- వారి అండతోనే వైసీపీ రాక్షస పాలనపై పోరాడాం
- కష్టకాలంలో కలిసిమెలిసి పనిచేసినప్పుడు అనుబంధం ఏర్పడుతుంది
- వైసీపీ హయాంలో వేధింపులకు గురైన టీడీపీ కార్యకర్త షేక్ అల్లాబక్షు
- ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మాట్లాడిన మంత్రి లోకేష్
- ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకుని అన్నివిధాల అండగా ఉంటానని భరోసా
ఉండవల్లి (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీకి కమిట్‌మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు కనుకనే గత వైసీపీ రాక్షస పాలనలో ధైర్యంగా పోరాడగలిగామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కార్యకర్తే అధినేత అనే మాటను శిరసావహిస్తూ..పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను నేరుగా కలుసుకుని వారికి అండగా నిలుస్తున్నారు మంత్రి లోకేష్. ఎంత బిజీగా ఉన్నా కార్యకర్తల సంక్షేమం గురించి ఎప్పుడూ మర్చిపోరు. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చిందని అనుకున్నా వెంటనే స్పందిస్తారు. తాజాగా అల్లాభక్షు అనే కార్యకర్త కుటుంబానికి కష్టం వచ్చిందని తెలియగానే.. పిలిపించుకుని మాట్లాడారు. స్వయంగా వారి కష్టం ఏమిటో తెలుసుకుని అన్నీ తాను చూసుకుంటానని ధైర్యం చెప్పారు.
వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకుల వేధింపులకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం ఆర్మేనిపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త షేక్ అల్లాబక్షును కుటుంబంతో సహా మంగళవారం ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి లోకేష్ మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా అల్లాబక్షు కుటుంబం పార్టీకి సేవలందిస్తోంది. ప్రస్తుతం మండల మైనార్టీ సెల్ అధ్యక్షునిగా అల్లాబక్షు పనిచేస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉత్తమ కార్యకర్తగా నిలిచారు. వైసీపీ దాష్టీకాలకు ఎదురొడ్డి 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టారు. దీంతో ఆయన 3.50 ఎకరాల్లోని జామాయిల్ తోటను వైసీపీ గూండాలు నరికివేయడంతో పాటు సదరు భూమిని కక్షతో నిషిద్ధ భూముల జాబితా 22-ఏలో చేర్చారు. ఆయన కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటి గోడను కూల్చి భయబ్రాంతులకు గురిచేశారు.
అన్నివిధాల అండగా ఉంటాం
అల్లాబక్షు కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు కుమార్తెల చదువు గురించి ఆరా తీశారు. పార్టీ కోసం తాను చేపట్టిన కార్యక్రమాలను అల్లాబక్షు వివరించారు. కుమార్తెల చదువుకు సాయం అందించాలని, తన భూమిని నిషిద్ధజాబితా నుంచి తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మీ వంటి కమిట్‌మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు కనుకనే ధైర్యంగా పోరాడగలుగుతున్నామన్నారు. కష్టకాలంలో కలిసిమెలిసి పనిచేసినప్పుడు అనుబంధం ఏర్పడుతుంది. మీ నుంచి మేము, మా నుంచి మీరు నేర్చుకుని పార్టీని పటిష్టం చేయవచ్చు. నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం త్యాగం చేశారు. మీకు అండగా నిలబడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇద్దరు బిడ్డలను చదివించే బాధ్యత తీసుకుంటానని, సొంత పిల్లల్లా చూసుకుంటానని హామీ ఇచ్చారు. భూమి విషయంలో అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మైనార్టీ సోదరులకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. పిల్లలు బాగా చదువుకోవాలని, విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకుంటామని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్పారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా మాట్లాడి తమకు అండగా నిలవడం పట్ల నోటమాట రావడం లేదని, ఆనందంగా ఉందని అల్లాబక్షు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.