- కుప్పంలో 250 పేద కుటుంబాలను దత్తత తీసుకున్న చంద్రబాబు
- చెప్పడమే కాదు… నేనూ ఆచరిస్తున్నానని ప్రకటన
- నా కుటుంబం మొత్తం మార్గదర్శులుగా ఉంటుదని వెల్లడి
- ప్రతి బంగారు కుటుంబానికీ విజన్ డాక్యుమెంట్
- కుటుంబాల ఆదాయం పెరిగేలా ప్రణాళికలకు సర్వే
- ఆగస్టు 15నుంచి పీ`4 మొదటి దశ అమలు
- పేదరిక నిర్మూలనకు ప్రతిఒక్కరూ కలిసిరావాలి
- పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- ‘ఐ యామ్ ఏ మార్గదర్శి’ పోస్టర్ ఆవిష్కరించిన సీఎం
- పీ`4పై మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్
- రాష్ట్రాంలో ఇప్పటివరకు 5,74,811 బంగారు కుటుంబాల దత్తత
అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ‘ఐ యామ్ మార్గదర్శి’ బ్యాడ్జిని అధికారులు చంద్రబాబుకు అందించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి పీ`4 కార్యక్రమంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘ఐ యామ్ మార్గదర్శి’ పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను. ఆ కుటుంబాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. మార్గదర్శులు ముందుకు రావాలని పిలుపు ఇస్తున్న నేను చెప్పడమే కాదు.. ఆచరించి చూపాలని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా. ఈ కుటుంబాల అభ్యున్నతికి ప్రణాళిక రూపొందిస్తాను. ఐ యామ్ ఏ మార్గదర్శి. సమాజంలో పేద-ధనికుల మధ్య అంతరాలు తగ్గించే ఇలాంటి కార్యక్రమాన్ని ఎక్కడా చేపట్టలేదు. గతంలో జన్మభూమి స్ఫూర్తితో గ్రామాలను అభివృద్ధి చేస్తే.. ఇప్పుడు పేదలను ఆదుకునేందుకు పీ`4 అమలుకు ప్రణాళికలు చేపట్టాం. ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచేలా రూపొందించాం. పేదలకు చేయూతనిచ్చే పీ`4 కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు. పీ4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని, పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనిని విజయవంతం చేసేందుకు అత్యుత్తమ విధానాలను అన్నిచోట్లా అమలు చేసి చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా… వారందరినీ కార్యక్రమంలో మమేకం చేయాలని నిర్దేశించారు. ప్రవాసాంధ్రులను కూడా భాగస్వామం చేసేందుకు ఏపీ ఎన్నార్టీ సొసైటీ సాయం తీసుకోవాలన్నారు. అలాగే కార్పొరేట్ సంస్థలు దీనికి కలిసి వచ్చేలా చూడటంతోపాటు వారితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లాల కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఆ ప్రాంతానికే చెందిన ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని సూచించారు. ఒకవేళ స్థానికంగా మార్గదర్శులు లేకపోతే అప్పుడు స్థానికేతరులను అనుసంధానం చేయాలన్నారు. పీ`4 కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు రాష్ట్రస్థాయిలో దాతలు ముందుకువస్తే వారిచ్చే నిధుల కోసం కామన్ ఫండ్ ఏర్పాటు చేయాలని, దాని ద్వారా బంగారు కుటుంబాలకు సాయం అందించవచ్చని సీఎం స్పష్టం చేశారు.
నేటి బంగారు కుటుంబాలే… రేపటి మార్గదర్శులు
‘‘పీ`4లో భాగంగా బంగారు కుటుంబాలుగా నమోదైనవారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. ఇవాళ్టి బంగారు కుటుంబాలు.. రేపటి మార్గదర్శలుగా ఎదగాలన్నదే నా ఆలోచన. సాయం పొందిన వారే సాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి. దీన్ని విజయవంతంగా అమలు చేయగలిగితే కార్యక్రమం శాశత్వంగా ఉండిపోతుంది. చాలామందికి మంచి ఆలోచనలుంటాయి. ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యాలున్న వారు పేదరికం కారణంగా వెనుకబడిపోతున్నారు. ఇలాంటివారికి చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఎన్నో కార్యక్రమాలు చేసిన నాకు.. పీ`4 కార్యక్రమం మనస్సుకు చాలా దగ్గరగా ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.
ప్రతి బంగారు కుటుంబానికి విజన్ డాక్యుమెంట్..
‘‘బంగారు కుటుంబాలుగా నమోదైనవారి అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తాం. బంగారు కుటుంబాలు అభివృద్ధికి ఏంచేస్తే బాగుంటుంది.. వాళ్లు చేయగలిగే పనులేంటీ..? అనే అంశాలపై ఓ పది పాయింట్లతో కూడిన సర్వే చేపడుతున్నాం. వీరి అభివృద్ధికి ఏం చేస్తున్నామనే విషయాన్ని వివరించేందుకు ప్రతి బంగారు కుటుంబానికీ విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా వారి అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం. బంగారు కుటుంబాల స్థితిగతులపై ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష చేపట్టాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
మార్గదర్శులుగా 57,503 మంది నమోదు :
‘బంగారు కుటుంబాల అత్యంత ప్రాధాన్యతలపై చేపట్టిన సర్వేను ఆగస్ట్ 10లోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ‘‘మార్గదర్శులు అందించే ఆర్ధిక, ఆర్ధికేతర సాయంపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ప్రతీ మార్గదర్శికి అధికారులు నమ్మకాన్ని కలిగించాలి. గ్రామ, వార్డు సచివాలయస్థాయిలో బంగారు కుటుంబాలు, మార్గదర్శుల వివరాలు సరిగ్గా నమోదు చేసినప్పుడే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. పీ4 నిర్వాహకులు, బంగారు కుటుంబాలకు ఆన్‌లైన్ ద్వారా అవగాహన కల్పించాలి’ అని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. ఆగస్ట్ 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను ‘మార్గదర్శులు’ దత్తత తీసుకునేలా చూడాలని మరోసారి అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా, 57,503 మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని… మొత్తం లక్ష్యం నెరవేరాలంటే మరో 2 లక్షలమంది మార్గదర్శుల అవసరం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. పల్నాడు జిల్లా నుంచి అత్యధికంగా బంగారు కుటుంబాల దత్తత జరిగిందని.. విశాఖపట్నం జిల్లా ఈ విషయంలో చివరిన ఉందని వెల్లడిరచారు. దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆటోమేటెడ్ మెసేజ్ రూపంలో సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియా, ఇతర ప్లాట్ ఫామ్‌ల ద్వారా పీ4 కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తలపెట్టిన డిజిటల్ ప్రమోషన్ కార్యకలాపాల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
3 విధానాల్లో జీరో పావర్టీ పీ4 అమలు :
3 విధానాల్లో జీరో పావర్టీ పీ`4 అమలు జరుగుతోంది. బంగారు కుటుంబాన్ని మార్గదర్శి దత్తత తీసుకోవడం, వారికి ఆర్ధికేతర సాయాన్ని అందించటం మొదటి విధానం. దీనికి కాలపరిమితి అంటూ ఏమీ ఉండదు. రెండో విధానంలో ‘ఫండ్ ఏ నీడ్’, దీని కింద ఎవరికైతే ఆర్ధిక అవసరాలు ఉంటాయో వారికి నగదు సాయం అందించేలా కార్యాచరణ రూపొందించారు. అయితే దీనికి కాలపరిమితి ఉంటుంది. మూడో విధానంలో గ్రామాలను, మండలాలను దత్తత తీసుకోవడం. ఒక ప్రాంతంలో, ఒక ఊరిలో కమ్యూనిటీ అవసరాలు తీర్చడం, అక్కడ వివిధ అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేలా తీర్చిదిద్దారు. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి ఈ మూడో విధానం అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు… పీ4కి భాగస్వాములుగా వ్యవహరిస్తున్న కేపీఎంజీ, మిలాప్, తమ్మడ, భవ్య, భార్గో, ప్రాజెక్ట్ డీప్ సంస్థలు మరింత కీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒక బంగారు కుటుంబానికి అవసరమైతే ఒకరికిమించి మార్గదర్శులు సాయం అందించేలా చూడాలన్నారు.
ఆగస్టు 15నుంచి పీ`4 ఫేజ్-1
‘‘ఆగస్టు 15నుంచి పీ`4 మొదటి విడత ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నా దగ్గరనుంచి ఎమ్మెల్యే వరకూ పని చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినుంచి క్షేత్రస్థాయి ఉద్యోగి వరకు కృషి చేయాలి. బంగారు కుటుంబాలను.. మార్గదర్శులను గుర్తించే విషయంలో కొన్ని జిల్లాలు ఇంకా మెరుగ్గా పనిచేయాలి. వచ్చే 15 రోజుల్లో దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో కసరత్తు చేయాలి. ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి’’ అని సీఎం సూచించారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. సీఎం స్ఫూర్తితో తాను కూడా ఐదు పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ ప్రకటించారు. షాజహాన్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ తరహా కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు సహకరిస్తామని ప్రజా ప్రతినిధులు సీఎంకు హామీనిచ్చారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, స్వర్ణాంధ్ర పీ`4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు, ప్రణాళికశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.