అమరావతి (చైతన్యరథం): నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా తప్పుబట్టారు. వైసీపీ నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషభావమా అని ప్రశ్నించారు. పెద్ద పెద్ద చదువులు చదివితే సరిపోదు. కనీస ఇంగితజ్ఞానం ఉండాలి. మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం నేరం, దారుణం. తల్లి, చెల్లిని తరిమేసిన అధినేత జగన్ రెడ్డిని ఆ పార్టీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. మహిళల జోలికి వచ్చినా, ఆడవారిపై అవాకులు చెవాకులు పేలినా ఊరుకునేందుకు ఇది జగన్ జంగిల్ రాజ్ కాదు.. మహిళలకు అండగా నిలిచే ప్రజాప్రభుత్వం అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.