- ప్రపంచానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే
- జనాభా నిర్వహణకు ఉత్తమ పాలసీలు అమలు
- ప్రభుత్వ ఆఫీసుల్లో చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు
- జనాభా ఎక్కువున్న దేశాలపై ప్రపంచం ఆధారపడే పరిస్థితి
- నాడు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించా..
- నేడు జనాభా నిర్వహణ అవసరమని చెబుతున్నా
- దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ స్ఫూర్తి కొనసాగించాలి
- ఫెర్టిలిటీ రేటు పెరిగితేనే మానవ వనరులు సాధ్యం
- ప్రపంచ జనాభా దినోత్సవం అమరావతి సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): దేశానికి బలమైన ఆర్థికవనరు జనాభాయేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జనాభా పెరుగుదలకు త్వరలో మంచి పాలసీ తీసుకొస్తామన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అని చెప్పిన గురజాడ అప్పారావు స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సచివాలయం వద్ద ప్రపంచ జనాభా దినోత్సవంపై మొదటి అమరావతి సమ్మిట్‌కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘జనాభా నిర్వహణ విధానం.. ప్రతి కుటుంబం ముఖ్యం-మీ అభిప్రాయం మార్గదర్శనం అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన సర్వేను సీఎం ప్రారంభించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రత్యుత్పత్తి రేటు పెరగాలి
సమైక్యాంధ్రలో జనాభా నియంత్రణను ఉద్యమంలా చేపట్టామని, ఇప్పుడు జనాభా నిర్వహణ అవసరమని చెబుతున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. అగ్రదేశాలతో భారత్ పోటీ పడుతోందంటే దానికి జనాభానే కారణమన్నారు. ‘ఒకప్పుడు జనాభా పెద్ద సమస్యగా ఉండేది. 2004కు ముందు సీఎంగా ఉన్నప్పుడు జనాభా నియంత్రణకు ప్రోత్సాహకాలు ఇచ్చాను. ఇద్దరు పిల్లలకంటే ఎక్కుమంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని చేస్తూ చట్టాన్ని తెచ్చాను. ఇప్పుడు ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులుగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిరది. దేశమంటే రాష్ట్రాలు, ప్రాంతాలు, పట్టణాలు, సరిహద్దులు, భూభాగాలు మాత్రమే కాదు, దేశం అంటే మనుషులు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
మన బలం మానవ వనరులు
1989 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరిన సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. ‘ఈ రోజు ప్రపంచంలో 10నుంచి 24 ఏళ్ల వయసు ఉన్నవారు 1.8 బిలియన్లు ఉన్నారు. ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారు. కానీ జనాభా ఉన్న దేశాలవైపే అగ్రరాజ్యాలు చూడాల్సి వస్తోంది. జనాభా ఎప్పటికీ భారం కాదు… అదే మనకు తిరుగులేని ఆస్తి. ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో అభివృద్ధి సాధ్యమా? అనే పరిస్థతినుంచి ఆ జనాభానే మనకు అడ్వాంటేజ్‌గా మారింది. 140 కోట్ల జనాభా కలిగి ఉన్న మన దేశం చైనాను కూడా వెనక్కు నెట్టింది’ అని ముఖ్యమంత్రి అన్నారు.
యువశక్తి తగ్గి… వృద్ధులు పెరుగుతున్నారు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జనాభాతోపాటు జననాల రేటు తగ్గిపోతోందని చంద్రబాబు అన్నారు. యువశక్తి తగ్గిపోయి వృద్ధులు పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఏ దేశంలోనైతే వయోజన సమస్య వస్తుందో అక్కడ వృద్ధిరేటు నిలిచిపోతుంది. భవిష్యత్‌లోనూ సమస్యలు వస్తాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సంతానోత్పత్తి రేటు పడిపోతోంది. అమెరికాలో 1.62 శాతం, యూకేలో 1.54 శాతం, హంగేరిలో 1.50 శాతం, ఫ్రాన్స్‌లో 1.49 శాతం, రష్యాలో 1.47 శాతం, జర్మనీలో 1.46 శాతం, కెనడాలో 1.33 శాతం, జపాన్‌లో 1.23 శాతం, చైనాలో 1.02 శాతం, సింగపూర్‌లో 0.96 శాతం ఉంది. సంపన్న దేశాల్లో తక్కువ జననాల రేటు కన్పిస్తోంది. 2.1 కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. మన దేశంలో బీహార్ 3.0, మేఘాలయ 2.9, యూపీ 2.4, జార్ఘండ్ 2.3, మణిపూర్ 2.2, తమిళనాడు 1.8, తెలంగాణ 1.8, కేరళ 1.8, కర్ణాటక 1.7, ఏపీ 1.7 శాతంగా ఉన్నాయి. జనాభా సమతుల్యత సాధించాలంటే 2.1 రేటు ఉండాలి. అప్పుడే జనన మరణాలు సమతుల్యంగా ఉంటాయి’ అని సీఎం వివరించారు.
పిల్లలను కనేవారికి విదేశాల్లో ప్రోత్సాహకాలు
పిల్లలను కనేవారికి కొన్ని దేశాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఆయా దేశాల్లో పిల్లలను కనే వారికి ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి వేదికపై చదివి వినిపించారు. ‘జపాన్‌లో పిల్లలు స్కూలుకు వెళ్లే వరకూ చైల్డ్ కేర్ సేవలను అందించడంతోపాటు పిల్లల చదువుకు ఆర్థిక సాయం లేదా ఉచిత విద్యను అందిస్తున్నారు. ఎక్కువమంది పిల్లలుంటే ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయంతో పాటు తక్కువ రెంట్‌తో ఇల్లు అద్దెకు ఇస్తున్నారు. దక్షిణ కొరియా దేశంలో నెలవారీగా ప్రత్యక్ష నగదు బహుమతులు అందించడంతోపాటు వివాహం, కాన్పులకు, ఐవిఎఫ్ గర్భధారణకు సాయం చేస్తున్నారు. సింగపూర్ దేశంలో బేబీ బోనస్ స్కీమ్ కింద పుట్టిన ప్రతి శిశువు కోసం కొంత నగదు అందిస్తున్నారు. మ్యాచ్ సేవింగ్స్ కింద ప్రభుత్వ సొమ్మును జోడిరచి పిల్లల ఖాతాల్లో వేస్తున్నారు. రష్యాలో రెండవ బిడ్డనుకంటే ఫ్రీ హెల్త్‌కేర్ కింద గర్భిణీలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. హంగేరీలో నలుగురుకంటే ఎక్కువ పిల్లులున్న వారికి జీవితాంతం ఆదాయ పన్నునుంచి మినహాయింపు ఇస్తున్నారు. చైనాలో ఇద్దరుకంటే ఎక్కువమంది పిల్లలుంటే రూ.12 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నారు’ అని వివరించిన సీఎం.. మరికొన్ని దేశాలు ఇస్తున్న ప్రోత్సాహకాలను కూడా వివరించారు.
అగ్రస్థానంలో భారతీయులే..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మన దేశంలో సుస్థిరపాలన, అభివృద్ధి జరుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలతో 1995లో టెక్నాలజీ విప్లవం వచ్చిందన్నారు. ఐటీతో ప్రపంచవ్యాప్తంగా మన భారతీయులు అగ్రస్థానంలో నిలిచారన్నారు. ‘అమెరికాలో 43 దేశాలకు చెందిన 125మంది బిలీనియర్లలో మనవారు 10మంది ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం మన భారతీయులకే వస్తోంది. 2047 వరకూ జనాభాపరమైన ప్రయోజనం ఉన్నప్పటికీ… సరైన సమయంలో పరిష్కార మార్గాలు అవలంభిస్తే విజేతలుగా నిలుస్తాం. ప్రపంచంలో ఉన్నవారిని కలుపుకుని చూసుకుంటే గ్రోత్‌రేట్‌లో 4వ స్థానంలో ఉన్నాం. మనం తీసుకునే పబ్లిక్ పాలసీలు ఆర్థిక అసమానతలు తొలగించి, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగినప్పుడే నిజమైన సుస్థిరత సాధ్యమవుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
ఖర్చులు పెరుగుతున్నాయని పిల్లల్ని కనడం లేదు
జనాభా తగ్గిపోతే వృద్ధి రేటు పడిపోతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదలపై సమావేశంలో పోల్ నిర్వహిస్తే ఇద్దరు పిల్లలుండాలని 67.41 శాతంమంది, ఒకరే ఉండాలని 12.34 శాతంమంది, ముగ్గురు పిల్లలుండాలని 19.88 శాతం మంది అభిప్రాయపడ్డారని వివరించారు. పిల్లలను కనడానికి యువత ఆస్తకి చూపడం లేదని, చాలామంది భార్యాభర్తలు పిల్లలను వద్దనుకునే పరిస్థితికి వచ్చారన్నారు. ఖర్చులు పెరుగుతాయని పిల్నల్లి కనడానికి ఇష్టపడటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, రానురాను అవి కనుమరుగవుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘గత కొన్నేళ్ల వరకు ఇంట్లో ప్రతి ఒక్కిరికీ 5 కేజీల చొప్పున బియ్యం ఇచ్చేవాళ్లం. ఐదుగురు ఉంటే 25 కేజీలు ఇచ్చేవాళ్లం. అంతకంటే ఎక్కువమంది ఉంటే బియ్యం ఇచ్చేవాళ్లం కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక కుటుంబంలో పదిమంది ఉన్నా 50 కేజీల కంటే ఎక్కువ ఇచ్చేదానిపై ఆలోచిస్తున్నాం. దక్షిణ భారత దేశంలో జనాభా తగ్గిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్‌లో పార్లమెంటు సీట్లు పెరుగుతాయి. కానీ దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలకు సీట్లు తగ్గిపోతాయని కొందరు ఆందోళన చెందుతున్నారు’ అని అన్నారు.
మహిళల కష్టాన్ని గుర్తించాం..
తాను మహిళా పక్షపాతినని, కొందరు మగవాళ్లు ఇంటి బాధ్యత అంతా ఆడవాళ్లదే అన్నట్టు వ్యవహరిస్తారని, అది సమంజసం కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆడ, మగ ఇద్దరూ సమానమేమనని, మగవారితో సమానంగా మహిళలు పనిచేస్తున్నారని అన్నారు. ‘సాఫ్ట్‌వేర్ రంగంలో భర్తలకంటే భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది. మహిళా శక్తి గుర్తించి న్యాయం చేసిన టీడీపీ. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. మహిళా యూనివర్సిటీ పెట్టారు. ఇంటికే పరిమితమైన మహిళల కోసం నేను డ్వాక్రా, మెప్మా సంఘాలు పెట్టి ఆర్థిక చేయూత అందించాను. నా తల్లి కట్టెల పొయ్యిపై వంట చేసేప్పుడు పడిన కష్టం చూసి ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదని దేశంలోనే మొదటిసారిగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. మహిళలకు కాలేజీల్లో 33శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. ఆర్టీసీ కండక్టర్లుగా నియమించాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు.
సభికులతో ముఖాముఖి..
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తొలి సదస్సుకు వచ్చిన వారితో ముఖ్యమంత్రి కాసేపు మాట్లాడారు. జనాభా నిర్వహణపై వాళ్ల అభిప్రాయాలు అడిగారు. ఈ క్రమంలో కొందరు తమ అభిప్రాయాలు చెప్పడంతో పాటు.. కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘నేను ఇటీవల కుప్పం వెళ్లినప్పుడు ఒక ఉమ్మడి కుటుంబాన్ని చూశా. మూడు తరాలవారు కలిసి ఉంటున్నారు. పనులే కాదు సంపద కూడా వారు పంచుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఎక్కవ మంది ఉంటే తక్కువ డబ్బు ఇస్తున్నాయి. ఇకపై జనాభా నియంత్రణ కాకుండా జనాభా నిర్వహణ విధానంతో ముందుకెళతాం. జనాభా పెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఎక్కువ మంది పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలు అందిస్తాం. పిల్లలు ఇంటికి సంపద. పిల్లలు పుడితే ఇంటికి కళ వచ్చిందని సంబరాలు చేసుకునేవాళ్లం. ఎన్టీఆర్ తాతమ్మ కల అనే సినిమా తీశారు. ఎందరు పిల్లలుంటే అంత సంతోషమని అందులో చూపించారు. పిల్లలనుకనే వరం భగవంతుడు మహిళలకు ఇచ్చాడు’ అని ముఖ్యమంత్రి అన్నారు. కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్రదేవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, మైనా మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సుహానీ జలోటా, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఎమ్. ప్రకాశమ్మ, ప్రొఫెసర్ సంజయ్‌కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.