పరిగి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమంతో కూడిన సుపరిపాలన అందించారని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలం పి నరసాపురం గ్రామంలో మంత్రి సవిత శుక్రవారం ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, పింఛన్, తల్లికి వందనం పథకాలు అందాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి వైసీపీ నేతలకు నిద్రపట్టక ఏదో రకంగా బురదజల్లే కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు.
అదేవిధంగా అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి పేదల కడుపు నింపుతున్నామని, ఉచిత ఇసుక అందజేశామని ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేశామన్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గోకులం షెడ్‌లు నిర్మిస్లూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని, త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతామన్నారు. త్వరలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని, అదేవిధంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా కల్పిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు. పింఛన్లు అందని అర్హులు ఉంటే వారికి కూడా త్వరలోనే అందజేస్తామని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు