బెంగుళూరు (చైతన్యరథం): శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రెస్టేజ్ గ్రూపు ప్రతినిధులకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. ప్రెస్టేజ్ గ్రూప్ చైర్మన్ ఇర్ఫాన్ రజాక్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జాయాద్ నోమాన్ లతో మంగళవారం మంత్రి లోకేష్ బెంగుళూరులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉందన్నారు. సుమారు రూ.65వేల కోట్ల రూపాయలతో అమరావతి రాజధాని పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థల రాకతో విశాఖపట్నం ఐటి హబ్‌గా మారుతోంది. రిలయన్స్, రెన్యూ వంటి సంస్థలు రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్, గ్రీన్ ఎనర్జీ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఏడాది కాలంలోనే రాష్ట్రంలో వివిధ సంస్థలు రూ.9.5లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన ఏపీ రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టండి. ప్లగ్ అండ్ ప్లే మోడల్ ప్రీ బిల్డ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకారం అందించాలని లోకేష్ విజ్ఞప్తిచేశారు.
దేశంలో ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కంపెనీల్లో ప్రెస్టేజ్ గ్రూప్ ఒకటి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, ముంబై, మంగళూరు, గోవా, ఢల్లీి-ఎన్‌సీఆర్ సహా 13 ప్రధాన భారతీయ నగరాల్లో ప్రెస్టీజ్ గ్రూప్ బలమైన ఉనికిని కలిగి ఉంది. ఈ కంపెనీ సుమారు 180 మిలియన్ చదరపు అడుగుల అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని కవర్ చేస్తూ 350 కి పైగా ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రస్తుతం 56 ప్రాజెక్టులు భవిష్యత్ అభివృద్ధికి పైప్ లైన్‌లో ఉన్నాయి. భారతదేశంలో CRISIL DA 1+రేటింగ్‌ను అందుకున్న ఏకైక రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ ప్రెస్టీజ్. మంత్రి లోకేష్ వినతిపై ప్రెస్టేజ్ చైర్మన్ ఇర్ఫాన్ రజాక్ స్పందిస్తూ… ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.