- ప్రయోగాత్మకంగా బనగానపల్లె నియోజకవర్గంలో శ్రీకారం
- ప్రారంభించిన అర్ అండ్ బీ మంత్రి జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె (చైతన్యరథం): విజనరీ లీడర్ చంద్రబాబు నిరంతరం కొత్త టెక్నాలజీని అన్వేషిస్తుంటారని ఆర్ అండ్ బీ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఇతర దేశాల్లో రోడ్లకు సంబంధించి వస్తున్న అధునాతన టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలనేది ఆయన ఆలోచన.. ఆయన అందిస్తున్న ప్రోత్సాహంతో కొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలంలో ప్రయోగాత్మకంగా తొలిసారి డానిష్ ఆస్ఫాల్డ్ రీ-ఇన్ఫోర్సింగ్ టెక్నాలజీ వినియోగంతో రోడ్ల నిర్మాణాన్ని మంత్రి జనార్దన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ క్రమంలో భాగంగా రోడ్ల నిర్మాణంలో తొలుత తారుతో, ఆయా మెటీరియల్‌ను మిక్స్ చేసే ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. డెన్మార్క్ ప్రతినిధులు, ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి తారు, అరమిడ్, పాలియోలెఫిన్ అనే ఫైబర్లు కలిపి బిటమిన్ తయారు చేసే మిక్సింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో 20 టన్నుల సామర్థ్యం గల లారీలు మన రోడ్లపై తిరిగేవి.. అయితే నేడు సిమెంట్, గ్రానెట్ ఫ్యాక్టరీల రాకతో దాదాపు 80 టన్నులకు పైగా బరువుతో లారీలు తిరుగుతున్నాయన్నారు. దీంతో కేవలం 3, 4 ఏళ్లలోనే రహదారులు దెబ్బతింటున్నాయి. వీటికి తగినట్లుగానే మన రోడ్ల సామర్థ్యం కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఈ రహదారి నిర్మాణాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాం.
డెన్మార్క్‌కు చెందిన ఈ ఆధునాతన టెక్నాలజీని.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హీత్రో ఎయిర్‌పోర్ట్ (లండన్), దుబాయ్ మెట్రో, ఏ`7 మోటార్‌వే (జర్మనీ) లాంటి ప్రాజెక్టుల్లో ఇప్పటికే విజయవంతంగా ఉపయోగించారు. సాధారణంగా ఒక్క కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ. 24 లక్షలు ఖర్చవుతోంది. ఈ టెక్నాలజీ ద్వారా అది రూ. 28 లక్షలకు పెరుగుతుంది. అయితే రోడ్ల జీవిత కాలం మాత్రం 3 సంవత్సరాల నుంచి దాదాపు 8 ` 10 సంవత్సరాలకు పెరగనుంది. ఆయా ప్రాంతాల్లో భూమిలో బలాన్ని బట్టి కూడా ఈ రోడ్ల జీవిత కాల పరిమితి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. రాష్ట్రంలో అధునాతమైన టెక్నాలజీలను అందిపుచ్చుకుని, ప్రజలకు మెరుగైక రవాణా సౌకర్యాల కల్పించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిక. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఫలితాలపై ముఖ్యమంత్రితో చర్చించి, వారి సూచనలు, సలహాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ఈ ట్రయిల్ రన్ విజయవంతం అయితే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లడం, లేదంటే ఇంతకంటే తక్కువ వ్యయంతో, ఎక్కువ నాణ్యతతో కూడిన టెక్నాలజీలను అందిపుచ్చుకోవటంపై నిర్ణయం తీసుకుంటాం. నిత్య విద్యార్ధిగా మన ముఖ్యమంత్రి పనిచేస్తుంటారు.. ఆయన సూచనల మేరకు గుజరాత్, అసోం వంటి రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి రోడ్లను పరిశీలించాం. అసోం వంటి ప్రాంతాల్లో నిరంతరం వర్షాలు పడుతుంటాయి. అయినప్పటికీ అధునాతన టెక్నాలజీలతో కూడిన రహదారులు వేయడం వల్ల అక్కడ మన్నిక సాధ్యమవుతోంది. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి రాని అవకాశం సంజామల మండలానికి రావడం నిజంగా ఈ ప్రాంత వాసుల అదృష్టం. ఈ రోడ్లకు సంబంధించి నాణ్యతా ప్రమాణాల విషయంలో సాంకేతికంగా కూడా పరిశీలించి అంతిమంగా సీఎం చంద్రబాబు సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి జనార్దన్‌రెడ్డి చెప్పారు.
“