- భూములు పొందిన సంస్థలకు అనుమతుల్లో జాప్యం ఉండదు
- రాజధానిలో భూ కేటాయింపులు జరిపిన సంస్థల ప్రతినిధులతో సీపం భేటీ
- అదనంగా భూమి కావాలన్న వివిధ సంస్థల ప్రతినిధులు
- రాజధాని అమరావతిలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
అమరావతి, (చైతన్య రథం): రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశించిన సమయానికే తమ నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సీఆర్డీఏ పరిధిలో భూములు కేటాయించిన వివిధ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ప్రయివేట్ కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల్లో నిర్మాణ ప్రగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. భూములు కేటాయించిన సంస్థల ప్రతినిధులతో కలిసి ఈ తరహా సమావేశం తొలిసారి నిర్వహించారు. భూములు తీసుకున్న 61 సంస్థలకు చెందిన ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. భూములు కేటాయించిన సంస్థల ప్రతినిధులు కొందరు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. భూములు తీసుకున్న ఆయా సంస్థల ప్రతినిధులు ఎప్పటిలోగా తమ నిర్మాణాలను పూర్తి చేస్తారనే అంశంతో పాటు… నిర్మాణాలకు సంబంధించి వారి వద్ద ఉన్న ప్రణాళికలపైనా ముఖ్యమంత్రి ఆరా తీశారు.
అమరావతి అభివృద్ధిలో మీరూ భాగస్వాములే
‘‘భూములు తీసుకున్న ఆయా సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘అమరావతి నగరాన్ని ప్రత్యేక ప్రాంతంగా.. ప్రణాళికాబద్దంగా తీర్చిదిద్దుతున్నాం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతి నిర్మాణం జరుగుతోంది. ఇది రోటీన్ సిటీలా ఉండదు. హై ఎండ్ టెక్నాలజీ అందుబాటులో ఉండేలా నగరాన్ని అభివృద్ధి చేయనున్నాం. ఏఐ క్వాంటమ్ వ్యాలీ వంటి వాటితో అమరావతి భవిష్యత్ నగరంగా మారుతుంది. దీనికోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అమరావతి నగర నిర్మాణంలో భూములు తీసుకున్న సంస్థలు కూడా భాగస్వాములే. ప్రపంచ ప్రసిద్ది చెందిన సంస్థలు.. కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయి. అమరావతి నగర నిర్మాణంలో భూములు తీసుకున్న మీకు ఇప్పుడు చాలా అంశాలు కలిసి వస్తాయి. గ్రీన్, బ్లూ సిటీగా అమరావతిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. జీరో ఎమిషన్ సిటీగా అమరావతి ఉండబోతోంది. ఎలక్ట్రిక్ వాహానాలకు రాజధానిలో పెద్ద పీట వేస్తాం’’ అని చంద్రబాబు ప్రకటించారు.
చెప్పడమే కాదు.. నిర్మాణాలు పూర్తి చేసి చూపాలి
భూములు తీసుకున్న ప్రాంతాల్లో ఆయా సంస్థలు ఎప్పటినుంచి తమ పనులు ప్రారంభించనున్నాయో అనే అంశంపై ఆయా కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడారు. ఎప్పటిలోగా నిర్మాణాలు ప్రారంభిస్తారు.. ఎప్పటిలోగా భవనాలు పూర్తి అవుతాయనే అంశంపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా రాజధానిలో భూములు తీసుకున్న సంస్థల ప్రతినిధులకు చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు. ‘‘భూములు తీసుకున్న వారు… చెప్పిన విధంగా నిర్మాణాలు మొదలు పెట్టాలి. చెప్పిన విధంగా నిర్మాణాలు పూర్తి చేయాలి. ఇప్పుడు భూములు తీసుకున్న వారు తమ పూర్తిస్థాయి నిర్మాణాలను రెండున్నరేళ్లు.. మూడేళ్లల్లో పూర్తి చేయాలి. నిర్దేశించిన లక్ష్యానికి మించి ఒక్క రోజు కూడా జాప్యం కాకూడదు. నిర్మాణాల విషయంలో మీకు ఎలాంటి అనుమతులు కావాలన్నా.. జాప్యం లేకుండా ప్రభుత్వం వైపునుంచి పూర్తి సహకారం అందిస్తాం. సింగిల్ విండో సిస్టం ద్వారా పర్మిషన్లు ఇస్తాం. అధికారుల వైపు నుంచి ఏమైనా ఆలస్యం జరిగితే నేరుగా నన్ను వచ్చి కలవొచ్చు. మీరు కట్టబోయే నిర్మాణాలు కూడా రోటీన్ పద్ధతిలో కాకుండా.. ప్రపంచస్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండేలా మాస్టర్ ప్లాన్లు రూపొందించుకోవాలని కోరుతున్నా. మీరు చేపట్టబోయే నిర్మాణాలతో అమరావతి శోభ మరింతగా పెరగాలి. ప్రతి నిర్మాణమూ కార్పొరేట్ లుక్ ఉండాలని చంద్రబాబు సూచించారు. భూములు తీసుకున్న సంస్థలు అమరావతి నుంచి కార్యకలాపాలు మొదలు పెట్టడంతోపాటు.. ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలి. ప్రస్తుతం భూములు తీసుకున్న వారిలో ఆర్బీఐ, హడ్కోవంటి సంస్థలతో పాటు.. వివిధ బ్యాంకులు కూడా ఉన్నాయి. ఫిన్ టెక్ వంటి సంస్థలతోపాటు.. వివిధ ఆర్థిక కార్యాకలాపాలు నిర్వహించే సంస్థలకు కేంద్రంగా అమరావతిని ఏవిధంగా తీర్చిదిద్దాలనే అంశంపై మీ సలహాలు అవసరం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
భూములిచ్చాం..ఉపాధి కల్పించండి.
ఈ సమావేశం సందర్భంగా వివిధ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రికి తమకు అదనంగా భూములను కేటాయించాలని కోరారు. ప్రధానంగా హోటళ్లకు చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం ప్రస్తుతం కేటాయించిన భూములతోపాటు.. అదనంగా రెండునుంచి రెండున్నర ఎకరాల భూములను కేటాయించాలని అడిగారు. అలాగే పార్కింగ్ కోసమూ అదనపు భూములు కావాలని మరికొన్ని సంస్థలు కోరాయి. ఏపీ, తెలంగాణల్లోని తమ సిబ్బందికి శిక్షణనిచ్చే ట్రైనింగ్ సెంటర్ కోసం తమకు అదనంగా స్థలం కేటాయించాలని పోస్టల్ శాఖ ప్రతినిధులు సీఎంను కోరారు. అలాగే ఆయా సంస్థల కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత.. ఎంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామనే అంశాన్ని పలువురు ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎప్పటిలోగా తాము నిర్మాణాలు చేపడతామన్న అంశాన్ని ఆయా సంస్థల ప్రతినిధులు సీఎంకు తెలియచేశారు. తాము చేపట్టబోయే క్యాంపస్ నిర్మాణం ఎలా ఉండబోతోందనే అంశాన్ని బిట్స్ పిలానీ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు. దీనిపై ప్రత్యేకంగా మరో సమావేశం నిర్వహిద్దామని ముఖ్యమంత్రి చెప్పారు.
72 సంస్థలు.. 948 ఎకరాలు
రాజధానిలో ఇప్పటి వరకు మొత్తంగా 72 సంస్థలకు 947 ఎకరాలను సీఆర్డీఏ కేటాయించింది. వీటిలో ఇప్పటికే 61 సంస్థలకు 886.21 ఎకరాలు కేటాయిస్తే.. మరో 11 సంస్థలకు 61.50 ఎకరాలను కేటాయించారు. స్థలాలు పొందిన వారిలో స్కూళ్లు, బ్యాంకులు, యూనివర్సిటీలు, హోటళ్లు, హెల్త్ కేర్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ధార్మిక సంస్థలు, ఐటీ, టెక్ పార్కులకు చెందిన యాజమాన్యాలున్నాయి. నెలలో నిర్మాణాలు ప్రారంభిస్తామని మూడు సంస్థలు చెప్పాయి. రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని 15 సంస్థలు, 5 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని 13 సంస్థలు, 6 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని 17 సంస్థలు చెప్పాయి. ఇప్పటికే 10 సంస్థలు తమ నిర్మాణ పనులను ప్రారంభించాయి. మూడు సంస్థలు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. సమావేశంలో మున్సిపల్ మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ, సీఆర్డీఏలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.