- రాష్ట్రంలో అరాచకాలకు వైసీపీ ప్రణాళిక
- జగన్ కుట్రలను ప్రజలు ఉపేక్షించరు..
- ఐదేళ్ల రక్తదాహం ఇంకా తీరలేదా..?
- కూటమి సంక్షేమాన్ని చూసే వైసీపీ ఏడుపు
- వైసీపీ వైఖరిపై మంత్రి కొల్లు ధ్వజం
మంగళగిరి (చైతన్య రథం): పేర్ని నాని వీడియోతో వైకాపా కుట్రలు భగ్నమయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో సభ పేరుతో కులాల మధ్య అలజడులు సృష్టించేందుకు వైకాపా నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారని ధ్వజమెత్తారు. ఆడబిడ్డలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్న మంత్రి.. గుడివాడలో ఘర్షణలు పక్కా ప్రణాళికతోనే జరిగాయన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ డైరెక్షన్‌లో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, కుట్రపూరితమైన కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటున్నారని మంత్రి కొల్లు ధ్వజమెత్తారు. ‘ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటే భయపడేలా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్మన్ కారును వదిలేశామని, కానీ తర్వాత ఆమె కావాలని వెనక్కి వచ్చి పోలీసుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దుర్భాషలాడారని స్థానికులు చెబుతున్నారు.
తిరగబడితే దాన్ని టీడీపీ నాయకత్వానికి అంటగట్టాలని చూశారు. రాష్ట్రమంతా భగ్గుమనిపించాలని చూసి వైసీపీలు అడ్డంగా బుక్కయ్యారు’ అని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై బురదజల్లాలన్న వైసీపీ ప్రయత్నాలు ముందుకు సాగవని మంత్రి హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుంటే.. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని ఎలా రావణకాష్టంలా మార్చాలో కుతంత్రాలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షస మూకలకు రాక్షస ఆలోచనలే వస్తాయని పేర్ని నాని తన వ్యాఖ్యలతో నిరూపించాడని ధ్వజమెత్తారు. ‘జగన్‌రెడ్డి ఒక దళిత వృద్ధుడిని కారుతో తొక్కించి చంపేసి.. రప్పా రప్పా నరుకుతామంటుంటే.. రెండురోజుల క్రితం పేర్ని నాని పామర్రు సభలో ‘చీకట్లో కన్ను కొడితే నరికేయాలి.. పొద్దున్నే అందరితో కలిసి వచ్చి పరామర్శించాలి’ అన్నాడంటే వైసీపీ ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నారు.
జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, అధికారంలో ఉన్నా లేకున్నా చంద్రబాబు, లోకేష్‌లు రాష్ట్రాభివృద్ధినే కాంక్షించారని కొల్లు గుర్తు చేశారు. గుడివాడలో సభ ఏర్పాటు పేరిట రాద్దాంతం చేయడం వైసీపీ పైశాచికత్వానికి నిదర్శనమంటూనే.. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్ర చేసి.. రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు రెచ్చగొట్టాలని ప్రయత్నించడం వారి నీచ రాజకీయానికి పరాకాష్టగా అభివర్ణించారు. ‘వైసీపీ నాయకులకు మానవత్వం లేదు, గుడివాడలో రాద్ధాంతం సృష్టించిన మహిళ ఆడబిడ్డ అయి ఉండి ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. వైసీపీ నాయకుల ప్రవర్తన, ఆలోచనా విధానాలు దారుణంగా ఉన్నాయి. బూతులు, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. 151నుంచి 11కు పడిపోయినా బుద్ధి రాలేదు. దుర్మార్గపు చర్యలకు పాల్పడితే.. రాష్ట్రంలో వైసీపీ ఉనికి లేకుండా పోవడం ఖాయం. 2019 నుంచి 2024 వరకు ప్రజలపై దాడులు చేశారు, ఇబ్బందులు పెట్టారు. ప్రజలు ఇంకా వైసీపీ చేసిన గాయాలు మర్చిపోలేదు. వైసీపీ నాయకులు దీన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలించవని గుర్తెరగాలి’ అని కొల్లు భావోద్వేగంతో హెచ్చరించారు. ‘సొంత బాబాయిని గొడ్డలి వేటుతో లేపేసి.. డ్రామాలమీద డ్రామాలాడి.. హత్యా రాజకీయాలకు పాల్పడిన మీరు మనుషులేనా? మానవత్వం ఉందా? జగన్‌లాంటి రాక్షసుడిని ముఖ్యమంత్రిని చేసినందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు. సభలుపెట్టి నెత్తుటి రాజకీయాలు చేసే వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. పార్టీ సభ పెట్టుకుంటే తప్పులేదు. సభను అడ్డం పెట్టుకుని రక్తం పారిస్తానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు’ అని మంత్రి కొల్లు హెచ్చరించారు.
ఐదేళ్ల రక్తదాహం ఇంకా తీరలేదా?
ప్రజలు కనికరించి అధికారం ఇచ్చినందుకు ఐదేళ్ల పాలనాకాలంలో సాగించిన రక్తదాహం ఇంకా తీరలేదా? అని మంత్రి కొల్లు సూటిగా ప్రశ్నించారు. ‘మాస్కు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను చంపేశారు. మద్యంలో కల్తీని నిలదీసినందుకు మాచర్లలో కిరణ్‌ని రాత్రికి రాత్రే హత్య చేశారు. ఇసుక దందాను ప్రశ్నించిన దళిత యువకుడు వరప్రసాద్‌ను పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించారు. జగన్‌కు జై కొట్టలేదని బీసీ బిడ్డ తోట చంద్రయ్యను నడిరోడ్డుపై పీక తెంపారు. అమరావతికి భూములిచ్చిన మహిళలను బూటు కాళ్లతో తన్నించారు. మహిళలని కూడా చూడకుండా వ్యక్తిత్వ హననంతో మానసిక క్షోభకు గురి చేశావు. మీలాంటి రాక్షసత్వం కలిగిన వారిని సభ్యసమాజం ఎప్పటికీ క్షమించదు. మీ దుర్మార్గాలన్నీ బయటికొస్తున్నాయి’ అని కొల్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
చేసింది చూసే వాళ్ల ఏడుపు
‘‘వృద్ధులు, వితంతు, వికలాంగులకు పింఛన్లు ఇస్తున్నాం. ఆడబిడ్డలకు 2 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, ఏటా 3 సిలెండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తున్నాం. రైతులకు మూడు విడతల్లో 27 వేలు ఇవ్వబోతున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నాం. ఆటోలకు 10 వేలిచ్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నుండి డబ్బులు వచ్చేలా చేశాం. రాష్ట్రం నుండి తరలిపోతున్న స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాట పట్టించాం. ‘సుపరిపాలనలో తొలి అడుగు’కు వస్తున్న స్పందనను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కుట్రలు చేస్తూ.. కులాలు, మతాలు, ప్రాంతాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారు. అరాచకాలు, కుట్రలు చేసే వైసీపీ విధానాలను సాగనివ్వం. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే ప్రభుత్వం శిక్షించడానికి సిద్ధంగా ఉంది’’ అని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్వరంతో హెచ్చరించారు. వైసీపీలు ఎన్ని డ్రామాలాడినా.. జగన్‌ను ప్రజలు కనికరిస్తారనుకోవడం కల్ల అని మంతి కొల్లు జోస్యం చెప్పారు.