- 2026 జనవరి 1నాటికే అమరావతిలో వ్యాలీ పార్క్ ఏర్పాటు
- భవిష్యత్‌లో దేశానికే వెన్నుముక కానుందన్న ఆకాంక్షలు
- వరల్డ్ క్యాంటమ్ టెక్నాలజీకి ‘అమరావతి’ లైట్‌హౌస్ కానుందా?
- ఉత్సాహంగా అమరావతి క్యాంటం వ్యాలీ నేషనల్ వర్క్ షాప్
- హాజరైన ఐటీ దిగ్గజ కంపెనీల యజమానులు, ప్రతినిధులు
- 9 జాతీయ మిషన్లలో క్యాంటమ్ విప్లవం ఒకటన్న జితేంద్ర సింగ్
- వర్చ్యువల్‌గా హాజరైన కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి
- ఏపీ యువతకు ఉజ్వల భవిష్యత్ అంటూ ప్రశంసలు
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్యాంటమ్ వ్యాలీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున కృషి చేస్తోంది. అందులో భాగంగా సోమవారం నోవాటెల్ హోటల్‌లో అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాపు `2025ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దేశ విదేశాలనుంచి ఐటీ నిపుణులు, ఐటీ సంస్థల అధినేతలు హాజరైన వర్క్‌షాప్‌లో సీపం చంద్రబాబు, విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్‌లు ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలు, ఆకాంక్షలను వివరించారు. అమరావతి క్యాంటమ్ వ్యాలీ వర్కు షాప్‌లో ‘ఎన్విసైజింగ్ అమరావతి యాజ్ ఏ గ్లోబల్ క్యాపిటల్ ఫర్ క్యాంటమ్ టెక్నాలజీస్’ అనే అంశంపై మేధోమధన సదస్సు జరిగింది. సదస్సుకు హాజరైన దిగ్గజ ఐటి కంపెనీ ప్రతినిధుల సమక్షంలో.. దేశంలోనే తొలిసారిగా ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో క్వాంటం వ్యాలీ పార్కును అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడిరచారు. ఈ వర్క్ షాప్‌కు టీసీఎస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ వి రాజన్న, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్‌కుమార్, ఎల్ అండ్ టీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ హెడ్ మనీష్ వర్మ, భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు సుచిత్రా కె ఎల్లా, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జెబివి రెడ్డి, రెడ్డీ ల్యాబ్స్ ఫణి మిత్ర, అస్ట్రా జెన్గా ఎండీ ప్రవీణ్ రావు, ఐబీఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్, కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్‌లతోపాటు అమెజాన్, హెచ్‌సీఎల్, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాస్, తిరుపతి, బ్యాంక్ ఆఫ్ అమెరికావంటి సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హజరయ్యారు.
వివిధ బహుళ జాతి ఐటీ కంపెనీలు, విద్యార్ధులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా సాంకేతికతలో వస్తున్న అత్యాధునిక విషయాలను అడిగి తెలుసుకోవడంతోపాటు స్టాల్స్‌లో నూతన ఆవిష్కరణలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. క్యాంటమ్ వ్యాలీ వర్క్ షాపులో ఫార్మా, వాణిజ్య రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులున్నారు. దేశంలోని తొలిసారిగా ఐబీఎమ్, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో అమరావతిలో క్యాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు జనవరి నుంచి ప్రారంభిస్తామని ఐటీ సెక్రటరీ వెల్లడిరచారు.
వీడియో కాన్ఫరెన్సు ద్వారా అమరావతి క్యాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్ షాప్‌నకు కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి జితేంద్ర సింగ్ హాజరై మాట్లాడుతూ 9 జాతీయ మిషన్లలో క్యాంటమ్ టెక్నాలజీ విప్లవం ఒకటని, అందుకే నేషనల్ క్యాంటమ్ మిషన్ ఏర్పాటు అయ్యిందన్నారు. దేశంలోని నాలుగు ప్రాంతాల్లో క్యాంటమ్ పరిశోధనా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. 17 రాష్ట్రాల్లో 152 సంస్థలు ఈ క్యాంటమ్ సాంకేతికతపై పనిచేస్తున్నాయన్నారు. ఏఐసీసీటీఈ ద్వారా బీటెక్ క్యాంటమ్ టెక్నాలజీలో అందిస్తున్నామన్నారు. నేషనల్ క్యాంటమ్ మిషన్ డిజిటల్, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను పర్యవేక్షిస్తోందన్నారు. టెక్నాలజీ ఇండియాను సాధించటంలో క్యాంటమ్ వ్యాలీ కూడా భాగస్వామి అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీతో రాష్ట్రంలో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ దేశానికే వెన్నుముఖగా నిలుస్తుందన్నారు.
ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ అమరావతి డ్రాప్ట్ డిక్లరేషన్‌ను ఈ సందర్బంగా ప్రకటించారు. అమరావతి క్యాంటమ్ డిక్లరేషన్ పీఠికను చదివి వినిపించారు. జనవరి 1, 2026న అమరావతిలో క్యాంటమ్ సిష్టంను సౌత్ ఏషియాలోనే మొదటిగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐబీఎం క్యాంటమ్ సిస్టం ఏర్పాటు చేసేనాటికే 100 అల్గారిధమ్‌లను సిద్ధం చేస్తామన్నారు. వచ్చేఏడాది అమరావతి క్యాంటమ్ అకాడమీని ప్రారంభించి 500మందికి ట్రైనింగ్ కూడా అందిస్తామన్నారు. రూ.1,000 కోట్ల స్టార్టప్ క్యాంటమ్ కంపెనీలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్యాంటమ్ టెక్నాలజీ ద్వారా చిప్‌లు, హర్డవేర్‌తో పాటు అన్ని రంగాలను కవర్ చేయాలని భావిస్తున్నామన్నారు. ప్రపంచంలోని ఈ రంగంలోని నిపుణులు అందరూ ఇక్కడికి రావాలి. వారితో కలిసి పనిచేయడానికి మేము సిధ్దంగా ఉన్నామన్నారు. 2035నాటికి కేవలం ఇండియా క్యాంటమ్ టెక్నాలజీకే కాదు వరల్డ్ క్యాంటమ్ టెక్నాలజీకి లైట్‌హౌస్ అవుతుందన్నారు. అమరావతిలో టెక్‌వ్యాలీ పార్కులోనే లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఇతర రాష్ట్రాల సేవలు వినియోగించుకునే వెసులుబాటు ఉందన్నారు. అమరావతిలో 50 ఎకరాల్లో ఏర్పాటుకానున్న క్యాంటమ్ వ్యాలీకి రూ.4 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ అంచనా అని కాటమనేని భాస్కర్ తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల ప్రముఖులు క్యాంటమ్ వ్యాలీ సదస్సులో మాట్లాడారు..