నందికొట్కూరు (చైతన్య రథం): పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో జల జగడం అవసరమే లేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. హంద్రీనీవా పేజ్-1లో భాగంగా పూర్తైన కాల్వలకు నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్‌నుంచి గురువారం జలాలను విడుదల చేశారు. అనంతరం జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి వినియోగదారులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ` ‘‘నదీ జలాల విషయంలో ఢల్లీిలో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నీటి వివాదాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నా’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘‘జలాల కోసం తెలంగాణతో గొడవలు పడాల్సిన అవసరం లేదు. రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరించాలన్నదే నా కోరిక. గోదావరి బోర్డు హైదరాబాదులో.. కృష్ణా బోర్డు విజయవాడలో పెడుతున్నాం. శ్రీశైలం ప్లంజ్ పూల్ పనులకు మనమే డబ్బులిచ్చి పనులు చేస్తాం. అవసరమైతే గోదావరి నీళ్లు వాడుకోమని తెలంగాణకు చెప్పాను. నదుల అనుసంధానానికి సహకరించమని కోరాను. సముద్రంలోకి పోయే నీరు రెండు రాష్ట్రాలు వాడుకుంటే సీమ, తెలంగాణలో మెట్టప్రాంతాలు బాగుంటాయి. సమైక్యాంధ్రలో తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా ఉన్నాను. పదేళ్లు విపక్షనేతగా ఉన్నాను. విభజన తర్వాత నవ్యాంధ్ర సీఎం అయ్యాను. నేను ప్రజల కోసం పనిచేస్తున్నాను. చిన్నచిన్న ఇబ్బందులకు భయపడిపారిపోను. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలబెడతానని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.