అమరావతి (చైతన్యరథం): అధికారులు అంటే లెక్కలేనితనం వైసీపీ నేతల్లో ఇంకా కనిపిస్తోందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి వెంకటమణి ప్రసాద్ (పులివర్తి నాని) ధ్వజమెత్తారు. అధికారుల పట్ల దురుసు ప్రవర్తన వారి పెత్తందారీ పోకడలకు అద్దం పడుతోందన్నారు. అధికారం పోయినా వైసీపీ నేతల్లో పెత్తందారీ పోకడలు పోలేదు అనడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దురుసు ప్రవర్తనే నిదర్శనం. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారుల విచారణకు సహకరించాల్సింది పోయి… మీ అంతు తేలుస్తా, సిట్ కార్యాలయం ముందు ఇంటిని అద్దెకు తీసుకొని ఒక్కొక్కరి తాట తీస్తానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరించిన తీరు ఆయన అహంకార ధోరణికి నిదర్శనం. విచారణ చేస్తున్న అధికారులపై ఈ రకమైన దురుసు ప్రవర్తన వైసీపీ నాయకుల సైకో మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. అధికారం పోయినా ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అహంకారం దగ్గలేదు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా చెవిరెడ్డిలాంటి మూర్ఖుల్లో ఇంకా మార్పు రాలేదు. ఇంకా వైసీపీ ప్రభుత్వమే ఉందన్న భ్రమలో ఉన్నాడు. జైలు జీవితం తప్పదని తెలిసే విజయవాడ జైలులో చెవిరెడ్డి రంకెలు వేస్తూ చిందులు తొక్కుతున్నాడు. తప్పు చేశాడు కాబట్టే చెవిరెడ్డిలో ఈ విధమైన భయం, ఆందోళనలు కనిపిస్తున్నాయి. మద్యం కుంభకోణంలో కోట్ల రూపాయలు దోచుకొని, ఎన్నికల్లో తప్పుడు పద్దతిలో గెలిచేందుకు వాటిని తరలించాడు. సిట్ అధికారులు 200 ప్రశ్నలు వేసినా ఒక్కదానికీ చెవిరెడ్డి నుంచి సమాధానం రాలేదంటే… ఐదేళ్ల పాటు మద్యం కుంభకోణంలో ఏ స్థాయిలో సొమ్ములు పక్కదారి పట్టించారో అర్థమవుతుంది. మద్యం కుంభకోణంలో ఉన్న ఏ ఒక్కరినీ ఈ ప్రభుత్వం విడిచిపెట్టదని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలని పులివర్తి నాని హెచ్చరించారు.