అమరావతి (చైతన్యరథం): వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కృష్ణా జిల్లా పామర్రు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ నెల 8న పామర్రులోని ఆరేపల్లి కల్యాణ మండపంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో నాని మాట్లాడుతూ రప్పా.. రప్పా అంటూ వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఇవి టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలను పెంచేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని టీడీపీ సీనియర్ నాయకుడు చాట్ల రమేష్, ఇతర నేతలు పామర్రు సీఐ సుభాకర్‌కు ఫిర్యాదు చేశారు. కార్యకర్తలను ఆ విధంగా ప్రేరేపించిన పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్, వైసీపీ నాయకులు, కల్యాణ మండప నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తోసి పుచ్చింది.