- రాజధానిపై దుష్ఫ్రచారాలు నమ్మవద్దు
- రైతుల ప్లాట్లలో త్వరలో అభివృద్ధి పనులు
- వైసీపీ నిర్వాకంతో సింగపూర్‌తో రిలేషన్స్ కట్
- చంద్రబాబు పర్యటనతో ఆ ముద్ర తొలగిస్తాం
- పురపాలక మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి(చైతన్యరథం): రాజధాని నిర్మాణంపై కొంతమంది పనిగట్టుకుని చేసే దుష్ప్రచారాలు నమ్మవద్దని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రజలకు, అమరావతి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మూడేళ్లలో ఖచ్చితంగా నూటికి నూరు శాతం రాజధాని పనులు పూర్తిచేసి తీరుతామని స్పష్టం చేశారు. అమరావతిలో జరుగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. సీఆర్డీఏ ఇంజినీర్లతో కలిసి నేలపాడులోని నాన్ గెజిటెడ్ అధికారులు, గెజిటెడ్ అధికారులు టైప్-1, టైప్-2, గ్రూప్ – డి ఉద్యోగుల క్వార్టర్లను పరిశీలించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేలపాడులో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అమరావతిపై కక్షతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయాలతో వాటిని సరిదిద్దేందుకు ఏడాది పట్టింది. పాత టెండర్లు రద్దు చేయలేదు..కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేదు. న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు కమిటీలు వేసి అన్నీ పరిష్కరించాల్సి వచ్చిందని వివరించారు. గతంలో మధ్యలో నిలిచిన నిర్మాణాల పటిష్టత విషయంలో ఐఐటీ చెన్నై, ఐఐటీ హైదరాబాద్ నిపుణులతో కమిటీలు వేశాం.
ఎట్టకేలకు అన్ని నివేదికల ఆధారంగా తిరిగి కొత్తగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో సుమారు 10 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అవసరమైన యంత్రాలు పనుల్లో ఉన్నాయి. నాన్ – గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం మొత్తం 21 టవర్ల లో 1995 ప్లాట్లు నిర్మిస్తున్నాం. వీటిలో 9 టవర్ల నిర్మాణం పూర్తయింది. మిగతా టవర్ల నిర్మాణం డిసెంబర్ నెలాఖరుకు పూర్త వుతుంది. ఇక గెజిటెడ్ ఆఫీసర్ల కోసం మొత్తం 14 టవర్లలో 1140 ప్లాట్లు నిర్మిస్తున్నాం. వీటిలో 11 టవర్ల నిర్మాణం పూర్తయింది. మరో 5 టవర్ల నిర్మాణం వేగంగా జరుగుతుంది. భవనాల నిర్మాణాలతో పాటు రోడ్లు, తాగునీరు, డ్రైనేజి నిర్మాణాలు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. మొత్తం 4000 ప్లాట్ల నిర్మాణంతో ఒక టౌన్‌షిప్ తయారుకానుంది. కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా ఇక్కడ నివాసం ఉండే వారి కోసం అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నాం. ఎస్‌ఆర్‌ఎం, విట్ యూనివర్శిటీలు అమరావతిలో మెడికల్ కాలేజీలు నెలకొల్పుతున్నాయి. ముందుగా ఈ రెండు యూనివర్శిటీలు 50 చొప్పున పడకలతో రెండు ఆసుపత్రులు వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నాయి. అలాగే ఈ రెండు యూనివర్శిటీలు రెండు సీబీఎస్‌ఈ స్కూల్స్ వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఏర్పాటు చేయనున్నాయి. ఇలా అమరావతి నిర్మాణం అన్ని వసతులతో పూర్తిచేస్తున్నామని వివరించారు.
రైతుల ప్లాట్లలో త్వరలో అభివృద్ధి పనులు
రాజధానికి భూములిచ్చిన రైతులకు తిరిగిచ్చిన ప్లాట్లలో అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. ఆయా పనులకు ఇప్పటికే టెండర్లు కూడా పూర్తి చేశామని తెలిపారు. 360 కి.మీ మేర ట్రంక్ రోడ్లు, 1500 కిలో మీటర్ల మేర లేఅవుట్ రోడ్లకు టెండర్లు పూర్తయ్యాయి. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు.
సింగపూర్ ప్రభుత్వాన్నీ వేధించిన వైసీపీ
గత ప్రభుత్వానికి ఒక నగరం నిర్మాణం ఎలా చేయాలో అవగాహన లేదు. 2014-19 మధ్య సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. ఆ దేశ ప్రధాని, ఇతర అధికారులతో చర్చించి కమిటీలు వేసి అమరావతి అభివృద్ధి కోసం ముందుకెళ్లాం. రాజధానిలో 1450 ఎకరాలు భూమిని స్విస్ ఛాలెంజ్ విధానంలో 42:58 నిష్పత్తిలో కేటాయించాం. దీనివల్ల అమరావతికి పెద్ద కంపెనీలు, బ్యాంకులు వస్తే పెద్దఎత్తున ఉద్యోగాలు వచ్చేవి. అయితే గత వైసీపీ ప్రభుత్వం సింగపూర్ అధికారులపై కేసులు పెట్టారు. అక్కడికి వెళ్లి మరీ వారిని వేధించారు. దీంతో సింగపూర్ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సింగపూర్ పర్యటనలో ఏపీ ప్రభుత్వంపై ఉన్న ముద్ర పోగొట్టుకునేలా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతాయని తెలిపారు.