- 2026 జనవరి 1నాటికి అమరావతిలో వ్యాలీ పార్క్ ఏర్పాటు
- క్వాంటం వ్యాలీకి అనుబంధంగా ఒక ఎకోసిస్టం తీసుకొస్తాం
- డీప్ టెక్నాలజీ, ఏఐ, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విస్తృత అవకాశాలు
- బహుళజాతి సంస్థలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి
- సాంకేతికతను పాలన, ప్రజా జీవనంలో సమ్మిళితం చేయటమే లక్ష్యం
- అమరావతి క్యాంటం వ్యాలీ నేషనల్ వర్క్ షాప్‌లో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
- నేషనల్ వర్క్ షాప్‌లో క్వాంటం కంప్యూటర్ ప్రోటోటైప్ ప్రదర్శన
విజయవాడ (చైతన్య రథం): అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 2026 జనవరి 1నాటికి క్వాంటం వ్యాలీ ప్రారంభమవుతుందని వెల్లడిరచారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో క్వాంటం వ్యాలీ పార్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. అమరావతి క్యాంటం వ్యాలీపై ఏర్పాటు చేసిన నేషనల్ వర్క్ షాప్‌నకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విజయవాడలో నిర్వహించిన నేషనల్ వర్క్ షాప్‌నకు ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణరంగాలకు చెందిన ప్రముఖ బహుళ జాతి సంస్థల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు వివరించారు. క్వాంటం కంప్యూటింగ్‌ను భారత్ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వర్క్ షాప్‌లో సీఎం మాట్లాడుతూ ‘‘ నేను తొలిసారి సీఎం అయినప్పుడు ఐటీ పరిశ్రమ విస్తరిస్తోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను కలిసి ఐటీ విస్తరణపై చర్చించా. పీపీపీ విధానంలో హైటెక్ సిటీ కట్టాలని ఎల్ అండ్ టీని కోరాను. తర్వాత ఆ సంస్థ బెంగుళూరు, గురుగాంవ్‌లోనూ ఐటీ భవనాలు కట్టింది. భవిష్యత్‌లో భారత్ అతిపెద్ద ఐటీ హబ్‌గా మారుతుందని అప్పుడే చెప్పాను. ఉమ్మడి ఏపీలో ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశాను. రాజధాని అమరావతికి అనేక ఐటీ సంస్థలు వస్తున్నాయి. అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తాం. అమరావతికి రావాలని స్టార్టప్ కంపెనీలను ఆహ్వానిస్తున్నాం’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
2026 జనవరికి అమరావతిలో క్వాంటం వ్యాలీ
నేషనల్ క్వాంటం మిషన్‌ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి వెల్లడిరచారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీలాంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ‘‘క్వాంటం వ్యాలీ పార్క్‌కు అనుబంధంగా పూర్తిస్థాయి ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసి, వందకు పైగా యూజ్ కేసెస్‌ను పరీక్షిస్తాం. ఓ మిషన్ తీసుకువచ్చి అమరావతికి క్వాంటం కంప్యూటర్ వచ్చేసింది అనుకోవటం లేదు. వివిధ ఉపకరణాల నుంచి రియల్-టైమ్ డేటా విశ్లేషణకు, వ్యవసాయంలో మట్టి తేమవంటి అంశాలను పర్యవేక్షించడానికి క్వాంటం కంప్యూటింగ్ అవసరం. క్వాంటం టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ, ఏఐలు ఇప్పుడు సరికొత్త సాంకేతిక విప్లవం. ఈ రంగాల్లో ఏపీకి కొన్ని సానుకూలతలున్నాయి. ఏపీలో స్పేస్ సిటీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఎరో స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. ఆగస్టు 15నుంచి వందశాతం పౌరసేవలు వాట్సాప్ ద్వారానే అందిస్తాం. డేటా లేక్‌పై ఏపీ ప్రస్తుతం పనిచేస్తోంది. పౌరుల నివాసాలు జియో ట్యాగింగ్, సర్వీస్ డెలివరీ, ఆన్ లైన్ ఫౖౖెల్స్, క్లౌడ్ డేటాలను పాలనలో వినియోగిస్తున్నాం. సీసీ కెమెరాలు, సెన్సార్లు, వేరబుల్స్ ద్వారా రియల్ టైమ్ డేటా వస్తోంది. వీటిని విశ్లేషించాలంటే క్వాంటం కంప్యూటింగ్ అవసరం. వ్యవసాయ రంగంలో భూమిలో తేమ, ఎరువుల వినియోగంలాంటి అంశాలను కూడా క్వాంటం కంప్యూటింగ్‌తో అనుసంధానిస్తే అద్భుతాలు చేయొచ్చు. క్వాంటం టెక్నాలజీలో స్టార్టప్‌లు కూడా వస్తే అవకాశాలు విస్తృతమవుతాయి. ఫార్మా రంగంలోనూ, వ్యక్తుల ఔషధ వినియోగంవంటి వాటిపైనా పరిశోధనలు సాగించవచ్చు. క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికతను మరోస్థాయికి చేరుస్తుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
క్వాంటం టెక్నాలజీలో పెట్టుబడులు, స్టార్టప్‌లకు ఆహ్వానం
క్వాంటం రంగంలో స్టార్టప్‌లు రావడానికి విస్తృత అవకాశాలున్నాయని, ఆవిష్కరణకు ఆకాశమే హద్దని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి సహా ఐదు ప్రాంతాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలు, స్టార్టప్‌లకు సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘‘ఈ మూమెంటంలో బహుళజాతి కంపెనీలు భాగస్వాములు కావాలి. ఇప్పుడే పెట్టుబడులతో ముందుకు రావాల్సిన అవసరముంది. భారత్‌లోనే ఉత్పత్తులు తయారు చేసి ఇక్కడి మార్కెట్‌ను వినియోగించుకోవాలి. ఏపీలోనూ వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌ను తయారు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నాం. పాలనలో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం తీసుకురావడానికి ఐటీ ఒక్కటే మార్గమని బలంగా విశ్వసించాను. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మించడం ద్వారా ఒక బలమైన ఐటీ ఎకోసిస్టమ్‌ను సృష్టించాం. ఫలితంగా ఇప్పుడు సైబరాబాద్ ప్రపంచ ఐటీ కేంద్రంగా మారిందని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 75 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. అమరావతి క్వాంటం వ్యాలీ దేశానికి మార్గనిర్దేశనం చేయాలి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
క్వాంటం టెక్నాలజీ విజన్ లక్ష్యాలను మంత్రి లోకేష్ సాధించాలి
కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో చదువుకున్న నారా లోకేష్ ఐటీ మంత్రిగా ఉండటం సంతోషదాయకమని, గతంలో ఈ శాఖను గ్రాడ్యుయేషన్ చదువుకున్నవారు నిర్వర్తించారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. లోకేష్‌కు క్వాంటం వ్యాలీ ద్వారా ఒక విజన్ లక్ష్యాలను సాధించే బాధ్యతను అప్పగించానని ముఖ్యమంత్రి తెలిపారు. తాను నిత్య విద్యార్థినని, భవిష్యత్ టెక్నాలజీని పాలనకు, అభివృద్ధికి ఎలా సమ్మిళితం చేయాలన్నదే తన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం సహకారంతో సాధిస్తామని అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం కంప్యూటర్ ప్రోటోటైప్‌ను ఐబీఎం నేషనల్ వర్క్ షాప్‌లో ప్రదర్శించింది. నేషనల్ వర్క్ షాప్‌లో భాగంగా ఏర్పాటు చేసిన క్వాంటం టెక్నాలజీ స్టార్టప్‌లను మంత్రి లోకేష్‌తో కలిసి సీఎం పరిశీలించారు.