- వర్క్‌షాప్ విజన్ సాకారానికి మంత్రిమండలి నిర్ణయం
- రూ.4వేల కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా..
- హడ్కో రుణాలకు ప్రభుత్వ గ్యారెంటీలకు ఓకే
- జల్ జీవన్‌కు రూ.10వేల కోట్ల నిధుల సమీకరణకు నిర్ణయం
- నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు అదనపు భూముల సేకరణ
- ఏపీ స్పేస్ పాలసీ 2025-30కి ఆమోదం
- వైసీపీ భారీగా పెంచిన గ్రీన్‌ట్యాక్స్ తగ్గింపునకు నిర్ణయం
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి భేటీ
- వివరాలు వెల్లడిరచిన మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి (చైతన్య రథం): ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, సరిహద్దుల విస్తరణ తదితర నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 27వ ఈ-కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వెల్లడిరచారు. అమరావతిలోని నేలపాడులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల కోసం నిర్మాణంలోవున్న నివాస సముదాయం పనులు వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. పనులు త్వరతగతిన పూర్తి చేసేందుకు రూ.524.70 కోట్ల నిధులను మంజూరు చేయడానికి క్యాబినెట్ ఓకే చెప్పిందన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడిరచి వివరాల ప్రకారం `సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులను సమీక్షించే ప్రతిపాదనను ఆమోదించింది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంత రీచ్‌లలో, ప్రకాశం బ్యారేజీ ముందుభాగంలో ఇసుక తొలగింపునకు రూ.286.20 కోట్ల పరిపాలనా ఆమోద ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జల వనరుల శాఖలోని సీఈల అధీనంలోని 71 పనులను కొనసాగించేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. నెల్లూరులోని రాళ్లపాడు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాల్వ అత్యవసర మరమ్మతులకు రూ.22.50 లక్షల పరిపాలనా ఆమోదానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మరమ్మతులతో ప్రాజెక్ట్ కింద సాగునీటి సౌకర్యాలు మెరుగై.. రైతుల పంటలకు నీటి సరఫరా నిరంతరాయంగా లభిస్తుంది.
ఏపీ విమానాశ్రయాభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్‌కు ప్రభుత్వ షార్ట్‌ఫాల్ గ్యారెంటీ అందించేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. ఏపీఏడీసీఎల్‌కు కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాల అభివృద్ధికి నిధుల కోసం, కుప్పం విమానాశ్రయానికి వైబిలిటీ గ్యాప్ ఫండిరగ్ సపోర్ట్ కోసం, ఏపీఏడీసీఎల్ అత్యవసర పెండిరగ్ బాధ్యతలు క్లియర్ చేయడానికి ఉద్దేశించిన రూ.1000 కోట్ల రుణాన్ని హడ్కో నుంచి సమకూర్చుకునేందుకు కేబినెట్ ఆమోదించింది. తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. గ్లోబల్ సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెట్‌వర్క్ కింద వ్యూహాత్మక సహకారంతో అమరావతిలో ‘‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ `సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్’’ స్థాపనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మూడేళ్లపాటు ఈ కేంద్ర నిర్వహణకు అంచనా బడ్జెట్‌గా రూ.36.00 కోట్లు నిర్ణయించారు. జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ కోసం అవసరమైన రూ.10,000 కోట్లను ప్రభుత్వరంగ షెడ్యూల్డ్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి రుణాల ద్వారా సమీకరణకు, స్వయంప్రతిపత్తి సంస్థగా ‘‘ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్’’ స్థాపనకు కేబినెట్ ఓకే చెప్పింది. వైకాపా ప్రభుత్వ హయాంలో గ్రీన్ ట్యాక్స్‌ను విపరీతంగా పెంచారు. దాన్ని రూ.3వేల వరకు తగ్గించేందుకు కేబినెట్ నిర్ణయించింది. కొత్త పన్ను రేట్లను రూ.1,500, రూ.3,000గా నిర్ధారించారు. ఈ నిర్ణయంతో 9,56,429 మందికి లబ్ధి చేకూరనుంది.
అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2025 జూన్ 30న జరిగిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్‌లో ప్రతిపాదించిన విజన్‌ను సాకారం చేయడంలో కీలకమైన మైలురాయిగా ఇది నిలువనుంది. ఆంధ్రను క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దేందుకు దేశ విదేశాలకు చెందిన క్వాంటమ్ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, మేధావులతో మొన్నటి సదస్సులో డిక్లరేషన్ ఇచ్చారు. ఈ సదస్సులో క్వాంటమ్ వ్యాలీ దిశానిర్దేశం చేస్తూ కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగినది. త్వరలో ప్రపంచ క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థలను, భౌతిక క్వాంటమ్ హార్డ్‌వేర్‌ను స్థాపించి, విశ్వవిద్యాలయాలు, స్టార్టప్‌లు మరియు పరిశోధన సంస్థల సహకారంతో నిర్వహించనున్నారు. రాష్ట్రంలో యువతకు పలు ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. అమరావతిలో 50 ఎకరాల్లో ఏర్పాటు కానున్న క్యాంటమ్ వ్యాలీకి రూ.4 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ అంచనా. జనవరి 1, 2026న అమరావతిలో క్యాంటమ్ సిస్టమ్‌ను దక్షిణాసియాలోనే మొదటిగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అమరావతిని ప్రపంచ క్వాంటమ్ హబ్‌గా ఆవిష్కరిస్తారు. అత్యాధునిక పరిశోధన, ప్రతిభ మరియు పెట్టుబడులను ఆకర్షిస్తారు. పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం, భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు, స్టార్టప్‌లు ప్రపంచస్థాయి క్వాంటమ్ మౌలిక సదుపాయాలను పొందగలుగుతాయి, స్వదేశీ సాంకేతికత, మేధో సంపత్తి అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
వేలాది విద్యార్థులు, పరిశోధకులు, నిపుణులు కొత్త అభ్యాస, ఉద్యోగావకాశాల ప్రయోజనం పొందుతారు. దీంతో పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల ప్రోత్సాహం సాధ్యమవుతుంది. క్వాంటమ్ సాంకేతికత ఫార్మాస్యూటికల్స్, పదార్థాలు, వ్యవసాయం, లాజిస్టిక్స్, సైబర్ సెక్యూరిటీవంటి రంగాలను విప్లవాత్మకంగా మార్చే సామర్థ్యం కలిగిఉంది. క్వాంటమ్ ఆధారిత ఆవిష్కరణలో ప్రపంచానికి ఏపీ మార్గదర్శకం కానుంది. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ సరిహద్దు మార్చడానికి, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు కేటాయించిన భూముల తరలింపునకు పరిహారంగా అదనంగా 790 ఎకరాల భూములను సేకరించడానికి, మొత్తం 2001.80 ఎకరాల భూములను బల్క్ డ్రగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు బదిలీ చేయడానికి, స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజుకు మినహాయింపు ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ఏపీ స్పేస్ పాలసీ 4.0కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రాన్ని భారతదేశంలో స్పేస్ రంగానికి ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యించింది. దీనిలో భాగంగా స్పేస్ టెక్నాలజీ, ఉపగ్రహ అభివృద్ధి, పరిశోధన, వాణిజ్య స్పేస్ కార్యకలాపాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. పాలసీ ప్రకారం, స్టార్టప్స్, ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు స్పేస్‌రంగంలో భాగస్వామ్యం కావడాన్ని ప్రోత్సహిస్తుంది. రాష్ట్రంలో స్పేస్ పార్కులు, లాంచ్‌ప్యాడ్లు, గ్రౌండ్ స్టేషన్ల ద్వారా అవసరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి కానున్నాయి. అలాగే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌తో పాటు దేశీయ, అంతర్జాతీయ ప్రైవేట్ స్పేస్ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పడతాయి. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, నూతన పరిశోధనలకు ప్రోత్సాహం లభిస్తుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు సబ్సిడీలు, సులభమైన వ్యాపార విధానాల కోసం చర్యలు తీసుకుంటారు. విద్యారంగంలో అంతరీక్ష పరిశోధనపై శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు.
నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ పెట్రోలియం రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్, ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్ మాన్యుఫాక్చరింగ్ ప్రాజెక్ట్, రామయ్యపట్నం పోర్ట్ రెండవ దశ.. సంబంధిత లాజిస్టిక్స్, పారిశ్రామిక టౌన్‌షిప్ ప్రాజెక్టుల కోసం భూమి సేకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి రెండేళ్ల కాలానికి కందుకూరు, కావలిలో స్పెషల్ కలెక్టర్ యూనిట్, 5 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యూనిట్ల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
క్యాపిటల్ సిటీ స్థాపనకై అవసరమైన భూములను సీఆర్‌డీఏ సేకరించడం వలన జీవనోపాధిని కోల్పోయిన కుటుంబాల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిరుపేద పింఛను ప్రయోజనాన్ని విస్తరించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కోకో రైతులకు సరసమైన ప్రోత్సాహక ధరలను అందించడానికి, ఆర్థిక ప్రగతికి మద్దతునిస్తూ.. రాష్ట్రంలో కోకో సాగును స్థిరీకరించేందుకు, నష్టాలకు అమ్ముకోకుండా రైతులను రక్షించడానికి ప్రభుత్వ మద్దతు ధరగా కిలోకు రూ.50/- చొప్పున రూ.14.884 కోట్లు మంజూరు చేయడానికి, ప్రస్తుత సీజన్‌లో నిర్దేశించిన అమ్ముడుపోని 2976.76 మెట్రిక్ టన్నుల కోకో గింజలను ప్రామాణిక ఆపరేటింగ్ విధానంతో సేకరించేందుకు మంత్రిమండలి ఆమోదం తెల్పింది. ప్రస్తుత సీజన్‌లో మామిడి రైతులకు లాభదాయక ధరలు అందించి, వారి ఆర్థిక ప్రగతికి మద్దతు నివ్వడానికి మంత్రిమండలి నిర్ణయించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి సాగు కొనసాగేలా చేయడానికి, ప్రస్తుత సీజన్‌లో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడి సేకరణక కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం నిర్ణీత ప్రమాణ నిర్వహణ విధానం ప్రకారం కిలోకు రూ.4 చొప్పున ప్రభుత్వ మద్దతు ధరగా మొత్తం రూ.260 కోట్ల మంజూరుకు మంత్రిమండలి ఆమోదించినట్టు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడిరచారు.