- ఆర్థిక ఇబ్బందులున్నా… హామీలన్నీ అమలు చేస్తున్నాం
- సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి
అద్దంకి (చైతన్యరథం): ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో మంత్రి గొట్టిపాటి శుక్రవారం నాడు ఇంటింటికీ టీడీపీ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, మేనిఫేస్టోలోని హామీలు అమలు చేస్తున్న తీరును ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కామేపల్లి గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్డును మంత్రి ప్రారంభించారు. అదే గ్రామంలో రూ.43 లక్షలతో నిర్మించనున్న ఇంటింటికీ మంచి నీటి పథకానికి మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎస్‌ఆర్ నిధులతో సమకూర్చిన మూడు చక్రాల స్కూటీలను ఏడుగురు దివ్యాంగులకు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో చివరగా గ్రీవెన్స్ నిర్వహించిన మంత్రి గొట్టిపాటి స్థానికుల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి అర్జీల రూపంలో వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే దానిపై అధికారులు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు.
గత ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణితో….
గత వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారి పోయిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. పెట్టుబడిదారులను బెదిరించి భయాందోళనలకు గురి చేయడంతో వారంతా రాష్ట్రం వదిలి వెళ్లిపోయారన్నారు. అభివృద్ధి ఊసే లేకుండా… అన్ని రంగాల్లోనూ అవినీతికి తెరలేపిన వైసీపీ నేతలు రాష్ట్ర సంపదను దోచుకున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరలా గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని మంత్రి గొట్టిపాటి వివరించారు. ఈ నేపధ్యంలోనే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నీ అమలు చేస్తున్నట్లు వెల్లడిరచారు. మెగా డీఎస్సీ నిర్వహించామని, తల్లికి వందనం, ఉచిత గ్యాస్, పింఛన్ల పెంపును ఇప్పటికే అమలు చేసామని చెప్పారు. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని కూడా అమలు చేయనున్నామని మంత్రి గొట్టిపాటి ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలతో పాటు అధికారులు పాల్గొన్నారు.