- హోంగార్డులు, విదేశీ వైద్య విద్యా గ్రాడ్యుయేట్ల సమస్యలపై సీఎంకు వినతి పత్రాలు
- సీఎం చంద్రబాబుకు వేర్వేరుగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
అమరావతి (చైతన్య రథం): హోంగార్డుల వేతనాల పెంపు, విదేశీ వైద్య విద్య పట్టభద్రుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేర్వేరుగా వినతి పత్రాలు అందించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన.. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. వైద్యవిద్యలో విదేశాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఏపీకి చెందిన విద్యార్ధులకు ఏపీ వైద్య మండలి శాశ్వత రిజిస్ట్రేషన్ నిరాకరిస్తోందని.. ఈ నిబంధనను సవరించేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు. వైద్య నిపుణుల కొరత ఉన్న ప్రస్తుత తరుణంలో ఏపీఎంసీ నిబంధనల్ని మార్చుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, యూపీలాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే నిబంధనల్ని సవరించారని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. మరోవైపు రాష్ట్రంలో హోంగార్డుల వేతనాల పెంపు, పోలీసు సెలక్షన్లలో రాయితీలు కల్పించే అంశంపైనా నిర్ణయం తీసుకోవాలని రామకృష్ణ కోరారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల స్థానికత కలిగిన హోంగార్డులను సొంత రాష్ట్రాలకు బదిలీ చేసేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 400మంది ఏపీ స్థానికత కలిగిన హోంగార్డులు తెలంగాణలో పనిచేస్తున్నారని.. వారిని రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వేతనం పెంపుతోపాటు పోలీసు సెలక్షన్లలో నిబంధనలను సడలించి హోంగార్డులకు అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.