- ఏపీకి పెట్టుబడుతో రండి.. పేదలకూ సాయం చేయండి
- ఏపీ- సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తాం
- విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ఇదే మా ఆహ్వానం
- ఏపీ- సింగపూర్ బిజినెస్ ఫోరమ్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు
- పారిశ్రామికవేత్తలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
అమరావతి (చైతన్య రథం): పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ఎంపికని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మీ పెట్టుబడులు అత్యంత భద్రంగా ఉంటాయని కూడా పారిశ్రామికవేత్తలకు భరోసానిచ్చారు. ఈ ఏడాది నవంబర్‌లో విశాఖలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఏపీ- సింగపూర్ బిజినెస్ ఫోరమ్ తరపున రోడ్ షో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. సమావేశానికి సింగపూర్ కంపెనీల ప్రతినిధులతోపాటు ఏపీనుంచీ పెద్దఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు. రోడ్ షోలో ఏపీలో అమలు చేస్తోన్న పారిశ్రామిక అనుకూల పాలసీలు, ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలతోపాటు ఏపీ అభివృద్ధి కోసం రూపొందించిన 2047 స్వర్ణాంధ్ర ప్రణాళికలపై ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు రావాల్సిందిగా సింగపూర్ కంపెనీలను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ. ‘‘అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం 2014లో సింగపూర్ దేశానికి వచ్చాను. ఉచితంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చారు. గత ఐదేళ్లకాలంలో జరిగిన పరిణామాలతో సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుత పర్యటన ద్వారా వాటి పునరుద్దరణకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాను. సింగపూర్ అవినీతిరహిత దేశం. అందుకే నాకు సింగపూర్ అంటే అభిమానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ సమీపంలో సింగపూర్ టౌన్ షిప్ నిర్మించారు. సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలి. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్టణంలో పెట్టుబడుల సదస్సు ఉంది. సింగపూర్‌నుంచి డెలిగేషన్ ఆ పెట్టుబడుల సదస్సుకు రావాలి. విశాఖ సదస్సులో పెట్టుబడులపై ఎంఓయూలు కుదుర్చుకుందాం. అతి పెద్ద సుదీర్ఘ తీరప్రాంతం ఏపీ సొంతం. భారతదేశం అతివేగంగా అభివృద్ధి చెందుతుంది. గతంలో పీ`3 అమలు చేశాం. ఇప్పుడు పీ`4 ప్రారంభించాం. పేద-ధనిక మధ్య అంతరాలు తగ్గించడమే పీ`4 మిషన్ ఉద్దేశ్యం. పేదలకు చేయూత ఇవ్వడమనేది ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. పెట్టుబడులే కాదు.. పేదలకూ సాయం చేయాలని ఇదే వేదికగా కోరుతున్నాను’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఏపీలో ఆకాశమే హద్దుగా అవకాశాలు
‘‘సింగపూర్ స్ఫూర్తితో ఏపీని అభివృద్ధి చేస్తున్నాం. 2047కు స్వర్ణాంధ్ర సాధించాలనే లక్ష్యంతో ప్రజల సామాజిక, ఆర్ధిక పురోగతిపై పని చేస్తున్నాం. ఉద్యోగాల కల్పనలో సింగపూర్ ప్రభుత్వానిది అత్యుత్తమ మోడల్. సమీప భవిష్యత్తులో సంప్రదాయ విద్యుత్ వినియోగం నుంచి గ్రీన్ ఎనర్జీ వినియోగానికి మారుతాం. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండటంతోపాటు పెట్టుబడులకు భద్రత ఉంటుంది. అమరావతి, విశాఖ, తిరుపతి లాజిస్టిక్ కారిడార్లు ఏర్పాటు అవుతున్నాయి. పెట్టుబడిదారులకు అవసరమైన నైపుణ్యమున్న వర్క్ ఫోర్స్ అందుబాటులో ఉంచేలా చూస్తున్నాం. పరిశోధనలకు, ఫ్యూచర్ టెక్నాలజీ కోసం అమరావతి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా ఏపీనుంచే మూడోవంతు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. పారిశ్రామికాభివృద్ధి కోసం 24 థీమాటిక్ పాలసీలు రూపొందించాం. తక్కువ వ్యయంతో రవాణా, సర్క్యులర్ ఎకానమీని అమలు చేయడం ద్వారా సుస్థిర భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మొబిలిటీ, వేస్ట్ రీసైకిలింగ్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎంస్‌ఎంఈ, మారిటైమ్, మైనర్ మినరల్, స్పోర్ట్స్, టెక్స్‌టైల్ పాలసీలు రూపొందించాం. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చాం. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్, డేటా సెంటర్, ఇన్నోవేషన్, స్టార్టప్ పాలసీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాం. ఆరు ఆపరేషనల్ పోర్టులు ప్రస్తుతం ఏపీలో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మరో 4 పోర్టులు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయి. దేశంలోని మారిటైమ్ కార్గోలో 30శాతం ఏపీనుంచే జరుగుతోంది. మారిటైమ్ కార్గో రంగంలో ఏపీకి ఎంతమేర అవకాశాలు ఉన్నాయో మీరే ఊహించుకోవచ్చు. ఏపీకి అనుబంధంగా ఉన్న రాష్ట్రాలనుంచి పెద్దఎత్తున పోర్టు కార్గో హ్యాండ్లింగ్‌కు అవకాశం ఉంది. ఏపీలో 7 ఆపరేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్నాయి. అలాగే మరో 9 ప్రాంతాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల నిర్మాణం కూడా చేయాలని భావిస్తున్నాం. ఇన్నోవేషన్ సహా విమానాల మరమ్మత్తులు, నిర్వహణ, ఓవర్ హాలింగ్ రంగాల్లోనూ పెట్టుబడులను ఆకర్షించేలా విధానాలు రూపోందించాం. ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్, రైల్ కార్గోలాంటి సదుపాయాలు కూడా ఏపీలో ఉన్నాయి. తక్కువ వ్యయంతో రవాణా అన్నదే మా లక్ష్యం. తద్వారా ఎగుమతులు, దిగుమతులకు పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయి’’ అని చంద్రబాబు వివరించారు.
పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా కారిడార్లు, క్లస్టర్లు, పార్కులు
‘‘ఏపీలో ఉన్న మూడు పారిశ్రామిక కారిడార్ల ద్వారా విస్తృతంగా పారిశ్రామిక అవకాశాలు పెరుగుతాయి. విశాఖ-చెన్నై, బెంగుళూరు- హైదరాబాద్, బెంగుళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్లలో పెట్రో కెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యువబుల్ ఎనర్జీ లాంటి పరిశ్రమలకు అవకాశం ఉంది. ఇవి ఏపీకి సానుకూలమైన అంశాలు. ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లుగా కొప్పర్తి, శ్రీసిటీలాంటి క్లస్టర్లు ఉన్నాయి. విశాఖలో ప్రభుత్వరంగ స్టీల్ ప్లాంట్ ఉంది. దానికి సమీపంలోనే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. అదానీ గ్రూప్ కూడా విశాఖలో ఓ డేటాసెంటర్ ఏర్పాటు చేయబోతోంది. గూగుల్ కూడా ఇక్కడే డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. బ్రౌన్ ఫీల్డ్ సిటీగా సైబరాబాద్‌ను నిర్మించిన అనుభవంతో గ్రీన్ ఫీల్డ్ సిటీగా అమరావతిని ఇప్పుడు నిర్మించబోతున్నాం. 33 వేల ఎకరాలు భూసమీకరణ ద్వారా తీసుకుని రాజధానిని నిర్మించటం చరిత్రలో ఎక్కడా లేదు. నగరాలు, ప్రాంతాలు అభివృద్ధి చేసినప్పుడు సంపద సృష్టి జరగాలన్నదే నా లక్ష్యం. హైదరాబాద్-అమరావతి- బెంగుళూరు- చెన్నై నగరాల్లో ఐదుకోట్ల మందిని కలిపేలా త్వరలో బుల్లెట్ ట్రైన్ రానుంది. బెంగుళూరుకు సమీపంలో ఓర్వకల్లును, చెన్నైకి సమీపంలో శ్రీసిటీని అభివృద్ధి చేస్తున్నాం. పరిశ్రమలు వస్తే సంపద వస్తుంది. అభివృద్ధి సాకారం అవుతుంది. సంక్షేమం చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్‌లో వివరించారు.
స్టార్టప్ ఎకో సిస్టం కోసం ప్రత్యేక హబ్‌లు
‘‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి, అనంతపురం, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖ నగరాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసి అభివృద్ధి సాధించేలా వివిధ పారిశ్రామికవేత్తలకు అప్పగించాం. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రతీ కుటుంబం నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్న లక్ష్యంతో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానం తీసుకువచ్చాం. పర్యాటకంలో పెద్దఎత్తున పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు అవకాశం ఉంది. పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, నేషనల్ పార్కులు, బౌద్ధ ఆరామాలు ఇలా వేర్వేరు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. పెద్దఎత్తున హోటల్ రూములను సిద్ధం చేయటంతోపాటు హోంస్టేకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాం. పర్యాటక రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. పెట్టుబడుల ద్వారా 8.5 లక్షల ఉద్యోగాలను త్వరలోనే సాధించబోతున్నాం. అమరావతిని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దబోతున్నాం. నగర నిర్మాణంలో భూగర్భంలోనే కేబుళ్లు, డ్రెయినేజీ, విద్యుత్ వ్యవస్థ ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థను కూడా తీసుకురాబోతున్నాం. ఈ స్ఫూర్తిని కూడా సింగపూర్ నుంచే తీసుకున్నాం. సింగపూర్ దేశంలోని హౌసింగ్ ప్రాజెక్టు తరహాలో ఏపీలోనూ వివిధ ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అవకాశాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరిలాంటి జీవనదులు, విస్తృతమైన జలవనరులు ఉన్నాయి’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
ఏపీలో పెట్టుబడులు భద్రం- టెక్నాలజీ అనుసంధానం
‘‘కూటమి ప్రభుత్వం టెక్నాలజీకి పెద్ద పీట వేస్తోంది. ప్రస్తుతం డీప్ టెక్నాలజీ, టెక్ బేస్డ్ విద్యా వ్యవస్థపై ఏపీ ప్రభుత్వం పని చేస్తోంది. అమరావతిలో క్వాంటం వ్యాలీని నిర్మిస్తున్నాం. వివిధ విభాగాల సమాచారాన్ని డేటా లేక్ ద్వారా అనుసంధానిస్తాం. ఏఐ ద్వారా ఈ సమాచారాన్ని విశ్లేషించి పౌరసేవల్ని వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ద్వారా భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీని సాధించాలన్నదే మా లక్ష్యం. భారత్ లక్ష్యంలో 160 మెగావాట్లను ఉత్పత్తి చేసే దిశగా ఏపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రంగంలో సింగపూర్ కంపెనీలకు విస్తృతమైన అవకాశాలున్నాయి. అమరావతి నిర్మాణంతోపాటు ఏరోస్పేస్, డిఫెన్సు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, డీప్ టెక్, ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్ల రంగంలో అపారమైన పెట్టుబడి అవకాశాలున్నాయి. అలాగే లాజిస్టిక్స్, ఫార్మా, బయోటెక్నాలజీ, పర్యాటకరంగంలో విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని కోరుతున్నాను. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రండి. గ్లోబల్లీ కాంపిటీటివ్, ఇన్నోవేషన్ డ్రివెన్ సొసైటీలో భాగం కావాలని సింగపూర్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నాను. సింగపూర్ ప్రభుత్వంతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధుల్ని కలిశాను. మీ పెట్టుబడులకు బెస్ట్ అండ్ సేఫ్ ప్లేస్‌గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. భారత తూర్పుతీరానికి ఏపీ పెట్టుబడుల గేట్ వేగా ఉంటుంది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
ఆంధ్రా- సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం తర్వాత జరిగిన ముఖాముఖిలో కొన్ని కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సింగపూర్-ఏపీ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తే.. యువ పారిశ్రామికవేత్తలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ప్రతిపాదన వచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. స్టార్టప్ కంపెనీలకు తాము ఎప్పుడూ అనుకూలంగానే ఉంటామని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలనుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు సింగపూర్-ఏపీ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహాణకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. ఈ రోడ్ షోలో మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.