- అందుకే ఆరోగ్యం రొట్టె స్వీకరించా
- రొట్టెల పండుగ కోసం కూటమి ప్రభుత్వం రూ.10 కోట్లు ఖర్చుపెట్టింది
- తెలుగువారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి
- నెల్లూరులో బారా షహీద్ దర్గా రొట్టెల పండుగలో పాల్గొన్న మంత్రి
నెల్లూరు (చైతన్యరథం): రొట్టెల పండుగ కోసం కూటమి ప్రభుత్వం రూ.10 కోట్లు ఖర్చుపెట్టిందని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మతసామరస్యానికి ప్రతీకైన నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో మంత్రి నారా లోకేష్ సోమవారం పాల్గొన్నారు. ముందుగా దర్గా ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు కూటమి ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బారా షహీద్ దర్గాను మంత్రి లోకేష్ సందర్శించారు. ముస్లిం మత పెద్దలు నారా లోకేష్‌కు గలఫ్‌ను అలంకరించారు. దర్గాలో ఉన్న మహ్మద్ ప్రవక్త అనుచరులు 12 మంది అమరవీరుల చిహ్నాలపై చాదర్‌లను కప్పి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్వర్ణాల చెరువులో ఆరోగ్యం రొట్టెను మంత్రి లోకేష్ స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులమతాలకు అతీతంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చక్కటి పాలన అందిస్తున్నామన్నారు. 2014`19 మధ్య రొట్టెల పండుగ అద్భుతంగా జరిగేది. ఆనాడు నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు నిధులు కేటాయించారు. అనేక పనులు చేపట్టారు. ఈ సారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. రూ.10 కోట్లు ఈ కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం ఖర్చుపెట్టిందని మంత్రి లోకేష్ తెలిపారు.
చంద్రబాబు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షం
టీడీపీ, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒక్కటే.. తెలుగువారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఈ రోజు రొట్టెల పండుగలో ఏ రొట్టె తీసుకోవాలనేది బాగా చర్చించాం. చంద్రబాబు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నేను బలంగా నమ్ముతాను. దేవుడు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో మేమంతా ప్రార్థిస్తూ ఉంటాం. అందుకే ఆరోగ్యం రొట్టెను తీసుకున్నాను. ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ కూటమి ప్రభుత్వానికి ఉండాలి. ఏ బాధ్యతతో అయితే ప్రజలు గెలిపించారో దానిని నెరవేరుస్తాం. అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం. ఎక్కువ మంది మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రివర్గంలో 17 మంది కొత్తవారు ఉన్నారు. కసితో పనిచేయాలనే లక్ష్యంతో ఉన్నాం. సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. నాలుగేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చేపడుతుందని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.