- విద్యార్థులు సోషల్ మీడియాపై అప్రమత్తంగా ఉండాలి
- హోం మంత్రి అనిత స్పష్టీకరణ
అనకాపల్లి (చైతన్యరథం): సోషల్ మీడియాలో అభ్యంతరకర, తప్పుడు పోస్టులు పెడితే, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. పిల్లలు సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు. ఆడ, మగ అని తేడా ఉండకూడదని.. తల్లిదండ్రులు ఇద్దరిని సమానంగా చూడాలని ఉద్బోధించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో శుక్రవారం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హోం మంత్రి అనిత హాజరయ్యారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను హోం మంత్రి అనిత సన్మానించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత ప్రసంగించారు. కనిపించే దేవత అమ్మ.. అమ్మను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని సూచించారు. విద్యను మించిన ఆస్తి లేదన్నారు. తాను ఒకప్పుడు టీచర్‌ని అని చెప్పడానికి గర్వంగా ఉంటుందని హోంమంత్రి అనిత ఉద్ఘాటించారు. మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి చదువు అని చెప్పారు.
ఇప్పుడు తమ ప్రభుత్వంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్‌లో మాత్రమే పేరెంట్ – టీచర్స్ మీటింగ్స్ జరిగేవని వెల్లడిరచారు. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పేరెంట్ – టీచర్స్ మీటింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు. విద్యకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో, హాస్టల్స్‌లో సన్నబియ్యం ఉపయోగిస్తున్నామని తెలిపారు. గత జగన్ పాలనలో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా ఏరులై పారేదని హోంమంత్రి అనిత ఆరోపించారు. గంజాయి కేసుల్లో పట్టుబడితే సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నామని ఉద్ఘాటించారు. గంజాయి మత్తులో పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చుదామని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.