- ఈ ఏడాది చివరి నాటికి పంపిణీ
- కూటమి ప్రభుత్వంలో విద్యాభివృద్ధికి కృషి
- విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
- 453 మందికి ఉచితంగా సైకిళ్ల పంపిణీ
అద్దంకి(చైతన్యరథం): అద్దంకి నియోజవర్గ పరిధిలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యను అభ్యసిస్తున్న సుమారు 10 వేల మంది విద్యార్థులకు ఈ ఏడాది చివరి నాటికి సీఎస్‌ఆర్ నిధులతో సైకిళ్లను ఉచితంగా అందిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి శుక్రవారం పర్యటించారు. ముందుగా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 104 మంది విద్యార్థులకు సీఎస్‌ఆర్ నిధులతో ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం మక్కెనవారిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 349 మంది విద్యార్థులకు కూడా సైకిళ్లను అందజేశారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 453 మంది విద్యార్థులకు సైకిళ్లను అందించారు. అనంతరం కొమ్మాలపాడు పాఠశాల ఆవరణలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ సీఎస్‌ఆర్ నిధులతో సైకిళ్లు అందించిన కార్పొరేట్ కంపెనీ ఉపాధ్యక్షుడు రఘురామ్‌తో పాటు ఇతర కంపెనీల ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో మంత్రి లోకేష్ పాఠశాల విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని పేర్కొన్నారు. మక్కెనపాడు పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ అవసరమని కొందరు అధ్యాపకులు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా అసంపూర్తి భవనాలను వెంటనే పూర్తి చేయడంతో పాటు విద్యార్థులకు అవసరం అయితే నూతన భవనాల నిర్మాణం కూడా చేపడతామని హామీ ఇచ్చారు.
చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం
రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని తెలిపారు. మేజరు, మైనరు కాల్వలను కూడా శుభ్రం చేశామని, పూడికతీత పనులు చేపట్టామని తెలిపారు. పూడికతీత పనులకు ఇంకా అవసరమైతే సొంత మిషన్లు పంపిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైన గ్రామాల రైతులు సంప్రదించాలని కోరారు. గతేడాది కూడా ఇదే విధంగా సొంత మిషన్లతో కాలువల పూడికతీత పనులు పూర్తి చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. త్వరలోనే రైతులకు కూడా రూ.20 వేలు ఆర్థిక భరోసా అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
46 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
అద్దంకి నియోజకవర్గం, సంతమాగులూరు మండలంలో శుక్రవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమంలో గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 46 మంది లబ్ధిదారులకు చెక్కులను, ఎల్‌ఓసీలను పంపిణీ చేశారు. మక్కెనవారిపాలెం గ్రామంలో రూ.30 లక్షలతో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలతో పాటు పలువురు పాల్గొన్నారు.