- చట్టానికి ఎవరూ అతీతులు కారు
- జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం
విజయవాడ (చైతన్యరథం): పోలీసులను ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఐజీ స్థాయి అధికారులను మాఫియా డాన్లతో పోల్చడం అత్యంత దారుణమని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇలాంటి వ్యాఖ్యలు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని అన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలోనూ ఇదే పోలీసులు పనిచేసిన విషయం జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా విధులు నిర్వహిస్తామన్న శ్రీనివాసరావు.. అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి కానీ, ఇష్టారీతిన ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రతీ అంశంలో పోలీసులపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. తనకు రక్షణ కల్పించకుండా కుట్రలు చేస్తున్నారని సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడటం సబబు కాదని విమర్శించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని తెలుసుకోవాలని ఆయన హితవుపలికారు.
వైసీపీ ప్రభుత్వంలో కూడా తాము చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు పెట్టామని.. అరెస్ట్‌లు చేశామన్నారు. పోలీసులను వీఆర్‌లో పెట్టడం అనేది గత ప్రభుత్వంలోనూ చేశారని మండిపడ్డారు. ఆరోపణలు వచ్చిన అధికారులపై చర్యలు సహజమని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత మంది పోలీసులను పక్కన పెట్టారో గుర్తు చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు పోలీసులు వాటాలు పంచుతున్నారని చెప్పడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఐజీ స్థాయి అధికారిని డాన్ అని చెప్పడం సరికాదన్నారు. పోలీసు వ్యవస్థను నడిపే డీజీపీని టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.డీజీపీ సారథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. ఎక్కడో ఒకచోట పోలీసు శాఖలో కొన్ని లోపాలు ఉండొచ్చని, పొరబాట్లు జరిగి ఉండవచ్చన్నారు. అలా అని పోలీసులు మొత్తాన్ని కించ పరిచేలా మాట్లాడటం సరికాదని శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు.
అన్నీ చట్ట ప్రకారమే
పోలీసులు ఎప్పుడూ ఏ ఒక్కరికో కొమ్ము కాయరని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా చట్ట ప్రకారం తాము పని చేస్తామని వెల్లడిరచారు. పోలీసుల వల్ల ఇబ్బంది కలిగితే న్యాయ స్థానాల ద్వారా చర్యలు తీసుకోవచ్చన్నారు. అనవసర రాజకీయాలతో పోలీసు వ్యవస్థ పరువు తీయవద్దని హితవు పలికారు. నిబంధనలు ప్రకారం జగన్ మోహన్ రెడ్డికి భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. ఐపీస్ అధికారి సిద్ధార్థ కౌశిల్ సొంత కారణాలతో రాజీనామా చేశారని చెప్పారు. ఆ అంశాన్ని డీజీపీకి, ప్రభుత్వానికి ఆపాదించి అబద్ధాలు ప్రచారం చేశారని జగన్‌పై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలోనూ తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నానని.. ఇప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్లు తెలిపారు. చట్టానికి ఎవరూ చుట్టం కాదు.. తప్పు చేస్తే ఎవరైనా కటకటాలు లెక్క పెట్టాల్సిందనని జనకుల శ్రీనివాసరావు స్పష్టం చేశారు.