- ఎవరి హయాంలో రాయలసీమ అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా
- ఆర్థికమంత్రి పయ్యావుల సవాల్
నంద్యాల (చైతన్యరథం): రాయలసీమ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తుంటే, ఇక్కడ అరాచకం సృష్టించాలని జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఎవరి హయాంలో రాయలసీమ అభివృద్ధి జరిగిందనే విషయంలో జగన్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. గురువారం నంద్యాల జిల్లా మల్యాల వద్ద హంద్రీనీవా కాల్వలకు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. బనకచర్లపై జగన్ మాటలను చరిత్ర క్షమించదన్నారు. బనకచర్ల గురించి తప్పుగా మాట్లాడిన జగన్.. సీమ ద్రోహిగా మిగిలిపోతారని మంత్రి పయ్యావుల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాయలసీమ తలరాతను మార్చడానికి అన్న ఎన్టీఆర్ హంద్రీ నీవాకు శ్రీకారం చుట్టారని.. ఆ బాధ్యత చంద్రబాబు పూర్తి చేశారని తెలిపారు. వైసీపీ హయాంలో గంప మట్టి కూడా తీయని పరిస్థితి నుండి నేడు కాలువల్లో పూర్తిస్థాయిలో నీరు పారించే దశకు తీసుకొచ్చామన్నారు. రాయలసీమలో జగన్ పాలెగాళ్ల రాజ్యం తేవాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి అలజడులు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు రాయలసీమలో కరువు, ఫ్యాక్షన్ నిర్మూలించి.. సాగునీటితో సస్యశ్యామలం చేస్తున్నారన్నారు.
సీమ గడ్డ నుంచే జగన్‌ను ప్రశ్నిస్తున్నాను..జగన్ రాయలసీమకు ఏం చేశాడో చెప్పాలి. హంద్రీనీవా కాలువ గట్టుమీద చర్చకు సిద్ధమా అంటూ పయ్యావుల ఛాలెంజ్ చేశారు. జగన్ నీచ భాష మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎగిరిపోయే నాయకుడు కాదని.. ఎదిగిపోయే నాయకుడని స్పష్టం చేశారు. ఎవరు ఎగిరిపోతారో.. ఎవరు ఎదిగిపోతారో చరిత్ర చెబుతోందన్నారు. తల్లి చెల్లిని పక్కన పెట్టిన వాడు జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు జగన్ రాష్ట్రాన్ని చెడగొడితే.. దానిని మొదటి రోజు నుంచి చక్కబెట్టే పనిలో చంద్రబాబు ఉన్నారన్నారు.