- సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రతో పాఠశాలల్లో కొత్త కళ
- మూడంచెల తనిఖీతో నాణ్యమైన కిట్లు
- ఆకర్షణీయమైన కిట్లతో పిల్లల్లో అందం, ఆనందం
- యూనిఫాం, బెల్టు, షూ, సాక్సులు, పుస్తకాలు, డిక్షనరీల పంపిణీ పూర్తి
- విద్యా సంవత్సరం ఆరంభానికే విద్యార్థులకు అందజేత
- పారదర్శకమైన టెండర్లతో రూ.63.80 కోట్లు మిగులు
- పిల్లలు, టీచర్లకు స్ఫూర్తి నింపేలా సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు
అమరావతి (చైతన్యరథం): ఏపీ విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కార్పొరేటు పాఠశాలల కంటే ప్రభుత్వ విద్య ఎందులోనూ తీసిపోదు.. ఆ మాట కొస్తే పై స్థాయిలోనే ఉంటుందని నిరూపించేందుకు మంత్రి చేపట్టిన చర్యలతో ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త కళ సంతరించుకున్నాయి. నాణ్యమైన, ఆకర్షణీయమైన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లతో విద్యార్థులు కార్పొరేటు స్కూళ్ల విద్యార్థుల కంటే నీటుగా కనిపిస్తున్నారు.
సవాలక్ష సవాళ్లతో కూడిన విద్యాశాఖను ఛాలెంజ్‌గా తీసుకున్న నారా లోకేష్ విద్యా శాఖలో ఒక్కో సమస్యా పరిష్కరించుకుంటూ వస్తున్నారు..సంస్కరణలు అమలు చేస్తూ సత్ఫలితాలు రాబడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు తెరిచేసరికి విద్యార్థులకు ఇవ్వాల్సిన పుస్తకాలు, యూనిఫాం, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్టు వంటివి అందివ్వాలనేది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లక్ష్యం. ఈ పథకానికి పేరు కూడా స్ఫూర్తిగా ఉండాలని గురువులకే గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థి మిత్ర అని నామకరణం చేశారు. నాణ్యమైన, ఆకర్షణీయమైన, ఏ విధమైన రాజకీయ భావజాలాలకు సంబంధంలేని రంగులతో ఇవన్నీ రూపొందించారు. ప్రణాళిక ప్రకారం స్కూళ్లకు చేర్చారు. విద్యా సంవత్సరం ఆరంభం తొలి రోజు నుంచే పంపిణీ ఆరంభించి పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసిన ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్‌తో విద్యార్థులు చిరునవ్వుతో పాఠశాలలకు హాజరవుతున్నారు.
కిట్‌లో ఏముంటాయి?
2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా ఒకటి నుండి 10 వ తరగతి చదివే ప్రతి విద్యార్థికి ఇచ్చే ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ స్టూడెంట్ కిట్‌లో మూడు జతల యూనిఫాం క్లాత్, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, ఆక్స్ ఫర్డ్, పిక్టోరియల్ డిక్షనరీ ఉంటాయి. రాజకీయ రంగులు, పార్టీ చిహ్నాలు, బొమ్మలు లేకుండా అందరూ మెచ్చేలా కిట్ ఉంది.
ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్మీడియేట్ చదివే విద్యార్థులకు నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు అందజేయడంతో ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.
ఒక్కో కిట్ విలువఏ రూ. 2279
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 2025-26 విద్యాసంవత్సరానికి గానూ 35,94,774 మంది విద్యార్థులకు కిట్లు అందించేందుకు ప్రభుత్వం రూ.953.71 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో కేంద్రం రూ.175.03 కోట్లు, రాష్ట్రం రూ.778. 68 కోట్లు భరిస్తాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు నోటు పుస్తకాలు, బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, మూడు జతల యూనిఫామ్స్ అందిస్తారు. ఒక్కో విద్యార్థికి అన్ని వస్తువులతో కూడిన కిట్ ఇవ్వడానికి రూ. 2279 వ్యయం కానున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఇవి కాకుండా యూనిఫాం కుట్టుకూలి కింద 1-8 తరగతులకు రూ.120. 9, 10 తరగతుల వారికి రూ.240 చెల్లించనున్నారు.
ఆకర్షణీయమైన యూనిఫాం క్లాత్
సరికొత్త రంగులతో యూనిఫాం క్లాత్ ఆలీవ్ గ్రీన్ ఫ్యాంట్ / గౌను, లైట్ ఎల్లో, గ్రీన్ చారల చొక్కా క్లాత్ అందించారు. గతంలో ప్రింటెడ్ షర్టింగ్ యూనిఫాం క్లాత్ అందజేసేవారు. ఈ ఏడాది క్లాత్ నాణ్యత పెంచుతూ డైడ్ ఓవెన్ క్లాత్ అందజేశారు. దీనివల్ల క్లాత్ రెండు వైపులా ఒకేలా కనిపిస్తూ విద్యార్థులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
మైనర్ మీడియంలోనూ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 2025-26 విద్యా సంవత్సరానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్ పథకం కింద ఆరో తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్-ఇంగ్లీష్-తెలుగు ఆక్స్‌ఫర్డ్డ్‌్ డిక్షనరీలతో పాటు మైనర్ మీడియం డిక్షనరీలను కూడా పంపిణీ చేయనుంది. గతంలో ఆరో తరగతి చదువుతున్న మైనర్ మీడియం విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ ` ఇంగ్లీష్ ` తెలుగు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు మాత్రమే అందజేసేవారు. ఈ ఏడాది మైనర్ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు, అదే విధంగా ప్రథమ భాష మైనర్ మీడియం ఉన్న ఆరో తరగతి విద్యార్థులకు (ఇంగ్లీష్-ఇంగ్లీష్-తమిళ్, ఇంగ్లీష్-ఇంగ్లీష్-ఒడియా, ఇంగ్లీష్-ఇంగ్లీష్-ఉర్దూ) ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను పంపిణీ చేయనున్నారు.
పిక్టోరియల్ డిక్షనరీ
ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులకు పదాలు అర్థమయ్యేలా దానికి సంబంధించిన బొమ్మలతో ఆకర్షణీయంగా పిక్టోరియల్ డిక్షనరీలు అందజేయనున్నారు.
పారదర్శక టెండర్లు.. ప్రభుత్వానికి రూ.63.80 కోట్లు ఆదా
గత ప్రభుత్వంలో విద్యాకానుక కింద సరఫరా చేసిన సామగ్రితో పోల్చితే ప్రస్తుత టెండర్లలో ప్రభుత్వానికి మొత్తంగా రూ.63.80 కోట్లు ఆదా అయ్యాయి. ఈ విద్యా సంవత్సరం రూ. 676.15కోట్లకు (ఈసీవీ) టెండర్లు పిలవగా సరఫరాదారులు రూ. 612.35 కోట్లకు కోట్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఏపీ ఇ ` ప్రొక్యూర్మెంట్ ద్వారా పారదర్శకంగా టెండర్ల నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి రూ.63.80కోట్లు ఆదా అయ్యాయి.
క్యూసీఐ (క్వాలిటీ కౌన్సిల్‌ఆఫ్ ఇండియా) ద్వారా మూడంచెల నాణ్యతా తనిఖీలు
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్ లోని ప్రతి వస్తువు నాణ్యత విషయంలో ఎక్కడా ప్రభుత్వం రాజీపడటం లేదు. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌లో ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’తో తొలిసారిగా నాణ్యత పరిశీలన కోసం ఒప్పందం చేసుకుని, ప్రతి వస్తువు మూడంచెల తనిఖీ చేసిన తర్వాతే విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు.
మూడంచెల తనిఖీ విధానం ఇదీ…
ఫేజ్ 1 : సరఫదారు కొనుగోలు చేసిన ముడి సరుకు తనిఖీ
ఫేజ్ 2: ఉత్పత్తి దశ (ప్రొడక్షన్)లో వస్తువులు తనిఖీ
ఫేజ్ 3: పూర్తి స్థాయిలో తయారై, రవాణాకు సిద్ధంగా ఉన్న వస్తువుల తనిఖీ.
క్వాలిటీ వాల్ ఏర్పాటు
విద్యార్థులకు సరఫరా చేసిన కిట్‌లో వస్తువులు ‘క్వాలిటీ వాల్’లో ప్రదర్శించారు. దీని ద్వారా నాణ్యతా ప్రమాణాలను లబ్ధిదారులు (పిల్లలు..వారి తల్లిదండ్రులు)కు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి మండల స్టాక్ పాయింటులో ‘క్వాలిటీ వాల్’ ఏర్పాటు చేశారు. కిట్లలో వస్తువులను ప్రదర్శించారు.
స్కూల్స్ నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో విద్యార్థి మిత్ర కిట్ల గురించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. బ్యాగులు చాలా నాణ్యంగా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు.
పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్‌పై సంబంధిత సబ్జెక్ట్ రిలేటెడ్ బొమ్మలు ఉండడం వల్ల విద్యార్థులకు చదువుపై మరింత ఆసక్తి కలుగుతుందని టీచర్లు అంటున్నారు.
విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ఆలోచనల మేరకు అవినీతిని అరికట్టి, నాణ్యమైన, ఆకర్షణీయమైన, సర్వేపల్లి రాధాక్రిష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను అందజేయడం పాఠశాలల్లో పండగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు సంతోషంగా ఉన్నారు