- రూ. 143 కోట్లతో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు
- నాణ్యమైన బియ్యంతో భోజనం, అన్ని సౌకర్యాలు
- పేద విద్యార్దులు గొప్ప స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం
- మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
- ప్రకాశం జిల్లా కురిచేడు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
- పొదిలి ఎస్సీ బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లలో నిర్మాణ పనుల పరిశీలన
కురిచేడు/ పొదిలి (చైతన్యరథం): పేద విద్యార్దుల బంగారు భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం ప్రకాశం జిల్లా కురిచేడులో డా.బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో మంత్రి డా. స్వామి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సంధర్బంగా పాఠశాల ప్రాంగణమంతా తిరిగి పరిసరాలు, మరుగుదొడ్లు పరిశీలించారు. పాఠశాలలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్దులతో మాట్లాడి పాఠశాలలో సౌకర్యాలు, సమస్యలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొదిలిలో ఎస్సీ బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లలో మరమ్మత్తు పనులను మంత్రి స్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడున్న విద్యార్దుల తల్లితండ్రులతో మాట్లాడిన మంత్రి విద్య ఆవశ్యకతను వారికి వివరించారు. అనంతరం మంత్రి స్వామి మీడియాతో మాట్లాడుతూ… విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూటమి ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ. 143 కోట్లతో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేస్తున్నాం. పొదిలి ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో 90 శాతం, బాలికల హాస్టల్ లో 70 శాతం మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి. విద్యార్దులకు నాణ్యమైన బియ్యంతో భోజనం పెడుతున్నాం. రాష్ట్రంలో ఐఐటీ, నీట్ ఉచిత కోచింగ్ సెంటర్లు 10కి పెంచాం. ఐఐటీ, నీట్ లో అతి కొద్ది మార్కులతో సీట్లు పొందలేకపోయిన 80 మంది విద్యార్దులకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నాం. ఏదైనా అనారోగ్యంతో మరణించిన విద్యార్దుల కుటుంబాలకు అండగా ఉండేందుకు సాంత్వన పధకంతో రూ. 3 లక్షల ఆర్దిక సాయం అందిస్తున్నాం. త్వరలో 11 రకాల వస్తువులతో గురుకులాలు, వసతి గృహాల విద్యార్దులకు కాస్మోటిక్స్ కిట్స్ అందజేస్తాం. విద్యార్దులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. పేద విద్యార్థులు సమాజంలో గొప్ప స్థాయిుకి ఎదగాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి డా స్వామి స్పష్టం చేశారు.