగులు వైసీపీ కార్యకర్తలే. పూర్తిగా నగదు లావాదేవీలు తప్ప అసలు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్సే లేవు. వినియోగదారులు అడిగిన మద్యం ఇచ్చేవారు కాదు. తాము తయారు చేసిన బ్రాండ్‌లను మాత్రమే అమ్మేవారు. ఆ బ్రాండ్లు తయారు చేసేది, రవాణా చేసేది వైసీపీ నేతలు. అమ్మేది వైసీపీ కార్యకర్తలు. ఇలా తయారీ దగ్గరనుండి అమ్మకం వరకు వైసీపీలే నడిపించారు. మద్యం విధానం వైసీపీ దోపిడీకి తెచ్చుకున్న పాలసీ అని, దాని ద్వారా ఇష్టానుసారం దోచుకున్నారని స్పష్టమైన ఆధారాలతో సిట్ విచారణ కళ్లకు కట్టింది.
మద్యం స్కామ్‌ను పకడ్బందీగా నిర్వహించిన విధానం చూసి తలపండిన దర్యాప్తు సంస్థల అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తామే ఎప్పటికీ అధికారంలో ఉంటామన్న ఉద్దేశంతో పట్టపగలు నగ్నంగా సాగించిన దోపిడీ ఇది. ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటికి చాలామంది పాత్రధారుల్ని ఆజ్ఞాతంలోకి పంపించారు. అందరినీ పట్టకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది సిట్. కానీ తానూ పత్తిత్తుగా చెప్పుకొంటున్న స్కామ్ సూత్రధారిని కూడా పకడ్బందీగా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం వుంది. అసలు సూత్రధారి తప్పించుకుంటే కష్టపడి సిట్ చేసిన దర్యాప్తునకు అర్ధముండదు. ఇక్కడ ఒక్క ఆర్థికపరమైన దోపిడీ మాత్రమే కాదు. ప్రజల ఆరోగ్యాలను, కల్తీ మద్యాన్ని అధికరేట్లకు అమ్మి వారి జీవితాలను గుల్లచేసి కుటుంబాలను చిన్నాభిన్నం చేశారు. 2019-24 మధ్య కాలంలో ప్రభుత్వం అమ్మిన కల్తీ మద్యం తాగి ఎంతమంది ఆరోగ్యాలను పాడు చేసుకున్నారో, ఎంతమంది విగత జీవులయ్యారో లెక్కలు కూడా ఉన్నాయి. ఇంత దోపిడీ దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదంటున్నారు ప్రజలు. సిట్ దర్యాప్తు బృందం నిందితుల ఫోన్లనుంచి రీట్రీవ్ చేసిన వీడియోలలో, గదులనిండా డబ్బుల కట్టలు ఎలా పేర్చారో చూస్తే కళ్లు బైర్లు కమ్మకమానవు. దోపిడీ తన జన్మహక్కు అనుకునేలా సాగిన జగన్‌రెడ్డి పరిపాలనలో ఇప్పుడు పాపాల పుట్ట పగులుతుంది. ప్రజల ఆస్తులను, ప్రాణాలను, ఆరోగ్యాలను సైతం దోచేసిన లిక్కర్ స్కామ్ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు బలంగా కోరుకొంటున్నారు తప్ప ఎవరు కక్ష సాధింపు అనడం లేదు. ఘోరమైన క్రిమినల్ నైజం జగన్ రెడ్డి ముఠాది. గతంలో చేసిన ఆర్ధిక నేరాలలో, చేయించిన హత్యలలో ఏమి చేశారు? ఇప్పుడు జరిగిన మద్యం కుంభకోణంలో మాత్రం ఏమి చేస్తారు అని మద్యం మారీచుల ధైర్యం. కానీ ఆ కేసులతో పోలిస్తే ఈ లిక్కర్ స్కాం భిన్నమైనదే. దీన్ని ఉపేక్షించడం సమాజానికే మంచిది కాదు.
ఐదేళ్లపాటు వివిధ రూపాల్లో ఇష్టానుసారం రాష్ట్రాన్ని, ప్రజలను దోచేసిన దొంగలను ప్రజలముందు దోషులుగా నిలబెట్టాల్సిన సమయమిదే. కానీ రాష్ట్రాన్ని దోచిన ఈ దొంగలేమీ ఆషామాషీ దొంగలు కాదు. మీడియా, సోషల్ మీడియాతో పాటు బలమైన ధనబలం ఉన్న దొంగలు. తాము దోచుకున్నదాంట్లో కొంత పడేసి అయినా బయట పడాలనుకునేవాళ్లు. గతంలోనే వీళ్ల నేరాలు ఖండాంతరాలలో వెలుగుచూశాయి. వాళ్లు ఇప్పటివరకు చేసిన నేరాలు ఇప్పటికీ విచారణ దశకు కూడా రాని ఆర్థిక నేరాలు, హత్యలువంటి కోర్టుల్లోనే మూలాన పడి వున్నాయి. మళ్లి వారు చేసిన దోపిడీ తాలుకు కొత్త కేసులు తెరపైకి వచ్చాయి. బలమైన ఆధారాలు కళ్లముందు కనిపిస్తున్న సమయంలో.. ఎంతో శ్రమకోర్చి మద్యం కుంభకోణంలో సిట్ సేకరించిన ఆధారాల ఆధారంగా దొంగలను కఠినంగా శిక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
`నీరుకొండ ప్రసాద్