- 11 సీట్లు ఇస్తే నెలకోసారి బయటకు వస్తున్నాడు
- ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే ప్రజల మధ్యనే తిరుగుతాడు
- కూటమి ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు
- 75 ఏళ్లలో విద్యుత్‌కు నోచుకోని ప్రాంతాలకూ కరెంట్ అందించాం
- ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
యర్రగొండపాలెం (చైతన్యరథం): 2019 సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇస్తే… ఐదేళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్‌లో పడుకున్నాడని, గత ఎన్నికల్లో 11 సీట్లు ఇస్తే నెలకు ఒకసారి ప్రజల మధ్యకు వస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే ప్రజల మధ్యే ఉంటాడని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో శుక్రవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పుల్లల చెరువు మండలం, ఐ.టి. వరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. అనంతరం 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు మంత్రి భూమిపూజ చేశారు. ఐ.టి. వరంలో ఇంటింటి ప్రచారం చేసి… సంవత్సరకాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలున్న కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ హామీల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందుకుంటున్న లబ్ధిదారులతో మంత్రి గొట్టిపాటి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ…. రాష్ట్రంలోని అర్హులందరికీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ అందుతాయని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. పెన్షన్లను పెంచడంతో పాటు దీపం పథకం కింద మహిళలకు ఉచిత గ్యాస్ సిలండర్లు ఇచ్చామని, ఇంట్లో ఉన్న విద్యార్థులందరికీ తల్లికి వందనం కింద రూ.13,000 తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. 67 లక్షల మందికి తల్లికి వందనం పథకంలో భాగంగా ఒకే రోజు రూ.10,000 కోట్లు జమ చేయడం దేశంలోనే ఒక రికార్డు అన్నారు. ఆగస్ట్ నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్నీ కల్పిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడిరచారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల తరువాత కూడా ఇంకా విద్యుత్ లేని తండా వాసులకు, ఎస్టీ కాలనీలకు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత కరెంట్ అందించామని మంత్రి తెలిపారు. అదే విధంగా టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో కూడా సోలార్, బ్యాటరీ స్టోరేజ్ ద్వారా విద్యుత్ ను అందుబాటులోకి తీసుకు వచ్చామని చెప్పారు.
కూటమి ప్రభుత్వంతోనే ప్రజలకు మేలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 ఎమ్మెల్యే సీట్లలో తరువాతి ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధించాలని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు. తాము అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నామని…. వైసీపీ నేతలు అరాచకమే ధ్యేయంగా పని చేస్తున్నారని తెలిపారు. 175 సీట్లు గెలుస్తామని జగన్ చెప్పిన మోసపు మాటల్ని నమ్మి ఎంతో మంది పందేలు కట్టి ప్రాణాలు కోల్పోయారన్నారు. అటువంటి వారికి విగ్రహాలు పెడుతూ, కారు కింద మనుష్యుల్ని తొక్కించుకుంటూ వెళ్లడమే జగన్ చేసే అభివృద్ధి అని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. ఇటువంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించాలో వద్దో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. సంవత్సరకాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు కూడా గమనించాలని కోరారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే ఒక సబ్ స్టేషన్‌కు శంకు స్థాపన చేశామని, వచ్చే ఐదు నెలల్లో దీనిని అందుబాటులోకి తెస్తామన్నారు. అదే విధంగా రైతులకు వ్యవసాయంలో విద్యుత్ ఇబ్బందులు లేకుండా మరో రెండు సబ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని నా సొంత నియోజకవర్గంలా అభివృద్ధి చేస్తానని, అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో పాటు పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.