- ముసుగు రౌడీలు రాజకీయం చేస్తున్నారు..
- ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- సామాజిక బాధ్యతగా గతంలో జన్మభూమి.. ఇప్పుడు పీ`4
- బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు
- మామిడి రైతుల సమస్యలు పరిష్కరిస్తా..
- రైతులకు కూటమి ప్రభుత్వంపై నమ్మకముంది
- మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం
కుప్పం (చైతన్య రథం): చిల్లిగవ్వ ఇవ్వనివారు పీ-4 విధానాన్ని విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పేదరికం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తుంటే.. దాన్ని అడ్డుకునేందుకు కొందరు రకరకాల విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు వివిధ అంశాలపై స్పందించారు. ‘‘పేదల్ని ఆదుకునేందుకు మార్గదర్శకుల్ని అన్వేషిస్తుంటే ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ వనరుల్ని దోచుకోవడం తప్ప చిల్లిగవ్వ ఖర్చు పెట్టనివాళ్లు రాజకీయాలు చేస్తున్నారు. సామాజిక బాధ్యత కింద సమాజానికి ఏదైనా చేస్తూనే ఉండాలి. గతంలో జన్మభూమి పిలుపునిచ్చాను. ఇప్పుడు పీ`4 పేరిట కార్యక్రమం చేపట్టాం. గతంలో నేను చేసిన సాయంతో బాగా చదువుకుని అమెరికాకు వెళ్లి డబ్బులు సంపాదించిన వ్యక్తులు ఇప్పడు మార్గదర్శకులుగా మారుతున్నారు. కుప్పం నియోజకవర్గంలోని తిమ్మరాజుపల్లి గ్రామ పేదలను పీ`4 ద్వారా ఆదుకుంటామని ఓ కుటుంబం ముందుకొచ్చింది. ఈ స్ఫూర్తినే నేను కోరుకుంటున్నాను. ప్రజలు సహకరిస్తుంటే.. కొందరికి నచ్చడం లేదు. కానీ ప్రభుత్వం తనపని తాను చేసుకునిపోతూనే ఉంటుంది. ఆర్ధిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే మా లక్ష్యం’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు
‘‘బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టంలేదు. కొందరు దీనిపై అనవసరపు రాద్దాంతం చేస్తున్నారు. తెలంగాణలో చాలా ప్రాజెక్టులకు నేనే శంకుస్థాపనలు చేశా. గోదావరిలో నీళ్లు ఎగువన ఉన్న రాష్ట్రాలు, దిగువన ఉన్న రాష్ట్రాలూ వినియోగించుకోవచ్చు. రెండు వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి. ఆ నీటిని వాడుకుంటే రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం. గోదావరిపై తెలంగాణ కట్టిన ప్రాజెక్టులను నేను వ్యతిరేకించలేదు. రాబోయే రోజుల్లో అతిపెద్ద సవాలు ఆరోగ్యమే. పేదలకు ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా అత్యాధునిక సౌకర్యాలనూ పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కుప్పంలో టాటా భాగస్వామ్యంతో డీజీ నెర్వ్ సెంటర్ ప్రారంభించాం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాం. నా నియోజకవర్గం కుప్పంలో ఇంటింటికీ ఏడాదిలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించా. తెలుగుదేశం పార్టీకి ఓ యంత్రాంగం ఉంది. మాది కేడర్ బేస్డ్ పార్టీ. నెల రోజులపాటు జరిగే కార్యక్రమంలో లీడర్లు.. కేడర్ అంతా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తారు. అలాగే లోటుపాట్లు ఏమైనా ఉన్నా.. తెలుసుకుంటారు’’ అని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు.
మామిడి రైతును ఆదుకుంటాం
‘‘కూటమి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోంది. సమర్ధవంతంగా సమస్యల్ని పరిష్కరిస్తాం. తల్లికి వందనం పథకాన్ని ఏడుగురు పిల్లలున్నా ఇచ్చాం. ఒక్క కుటుంబానికి రూ.1.05 లక్షలు లబ్ది కలిగింది. పేదల సేవలో ద్వారా 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. ఏడాదికి 34 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ముందుగా చెప్పినట్టే ఏప్రిల్ నెలనుంచే పెంచిన పెన్షన్లు ఇచ్చాం. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేమని నానా యాగీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో భూరికార్డులు తారుమారు చేసేశారు. ప్రజలు చేస్తున్న 10 ఫిర్యాదుల్లో 8 భూవివాదాలవే ఉంటున్నాయి. బ్లాక్ చెయిన్ ద్వారా ఈ సమస్యను సరిచేస్తున్నాం. గతంలో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ల్యాండ్ రికార్డులు నిర్వహించిన రాష్ట్రం. మంచి రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం నాశనం చేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకుంటోంది. గతంలో ఎప్పుడైనా మామిడికి అదనంగా రూ.4 ఇచ్చి కొనుగోలు చేశారా..? ఈసారి దిగుబడి బాగా వచ్చింది, అంతర్జాతీయ మార్కెట్లో సమస్య ఏర్పడిరది. పండిరచిన పంటకు విలువ జోడిరపు, ఫుడ్ ప్రాసెసింగ్ చేయాల్సి ఉంది. మామిడి రైతులకున్న సమస్యలను పరిష్కరిస్తాం. పల్ప్ కంపెనీలు సిండికేట్ అయ్యాయనీ అంటున్నారు. దీన్ని సెట్ చేస్తాం. శవరాజకీయాలు చేసిన వారు ఇప్పుడు మామిడి రైతులపై ప్రేమ కురిపిస్తున్నారు. మామిడి రైతుల సమస్యలను మేం పరిష్కరిస్తాం.. మాపై రైతులకు నమ్మకం ఉంది. గతంలో డ్రిప్ ఇరిగేషనుకు నిధులు ఇచ్చారా..? ఏనాడైనా హర్చీకల్చర్ సాగును పట్టించుకున్నారా..? ఇప్పుడు ఏదేదో మాట్లాడితే రైతులు నమ్మరు. అన్నదాత సుఖీభవకు మేం రూ.20 వేలు ప్రకటించాం. గత ప్రభుత్వం రూ.7 వేలే ఇచ్చింది’’ అని చంద్రబాబు వివరించారు.
ఫేక్ ప్రచారం.. ఫేక్ రాజకీయం..
‘‘ఫేక్ ప్రచారాలతో రాజకీయాలను దిగజారుస్తున్నారు. కరుడుగట్టిన నేరస్తులు ఆర్ధిక ఉగ్రవాదుల్లా అవినీతి చేశారు. వాళ్ల కార్యకర్త వాళ్ల కారు కిందపడితే మానవత్వంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలి. సామాజిక స్పృహతో వ్యవహరించి ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. కనీసం నిలబడకుండా, అతని మనుషులు ప్రమాదానికి గురైన వ్యక్తిని కుక్కపిల్లలా పక్కన పడేసి పోయారు. మృతుడి భార్యను పిలిపించి బెదిరించి రాజకీయ ప్రకటనలు చేయిస్తున్నారు. రాజకీయ ముసుగు వేసుకున్న రౌడీల్లా అరాచకాలు చేస్తున్నారు. ఇలా అరాచకాలు, అక్రమాలు చేస్తూ రాష్ట్రానికి పెనుసవాలుగా మారుతున్నారు. ఇలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారిని దూరంగా పెట్టాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.