- పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా పాఠ్యాంశాల్లో సమూల మార్పులు
- నైపుణ్యాల పెంపుదలకు లీప్ పేరుతో ఏపీ మోడల్ స్కూలు ఎడ్యుకేషన్
- విలువలతో కూడిన విద్యకోసం చాగంటి కోటేశ్వరరావు ద్వారా పుస్తకాలు
- 2.3 కోట్లమంది భాగస్వాములైన ఈ మెగా పీటీఎం చరిత్రలోనే రికార్డు
- కొత్తచెరువు మెగా పీటీఎం కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్
కొత్తచెరువు (చైతన్యరథం): ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములై విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జిల్లాపరిషత్ హైస్కూలులో గురువారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రతి విద్యార్థి విజయం వెనక ఒక టీచర్ ఉంటారన్నారు. బ్లాక్ బోర్డ్ మీద చాక్‌పీస్‌తో అక్షరాలు రాసి ఛాంపియన్స్‌ని తయారు చేస్తారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో చదువుతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పుతారు. స్టూడెంట్ ర్యాంక్ కొడితే టీచర్‌కి ఆనందం, స్టూడెంట్‌కి ఉద్యోగం వస్తే టీచర్‌కి పండగ. అందుకే మనం ఎంత ఎత్తుకి ఎదిగిన మనకి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను, మనం చదువుకున్న స్కూల్‌ని జీవితాంతం మర్చిపోకూడదు. కొత్తచెరువు గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. గతంలో ఎన్టీఆర్‌ను బర్తరఫ్ చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి జరిపిన పోరాటంలో ఈ గ్రామానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు.
త్వరలోనే కొత్త టీచర్ల నియామకం
నేటి పోటీ ప్రపంచాన్ని తట్టుకుని నిలబడేలా కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తెస్తున్నాం. గతంలో కేవలం 1200 మాత్రమే వన్ క్లాస్ ` వన్ టీచర్ పాఠశాలలు ఉండగా, ఇప్పుడు తరగతికొక ఉపాధ్యాయుడు ఉండేలా 9,600 మోడల్ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటుచేశాం. బ్యాగ్ బరువు తగ్గించేందుకు సెమిస్టర్ వారీగా పుస్తకాలను రూపొందించాం. తల్లికి వందనం ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10 వేల కోట్లు జమచేశాం. సమగ్ర అభ్యాసం, విద్యా నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా చేసుకుని మేము ూజుAూ (లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) పేరుతో ఆంధ్రా మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెట్టాం. దేశంలోనే అతిపెద్ద నియామకాలలో ఒకటైన మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించాం, ఆగస్టు నెలాఖరులోగా 16,347 మందికి ఉపాధ్యాయులుగా నియామక ఉత్తర్వులు అందజేయబోతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
పేదరికాన్ని రూపుమాపే ఆయుధం విద్య
పేదరికం నుండి బయటకు తెచ్చే ఒకే ఒక్క ఆయుధం విద్య అని మేము బలంగా నమ్ముతున్నాం. జ్ఞానం అంతిమ లక్ష్యం స్వేచ్ఛ… సంస్కృతి అంతిమ లక్ష్యం పరిపూర్ణత… జ్ఞానం అంతిమ లక్ష్యం ప్రేమ… విద్య అంతిమ లక్ష్యం శీలం…ఇది చెప్పింది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. గురుపౌర్ణమి రోజు భగవాన్ శ్రీసత్యసాయి జిల్లాలో జరుగుతున్న ఈ మెగా పీటీఎం కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా జీవితంలో మరిచిపోలేని రోజు ఇది. ఏపీ విద్యారంగ చరిత్రలోనే సరికొత్త రికార్డు మన మెగా పీటీఎం 2.0. నేను చదువుకునే రోజుల్లో మా స్కూలులో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగేది. కానీ మా నాన్న బిజీగా ఉండటం వల్ల ఎప్పుడు హాజరయ్యేవారు కాదు. ఎప్పుడూ మా అమ్మే వచ్చేవారు. ఇప్పుడు దేవాంశ్ చదువుతున్న స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగితే వెళ్లడానికి నాకు కుదరడం లేదు, బ్రాహ్మణి వెళుతుంది. కానీ ఈ రోజు మా నాన్న, నేను ఇద్దరం లక్షల మంది పిల్లలు హాజరైన మెగా పీటీిఎం 2.0కి వచ్చామని మంత్రి లోకేష్ అన్నారు.
నాణ్యమైన విద్య అందిస్తున్నాం
మాతృ దేవో భవ… అమ్మ అంటే రెండు అక్షరాలు కాదు… కనిపించే దేవత. అమ్మ అంటే ధైర్యం. మనకి నడక నేర్పేది అమ్మ, మనకి బాధ్యత నేర్పేది అమ్మ. మన భవిష్యత్తు కోసం జీవితాన్ని త్యాగం చేసింది అమ్మ. ఇక్కడ ఉన్న తల్లులు అందరికీ వందనం. అందుకే కేవలం డబ్బులు ఇవ్వడం కాదు, తల్లుల గౌరవం నిలపాలని మన ముఖ్యమంత్రి చెప్పారు. అమ్మను గుండెల్లో పెట్టుకొని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే పుస్తకాలు, యూనిఫాంలు, షూలు నాణ్యమైనవి ఇచ్చాం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరిస్తే ఎటువంటి ఆర్థిక భారం ఉండదు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం, షూ, బెల్ట్, నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారు, నాణ్యమైన విద్య అందిస్తున్నాం. చిన్నారులను బాయిలర్ కోళ్లలా చూడకుండా.. వారి సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలు, పాటలు, యోగా అన్నీ నేర్పిస్తున్నాం. పది, ఇంటర్ ఫలితాల్లో మనవాళ్లు అద్భుతమైన ప్రతిభచాటారు, వారికి షైనింగ్ స్టార్స్ పేరిట అవార్డులు కూడా ఇచ్చామని మంత్రి లోకేష్ చెప్పారు.
రాజకీయాలకు అతీతంగా విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయాలు ఉండకూడదు. రాజకీయాలు గేటు బయటే, పాఠశాలలో అడుగుపెట్టడానికి లేదు. విద్యావ్యవస్థలో రాజకీయాలు వద్దు… ఫలితాలపై మాత్రమే దృష్టి పెట్టాలన్నది మా విధానం. విద్యార్ధులకు ఇచ్చిన పుస్తకాలు, వస్తువులపై గతంలో మాదిరి పార్టీ రంగులు, మా ఫొటోలు ఎక్కడా కనిపించవు. స్కూల్స్‌లో విద్యకు సంబంధించిన కార్యక్రమలు తప్ప ఏ ఇతర కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఒకే రోజు మెగా పీటీఎం నిర్వహించడం ఒక రికార్డు. 2.30 కోట్ల మంది పాల్గొనే అతి పెద్ద పేరెంట్ టీచర్ మీటింగ్‌గా రికార్డ్ సృష్టించబోతోంది. ఉపాధ్యాయులు, తల్లి-దండ్రులు, విద్యార్థులను అనుసంధానం చేయడమే ఈ మెగా పీటీఎం లక్ష్యం. మెరుగైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మన పిల్లల్లో అద్భుతమైన శక్తి ఉంది, దారి చూపిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు, పిల్లలను ప్రయోజకులుగా మార్చే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.
తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి
ఉపాధ్యాయులు ఎంత చెప్పినా, పిల్లలు ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. పిల్లలకి ఈ రోజు స్కూల్లో ఏం పాఠాలు చెప్పారు, హోంవర్క్ చేసారా, లేదా అనేది గమనించాలి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని తెలియజేసే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల నుండి అభిప్రాయాలు తీసుకుంటాం. ప్రధాని నరేంద్ర మోదీ.. ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని) పిలుపునిచ్చారు, నాకు అన్న సమానమైన పవనన్న కోటిమొక్కలు నాటాలని సవాల్ విసిరారు. ఆయన సవాలు నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే కోటిమొక్కలు నాటే బాధ్యత స్వీకరిస్తాం. గ్రీన్ పాస్‌పోర్టులో మూడేళ్లపాటు మొక్క పరిరక్షణ వివరాలు పొందుపరుస్తాం. బాధ్యత పెంచేందుకే పిల్లలకు గ్రీన్ పాస్‌పోర్టులు ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 45 లక్షల మంది విద్యార్థులతో మొక్కలు నాటిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
కష్టమైన మార్గాన్నే ఎంచుకోండి
జీవితంలో ఎల్లప్పుడూ కష్టతరమైన మార్గాన్నే ఎంచుకోండి. చిన్నచిన్న విషయాలకే విద్యార్థులు కుంగిపోకూడదు. ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంలో లక్ష్యసాధనకు ముందుకు సాగాలి. ఒక సబ్జెక్టులో ఫెయిలయ్యారని పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ ఫెయిల్యూర్ మనలో కసి, పట్టుదల పెంచాలి కానీ, అధైర్యపడకూడదు. నాకు విద్యాశాఖ కేటాయిస్తున్నారనే వార్త రాగానే చాలా మంది శ్రేయోభిలాషులు ఫోన్ చేసి, ఆ శాఖ తీసుకోవద్దని సలహా ఇచ్చారు. రోజూ తలనొప్పులతో కూడిన సంక్లిష్టమైన డిపార్ట్‌మెంట్ అని చెప్పారు. కానీ నేను ఎప్పుడూ సవాళ్లను ఇష్టపడతాను. నేను తొలిసారి పోటీకి ఎంచుకున్న మంగళగిరిలో టీడీపీ అంతకుముందు 37 సంవత్సరాలుగా గెలవలేదు. మొదటి ప్రయత్నంలో నేను ఓడిపోయాను, అయినప్పటికీ నేను అయిదేళ్లు ప్రజలకు సేవచేస్తూనే ఉన్నాను. ఫలితంగా గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను రాష్ట్రంలో మూడవ అత్యధిక మెజారిటీతో గెలిచాను. విద్యాశాఖ మంత్రిగా అద్భుతమైన సంస్కరణలు తెచ్చామని మంత్రి లోకేష్ వివరించారు.
విద్యాశాఖను సవాలుగా స్వీకరించా
ఇప్పుడు విద్యాశాఖ నా ముందున్న పెద్ద సవాల్. గత ఏడాది కాలంగా నేను ఈ శాఖలో నెలకొన్న ప్రాథమిక అంశాలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాను. నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలు కూడా సరిగాలేవు. విద్యా మంత్రిగా నా ప్రయాణం అక్కడ నుంచే ప్రారంభమైంది. కెేజీ నుంచి పీజీ వరకు విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం. గతంలో చిక్కీల నుండి గుడ్లు, యూనిఫాంలు, పాఠశాల గోడల వరకు ప్రతిదీ రాజకీయ పార్టీ రంగులు, నాయకుల ఫొటోలతో నిండి ఉండేది. ఇప్పుడు మేము భారతీయ విద్యకు నిజమైన చిహ్నం అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద అధిక-నాణ్యత గల విద్యా కిట్‌లను అందిస్తున్నాము. గతంలో చిక్కీలు, గుడ్లు, మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఉండేది కాదు. నేడు దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. గత పీటీఎం సందర్భంగా సన్నబియ్యంతో భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన సూచన మేరకు డొక్కా సీతమ్మ పేరుతో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నాం. విద్యార్థుల్లో పౌష్టికాహారం కోసం అన్నిప్రభుత్వ పాఠశాలలకు రాగి జావను ఉచితంగా అందిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి ట్రస్ట్‌కు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు.
మహిళలను గౌరవించేలా పాఠాలు
మొదటిసారిగా విలువ ఆధారిత విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావుని సలహాదారుగా నియమించాం. కాలం మారింది, విలువలు పడిపోయయి, విలువలతో కూడిన విద్య అందించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. చాగంటి కోటేశ్వరరావును కేబినెట్ ర్యాంకుతో సలహాదారుగా నియమించాం. అయితే తనకు ఎటువంటి సౌకర్యాలు అవసరం లేదని ఆయన చెప్పారు. అటువంటి వ్యక్తి నాయకత్వంలో ప్రత్యేకంగా పుస్తకాలు తయారుచేసి అందిస్తున్నాం. సమాజంలో ఇప్పటికీ మహిళలపై దాడులు జరుగుతున్నాయి. మార్పు ఇంటినుంచే మొదలు కావాలి. గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిలా ఏడవొద్దు వంటి పదాలు వాడకూడదు. 1,2 తరగతుల టెక్ట్స్ బుక్‌లో ఇంటిపనుల బొమ్మలను స్త్రీ, పురుషులకు చెరోసగం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. మార్పు మన మనసు నుంచి, మన ఇంటినుంచి రావాలి. పాఠశాలల్లో విలువలను బోధించడానికి చాగంటి ద్వారా ప్రత్యేక పుస్తకాలు, వీడియోలను అభివృద్ధి చేసి అందిస్తున్నాం. తరగతి గది స్థాయి నుండే మహిళల పట్ల గౌరవం పెంపొందించే పాఠ్యాంశాలను పొందుపర్చాం. పాఠశాలల్లో యోగా, క్రీడలను ప్రోత్సహించడానికి ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించాం. ప్రధాని మోదీ నేతృత్వంలో ఒకేసారి 3 లక్షల మందితో యోగాంధ్ర నిర్వహించి నిర్వహించి రికార్డు సృష్టించాం. టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్ తెచ్చి 67,732 మంది ఉపాధ్యాయుల బదిలీలు, 4,477 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించామని మంత్రి లోకేష్ తెలిపారు.
వీసీలుగా విద్యావేత్తల నియామకం
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేస్తే మేం తిరిగి అమలు చేస్తున్నాం. లక్ష మంది ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌తో పాటు నీట్, జేఈఈ శిక్షణను అందిస్తున్నాం. విశ్వవిద్యాలయాలకు వైస్‌ఛాన్సలర్లు (వీసీ)గా రాజకీయాలకు సంబంధంలేని ఐఐటి, ఎన్‌ఐటి వంటి ప్రఖ్యాత సంస్థల్లో పనిచేసిన విద్యావేత్తలను నియమిస్తున్నాం. ప్రాజెక్ట్ అక్షర ఆంధ్ర ద్వారా రాష్ట్రంలో నూరుశాతం అక్షరాస్యతకు కృషిచేస్తున్నాం. పొగాకు, మద్యం వల్ల జరిగే అనర్థాలపై ప్రతి సినిమా ప్రారంభానికి ముందు ఒక ప్రకటన వస్తుంది.. డ్రగ్స్ వల్ల అంతకంటే దారుణమైన పరిస్థితి వస్తుంది. చిత్తూరు జిల్లాలో ఓ తల్లి ఆవేదనను యువగళం సందర్భంగా ప్రత్యక్షంగా చూశాను. ఆ రోజే డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించాలని నిర్ణయించుకున్నా. విద్యార్థులు ఒక్క క్షణం మనసు అదుపు తప్పి పొరపాటు చేస్తే తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. విద్యార్థులు మాదకద్రవ్యాల వైపు మళ్లకుండా డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ చేతన్, ఎంపీ బీకే పార్థసారధి, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.