గొలుగొండ (చైతన్యరథం): విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని అధికారికంగా నిర్వహించే అవకాశం రావటం తన అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సయిజ్ శాఖల మంత్రి, అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి ఘాట్ వద్ద స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహించడం ద్వారా తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. స్వతంత్ర సమరయోధుల గుండెల్లో ధైర్యాన్ని నింపిన తొలిదశ పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. అల్లూరి గురించి సినిమాల్లో, పుస్తకాల్లో చదవడమే తప్ప.. నేరుగా ఆయన ఘాట్ వద్ద నివాళి అర్పించే అవకాశం రావటం గర్వంగా ఉంది. అల్లూరి సీతారామరాజు రియల్ హీరో అని మనస్పూర్తిగా నమ్ముతున్నా. అతి చిన్న వయసులోనే బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసి వణికించిన మన్యం వీరుడు అల్లూరి. ప్రజల స్వేచ్ఛ కోసం తన ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలిన అసలైన నాయకుడు అల్లూరి. ఈ నేలపైనే విప్లవ స్పూర్తి, విప్లవ జ్యోతి ఉందనేందుకు అయ్యన్న పాత్రుడు మరో ఉదాహరణ.
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ వేధింపులపై వెనకడుగు వేయకుండా పోరాడిన వ్యక్తి అయ్యన్న. ప్రజా ప్రభుత్వ సాధనలో అయ్యన్న పాత్రుడి పోరాటం అత్యంత కీలకం. గంజాయి వల్ల యువత జీవితాలు నాశనం కావడంతో పాటుగా.. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గంజాయి అమ్మకాలు చేసినా, వినియోగించినా సంక్షేమ పథకాలను నిలిపేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో అభివృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సమాజ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం. పిల్లలు చదువుకుంటే మాత్రమే సమాజంలో మార్పులు సాధ్యం. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలని కోరుతున్నా. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక ప్రాంత అభివృద్ధిలో తన వంతు ఆర్థిక సాయం అందించి బాగా స్వామిగా మారుతానని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.