- మీ పెట్టుబడులు మాకు ఎంతో విలువైనవి
- ఏపీలో గరిష్ఠ ప్రోత్సాహకాలతో అత్యుత్తమ విధానాలు
- ఆనంద్ మహేంద్ర ట్వీట్‌కు బదులిచ్చిన మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో తాము కూడా కలిసి నడుస్తామని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌పై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో మంత్రి లోకేష్ పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో మీ పెట్టుబడులను అత్యంత విలువైనవిగా మేము భావిస్తున్నాం. అవి మరిన్ని రంగాలకు విస్తరించే సమయం కోసం మేము ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), రక్షణ, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో పెట్టుబడులకు మహాంద్రా గ్రూప్ విస్తరణ ప్రణాళికలు రూపొందిస్తోందనే వార్తలు వస్తున్నాయి. మీరనుకుంటున్న ప్రతి రంగానికి గరిష్ట ప్రోత్సాహకాలను అందించే అత్యుత్తమ విధానాలను మేము అమలు చేస్తున్నాం. మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో పెట్టుబడుల కోసం కూడా మీరు మా రాష్ట్రాన్ని పరిగణించగలిగితే ఎంతో సంతోషిస్తాను. మా వేగం, సానుకూల విధానాలతో మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటామని మేము హామీ ఇస్తున్నాం. అలాగే, భాషా భేదాలు లేని స్నేహపూర్వక వాతావరణం, ఏ భాషలో మాట్లాడాలన్నా ఇబ్బంది లేని వాతావరణం మీ సిబ్బందికి కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం… అంటూ మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు.