న్యూఢిల్లీ (చైతన్యరథం): అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టేసింది. ఈ కేసులో వంశీకి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం అనుమతిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టాలని హైకోర్టును ధర్మాసనం ఆదేశించింది. కేసు మెరిట్స్‌లోకి, పీటీ వారెంట్స్‌లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఇరు పక్షాల వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టును ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. కోర్టుకు చెప్పారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన నాలుగు వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.