- తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ ఉద్ఘాటన
- మంత్రి నారాయణ కృషితో దేశంలోనే ఉత్తమంగా నెల్లూరు వీఆర్ హైస్కూలు
- రాజకీయ జోక్యంతో విద్యను భ్రష్టుపట్టించిన గతపాలకులు
- కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగంలో సమూల మార్పులు
- నెల్లూరు వీఆర్ హైస్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్
నెల్లూరు (చైతన్యరథం): రాబోయే రోజుల్లో ఏపీ విద్యావ్యవస్థను దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. నెల్లూరులో సుమారు 15కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన వీఆర్ స్కూలును మంత్రి లోకేష్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… నెల్లూరు వీఆర్ హైస్కూల్ దేశంలోనే నంబర్ వన్ మోడల్ స్కూల్‌గా అవతరిస్తుందన్నారు. ఈ పాఠశాలను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి మంత్రి నారాయణ రూపకల్పన చేశారు. నెల్లూరు నగరంలోని వీఆర్ (వెంకటగిరి రాజా) ఉన్నత పాఠశాల 150 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. 1875లో స్థాపించబడిన ఈ పాఠశాల నెల్లూరుకు గర్వకారణం. మంత్రి నారాయణ నాయకత్వంలో వీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల తిరిగి ప్రారంభించడం సంతోషకరమైన విషయం. ఇక్కడ చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. స్వర్గీయ బెజవాడ గోపాల్ రెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి వారు ఈ పాఠశాల పూర్వవిద్యార్థులే. వీఆర్ స్కూలులోని సౌకర్యాలు చూసి నాకు ఆనందం కలుగుతోంది. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో కూడా ఇదేవిధంగా స్కూలును అభివృద్ధి చేస్తున్నాం. రాబోయే అయిదేళ్లలో వీఆర్ హైస్కూలు తరహాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 నియోజకవర్గాల్లో లీప్ మోడల్ స్కూళ్లను అభివృద్ధిచేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.
నారాయణ చొరవతో ప్రపంచస్థాయి సౌకర్యాలు
మంత్రి నారాయణ వీఆర్ పాఠశాలలో 5 నుండి 10వ తరగతి వరకు చదివారు. చదువు పూర్తయ్యాక అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో ఆధునీకరించిన వీఆర్ పాఠశాలలో ఈ ఏడాది 1,050 మంది నిరుపేద విద్యార్థులు డిజిటల్ విద్యను పొందుతారు. మాట నేర్పేది అమ్మ, నడక నేర్పేది అమ్మ, బాధ్యత నేర్పేది అమ్మ. మనకోసం జీవితాన్ని త్యాగం చేసేది అమ్మ. భూమి కంటే ఎక్కువ భారం మోసేది అమ్మ. అటువంటి తల్లుల రుణం తీర్చుకునేందుకే తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టాం. అ, ఆలు నేర్పేది ఉపాధ్యాయులు. పిల్లల జీవితాల్లో సూపర్ హీరో టీచర్. పిల్లల భవిష్యత్తుకి పునాది వేసేది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది, ఆయన పాఠాలు చెప్పిన అందరికీ ఫస్ట్ ర్యాంకు రావాలని, వారు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. అందుకే మనకి ప్రతిరోజు కనిపించే దేవుడు ఉపాధ్యాయుడని మంత్రి లోకేష్ అన్నారు.
పీి4 ద్వారా పేద కుటుంబాల దత్తత!
సంక్షేమంతో పాటు సమాజంలో పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీ 4 విధానాన్ని తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా వీఆర్ స్కూల్‌లోని అనేకమంది పేద విద్యార్థుల కుటుంబాలను దాతలు దత్తత తీసుకున్నారు. నారాయణ కుమార్తె శరణి స్వయంగా 20 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఇక్కడి విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థల ద్వారా 4 సెట్ల యూనిఫాంలు, సైకిళ్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. అడ్మిషన్లు ప్రారంభించిన మొదటి రోజే వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి. అధిక డిమాండ్ కారణంగా పాఠశాల అడ్మిషన్లు లేవనే బోర్డును ఏర్పాటు చేసింది. ఇది సానుకూల మార్పుకు స్పష్టమైన సంకేతం. వచ్చే ఏడాది మరో వెయ్యిమంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తారు, భవిష్యత్తులో ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉచిత విద్యను విస్తరిస్తారు. మంత్రి నారాయణ విద్యార్థులకు ఉచిత రవాణా, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. పేద చిన్నారులు పెంచలయ్య, వెంకటేశ్వర్లు ఇక్కడ అడ్మిషన్ పొందినందుకు నేను వ్యక్తిగతంగా చాలా సంతోషిస్తున్నాను. వారి ఉన్నత విద్యకు నేను పూర్తి బాధ్యత వహించి, అన్నివిధాలా అండగా నిలుస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి
ఎన్నికల సమయంలో వీఆర్ హైస్కూల్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరిస్తానని, స్థానిక విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ప్రజల ఆశీస్సులతో ఆయన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పాఠశాలను తిరిగి తెరిపించి, ఆధునీకరించడం ద్వారా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. రాత్రి 10గంటల సమయంలో కూడా నాకు ఫోన్ చేసి వెంటపడి ఈ స్కూలు అనుమతులు సాధించుకున్నారు. నెల్లూరు వీఆర్ స్కూలులో నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ సీఎస్‌ఆర్ నిధులతో రూ.15 కోట్ల విలువైన పనులను చేపట్టడానికి ముందుకు వచ్చింది. ఈ పనులను మంత్రి నారాయణ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ… వేగంగా పూర్తయ్యేలా చూసుకున్నారు. నారాయణ రెండవ కుమార్తె, నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ శరణి ఆరునెలలపాటు అహర్నిశలు కష్టపడి అభివృద్ధి చేశారు. పిల్లల్లో విద్యపట్ల ఆసక్తిని రేకెత్తించేలా ఒక శక్తివంతమైన అభ్యాస వాతావరణాన్ని వీఆర్ స్కూలులో సృష్టించారు. డిజిటల్ తరగతి గదులను ఏర్పాటుచేశారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా పర్యావరణ పరిరక్షణకు హైడ్రోపోనిక్ వ్యవస్థల వంటి సాంకేతికతలను ప్రవేశపెట్టారు. నృత్యం, సంగీతం, డ్రాయింగ్ రూములు, ఆట స్థలం, రోబోటిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారని మంత్రి లోకేష్ వివరించారు.
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు
దురదృష్టవశాత్తు చారిత్రాత్మక వీఆర్ పాఠశాలను గత ప్రభుత్వ హయాంలో మూసివేశారు. మంత్రి నారాయణ తాను చదివిన పాఠశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తిరిగి ప్రారంభించారు. నిరుపేద పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు వీలుగా పాఠశాలలో మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం ఒక సంవత్సరంలోనే విద్యారంగంలో గణనీయమైన మార్పులు తెచ్చాం. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడుతున్నాయి. వీఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో ఆధునిక తరగతి గదులు, రక్షిత తాగునీటి సౌకర్యం, స్మార్ట్ బోర్డులు, తదితర సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఉపాధ్యాయ కొరత లేకుండా తగిన సంఖ్యలో టీచర్లను నియమించారు. 2014-19 నడుమ మంత్రి నారాయణ నెల్లూరులో రూ.5,250 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేశారు. 2024 ఎన్నికల సమయంలో ఆయన 84,000 ఇళ్లను స్వయంగా సందర్శించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
విద్యాశాఖను సవాలుగా స్వీకరించా
నాకు సవాళ్లు అంటే ఇష్టం. ఎవరూ కోరుకోని విద్యాశాఖను సవాలుగానే స్వీకరించా. గత 37 సంవత్సరాలుగా గెలవని మంగళగిరిని ఎంచుకుని మొదటి ప్రయత్నంలో ఓడిపోయా, ఆ తర్వాత పట్టుదలతో పనిచేసి గత ఏడాది ఎన్నికల్లో రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద మెజారిటీతో గెలుపొందాను. విద్యాశాఖను ప్రక్షాళన చేయడమే నా తదుపరి లక్ష్యం. నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ శాఖలో విద్యార్థులకు సంబంధించిన సరైన డేటా కూడా లేదు. గుడ్లు, చిక్కీలు, యూనిఫాంలు… ఇలా ప్రతి అంశంలో రాజకీయ జోక్యంతో భ్రష్టు పట్టించారు. మేం అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద విద్యా కిట్‌లు అందించాం, డొక్కా సీతమ్మ పేరు మీద సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా కేజీ టు పీజీ పాఠ్యాంశాల్లో మార్పులు తెచ్చాం. చిన్నారుల సమగ్ర విద్యాభ్యాసం కోసం లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మోడల్ ను ప్రవేశపెట్టాం. వన్ క్లాస్ ` వన్ టీచర్ విధానంతో 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటుచేశాం. తల్లికి వందనం పథకం కింద 67.27 లక్షలమంది విద్యార్థుల తల్లుల ఎకౌంట్లకు రూ.10 వేల కోట్లు జమచేశామని మంత్రి లోకేష్ తెలిపారు.
విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యత
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించి, ఇటీవలే విజయవంతంగా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించాం, త్వరలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టబోతున్నాం. టీచర్ ట్రాన్ప్‌ఫర్ యాక్ట్ ద్వారా అత్యంత పారదర్శకంగా 67,732 మంది ఉపాధ్యాయుల బదిలీలు, 4,477 మందికి పదోన్నతులు కల్పించాం. రాష్ట్రవ్యాప్తంగా మెగా పీటీఎం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తూ విద్యాప్రమాణాల మెరుగుదలకు తల్లిదండ్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నాం. ఈ నెల 10వ తేదీన మెగా పీటీిఎం నిర్వహిస్తున్నాం. విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావుచే నైతిక విద్యపై పుస్తకాలు, వీడియోలు తయారుచేసి విద్యార్థులకు అందిస్తున్నాం. తరగతి గది నుంచే మహిళలను గౌరవించే పాఠ్యాంశాల బోధనతోపాటు, వారికి పాఠశాలల్లో సురక్షితమైన వాతావరణం కల్పిస్తున్నాం. పాఠ్యాంశాల్లో ఇంటిపనులు స్త్రీ, పురుషులకు సమానంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే గా ప్రకటించి, ఆ రోజున యోగా, క్రీడలు వంటి విద్యేతర కార్యక్రమాలపై దృష్టిసారించేలా చర్యల చేపట్టాం. ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలను అమలు చేస్తున్నాం. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సుమారు లక్ష మంది విద్యార్థులకు నీట్/జెఇఇ పరీక్షలకు మెటీరియల్‌తో పాటు శిక్షణ అందిస్తున్నాం. రాష్ట్రంలో రాబోయే నాలుగేళ్లలో నూరుశాతం అక్షరాస్యతను సాధించడానికి ప్రాజెక్టు అక్షర ఆంధ్రను ప్రారంభించాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేపట్టాం. విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం ఉపాధ్యాయులు, అధికారుల సమష్టి కృషితో, పట్టుదలతో పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, ఎన్‌ఎండి ఫరూక్, పొంగూరు నారాయణ, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లాకు చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు.